breaking news
governor kota
-
వివాదంలో ‘గవర్నర్ కోటా’
రాష్ట్రాల్లో అసెంబ్లీలుండగా శాసన మండళ్ళు అవసరమా అన్న వాదనతోపాటే ఆ శాసన మండళ్ళకు కొందరు సభ్యుల్ని నామినేట్ చేయటానికి గవర్నర్లకుండే అధికారాలపై, ఆ కోటాలో ఎంపికైన అభ్యర్థుల అర్హతలపై కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంటుంది. తెలంగాణ శాసన మండలికి నిరుడు గవర్నర్ కోటాలో ఎంపికైన విద్యావేత్త ప్రొఫెసర్ కోదండరామ్, పాత్రికేయుడు అమేర్ అలీఖాన్‌ల సభ్యత్వాలు రద్దుచేస్తూ బుధవారం సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలీయటంతో ఆ అంశాలపై మళ్లీ చర్చ మొదలైంది. రాష్ట్రాల్లో శాసన మండళ్ళ మాదిరే కేంద్ర స్థాయిలో ఉండే రాజ్యసభకు చేసే ఎంపికలు కూడా అందరిలో ఆసక్తి రేపుతాయి. అంతేకాదు... వివాదాలకూ, అభ్యంతరాలకూ దారితీస్తుంటాయి. పాలకులుగా ఎవరున్నా ఈ రివాజు మారదు. ఇప్పుడు ఎమ్మెల్సీ సభ్యత్వాలు రద్దయిన ప్రొఫెసర్ కోదండరామ్, అమేర్ అలీఖాన్‌ల నేపథ్యం చూస్తే గవర్నర్ కోటాలో ఎంపికకు వారికి అన్ని విధాలా అర్హతలున్నాయని అర్థమవుతుంది. తెలంగాణ సాధనలో జేఏసీ కన్వీనర్‌గా ప్రొఫెసర్ కోదండరామ్ పాత్ర తెలియనివారు లేరు. ఉర్దూ పత్రిక ‘సియాసత్’లో సీనియర్ పాత్రికేయుడైన అమేర్ అలీఖాన్ విద్యా, సంక్షేమ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే స్థానాలకు దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణలను ఎంపిక చేసింది. వీరిద్దరికీ కూడా సామాజిక ఉద్యమాల్లో, సేవాకార్యకలాపాల్లో పాల్గొన్న చరిత్ర ఉంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ పాలిస్తున్నప్పుడు గవర్నర్ కోటా ఎంపికలపై రాష్ట్ర మంత్రివర్గ సిఫార్సులకు గవర్నర్ నుంచి దాదాపు అభ్యంతరాలు వినబడవు. వేర్వేరు ప్రభుత్వాలున్నప్పుడే సమస్యంతా! విపక్షాలు ఎటూ అన్ని వేళలా విమర్శిస్తాయి. అయితే గవర్నర్ కోటాకు వీలు కల్పించే రాజ్యాంగంలోని 171(5) అధికరణం స్ఫూర్తిని చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు బేఖాతరు చేస్తున్నాయనీ, ‘రాజకీయ నిరుద్యోగుల’ పునరావాసానికి దాన్ని వినియోగిస్తున్నారనీ ఆరోపణలున్నాయి. ఆ అధికరణం ప్రకారం సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, కళ, సహకారోద్యమం, సామాజిక సేవ తదితర రంగాల్లో పాటుబడినవారిని, ఆ రంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం, వ్యావహారిక అనుభవం ఉన్నవారిని గవర్నర్ కోటాలో నామినేట్ చేయొచ్చు. మేధావులూ, కళాకారులూ, సేవాతత్పరత కలిగినవారూ నేరుగా పోటీచేసి నెగ్గే అవకాశం తక్కువ కాబట్టి శాసనాల రూపకల్పనలో, పాలనలో అటువంటివారి సేవలు పొందాలన్న ఉద్దేశంతో ఈ కోటా ఏర్పాటు చేశారు. ఇలాంటివారితో ఏర్పడే సభ కనుకే పెద్దల సభ అనీ, ఎగువసభ అనీ శాసన మండళ్ళకూ, రాజ్యసభకూ పేరుంది. రాజ్యాంగంలోని 80వ అధికరణం రాజ్యసభకు రాష్ట్రపతి కోటా కింద ఎంపిక చేసే వీలు కల్పిస్తోంది. అయితే దేశ చరిత్రలో కేబినెట్ సిఫార్సు లేకుండా గవర్నర్ తనంత తానే నామినేట్ చేసిన ఏకైక ఉదంతం ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 1952లో సీనియర్ నాయకుడు చక్రవర్తి రాజగోపాలాచారిని నాటి గవర్నర్ శ్రీ ప్రకాశ ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. అప్పటి ఎన్నికల్లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని కూటమి అధిక స్థానాలు గెల్చుకోవటం, కాంగ్రెస్ మైనారిటీలో పడటంతో నాటి ప్రధాని నెహ్రూ మంత్రాంగం నడిపి అనారోగ్యంతో ఉన్న రాజగోపాలాచారిని సీఎంగా రప్పించారు. అటుపై ఉప ఎన్నిక ద్వారా ఎమ్మెల్యే కావాలని ఆదేశించినా రాజగోపాలాచారి తిరస్కరించటంతో నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేశారంటారు. బల నిరూపణ సమయానికి రాజగోపాలాచారి ఫిరాయింపుల్ని ప్రోత్సహించి పదవి నిలబెట్టుకున్నారు. శ్రీ ప్రకాశ తీరును మాత్రం ఇప్పటికీ ‘రాజ్యాంగ అనౌచిత్యం’గా రాజ్యాంగ నిపుణులు అభివర్ణిస్తారు.దేశవ్యాప్తంగా చాలాచోట్ల ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులైన మేధావులూ, కళాకారులూ, సాహితీవేత్తలూ లేకపోలేదు. అయితే ఆ యా రంగాల్లో ఎన్నదగిన వైశిష్ట్యం ఉన్నా, రాజకీయ అనుకూలతలు తోడైనప్పుడే వారికి పదవులు దక్కుతున్నాయి. పదవులిస్తామన్నా వద్దని తిరస్కరించినవారూ లేకపోలేదు. కర్ణాటక సీఎంగా దేవరాజ్ అర్స్ ఉన్నప్పుడు సీనియర్ పాత్రికేయుడు టీఎస్ రామచంద్రరావుకూ, రామకృష్ణ హెగ్డే సీఎంగా ఉన్నప్పుడు సాహితీవేత్త దేవనూర్ మహదేవకూ గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అవకాశమిస్తామని చెప్పినా వారు తిరస్కరించారు. నిరుడు అక్టోబర్‌లో మహారాష్ట్రలో గవర్నర్ కోటా కింద 12 మందిని ఎంపిక చేసినప్పుడు కూడా వివాదం రాజుకుంది. వారిలో కొందరు రాజ్యాంగం నిర్దేశిస్తున్న నిబంధనలకు తగినవారే అయినా, కొందరు పూర్తిగా రాజకీయ ప్రాపకంతోనే ఎంపికయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. ఎటూ వచ్చే నెల 17న సర్వోన్నత న్యాయస్థానం తాజా వివాదంలో తదుపరి విచారణ కొనసాగిస్తుంది. దీనిలో వెలువడే తుది తీర్పు ప్రభుత్వాలకు మార్గదర్శకం కాగలిగితే మంచిదే! -
ఎమ్మెల్సీలుగా కోదండరాం,ఆమేర్ అలీఖాన్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామారెడ్డి (కోదండరాం), ఆమేర్ అలీఖాన్‌లను నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా గతంలో నియమితులైన డి.రాజేశ్వర్‌రావు, ఫారూక్ హుస్సేన్‌ల పదవీకాలం 2023 ఏప్రిల్ 27తో ముగిసిపోగా, అప్పటి నుంచి ఈ రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రెండు స్థానాల్లో దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను నియమించాలని ప్రతిపాదించగా, నిబంధనల ప్రకారం వీరికి అర్హతలు లేవని గవర్నర్ తమిళిసై అప్పట్లో తిరస్కరించారు. ఈ అభ్యర్థులిద్దరూ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరామారెడ్డి, ఆమేర్ అలీఖాన్‌ల పేర్లను ప్రతిపాదించగా, గవర్నర్ తమిళిసై సత్వరమే ఆమోదించారు. తెలంగాణ ఉద్యమంలో టీజేఏసీ చైర్మన్‌గా ప్రొఫెసర్ కోదండరాం కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన తెలంగాణ జన సమితి (టీజేఎస్) పేరుతో పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇక ఆమేర్ అలీఖాన్ ఉర్దూ దినపత్రిక సియాసత్‌కి న్యూస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. -
ఇది ద్వంద్వ నీతి కాదా?
సాక్షి, హైదరాబాద్/గజ్వేల్: రాజకీయ పార్టీల్లో కొన సాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభు త్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి నిరాకరించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సిఫారసు చేస్తే, ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే ఎమ్మెల్సీగా ఆమోదించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ‘ఇది ద్వంద్వ నీతి కాదా? గవర్నర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్టు కాదా?’ అని శుక్రవారం ‘ఎక్స్’లో నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రి మరోసారి బయటపడిందని అన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలైందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ను అణగదొక్కాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. గతంలో కూడా క్రీడా, సాంస్కృతిక, విద్య, సామాజిక, సేవా రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసిందని, అప్పుడు కూడా గవర్నర్ రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సంప్రదాయాలు అన్ని పార్టీల విషయంలో ఒకే రకంగా ఉండాలని, కానీ గవర్నర్ బీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు తేడా చూపిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల అప్పగింత గొడ్డలిపెట్టు లాంటిదే.. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు సాగునీటి ప్రాజెక్టులను అప్పగించాలనే నిర్ణయం తెలంగాణకు గొడ్డలిపెట్టు లాంటిదని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలకు తాగు, సాగునీరు, విద్యుత్ అవసరా లకు ఆటంకం కలుగుతుందని చెప్పారు. జల విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉండదని అన్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరి గిన బీఆర్ఎస్పీపీ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం.. తెలంగాణ నీటి వాటా తేల్చేవరకు, ఇతర మార్గదర్శకాలపై స్పష్టత ఇవ్వకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేద ని తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం.. ఢిల్లీలో సంతకాలు పెట్టిందంటూ కేంద్రం మినిట్స్ విడు దల చేయగా, రాష్ట్ర మంత్రులు మేం సంతకాలు పెట్టలేదని మాట్లాడటం శోచనీయమని అన్నా రు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. దీనిపై కేంద్ర జలవనరుల శాఖామంత్రిని తమ పార్టీ పార్లమెంటరీ బృందం కలిసి వినతిపత్రం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపా రు. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పై బురద చల్లడం మానుకొని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంపై దృష్టి పెట్టాలని అన్నారు. ఆదిలాబాద్‌కు వచ్చిన ప్పుడు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరిస్తామని మాట ఇచ్చిన బీజేపీ అగ్రనేత అమిత్‌షా తన మాటను నిలబెట్టుకోవాలని, బీసీ గణన చేపట్టాలని ఈ సందర్భంగా హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
మధుసూదనాచారికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లో ఎమ్మెల్సీ మధుసూదనాచారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 7కు వాయిదా వేసింది. గతంలో గవర్నర్ కోటాలో గోరటి వెంకన్న, దయానంద్, బసవరాజు సారయ్యలను మంత్రి వర్గ సిఫారసు మేరకు గవర్నర్ తమిళిసై నియమించారు. వీరి నియామకాన్ని సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త ధనగోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో గవర్నర్ తన పేరును ఎమ్మెల్సీగా ప్రతిపాదించి చీఫ్ సెక్రటరీకు పంపారు. అనంతరం ఎం. శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలం ముగియడంతో మరో స్థానం ఖాళీ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థానానికి అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేరును సిఫారసు చేయడంతో.. గవర్నర్ ఆ మేరకు నామినేట్ చేశారు. ఈ నామినేషన్‌ను వ్యతిరేకిస్తూ పిటిషనర్ ధనగోపాల్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. మధుసూదనా చారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారని.. అలాంటి వారిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సిఫార్సు చేస్తూ రాజకీయ పునరావాసం కల్పిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది మామిడి వేణుగోపాల్ హాజరయ్యారు. ధర్మాసనం ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించింది. మధుసూదనాచారికి నోటీసులు జారీ చేసింది. -
ఎమ్మెల్సీగా కర్నె ప్రభాకర్ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కర్నె ప్రభాకర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ఆయన గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈరోజు ఉదయం కర్నె ప్రభాకర్ ఎల్బీనగర్ రింగ్రోడ్లోని తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించి, అక్కడ నుంచి ప్రమాణ స్వీకారానికి బయల్దేరారు. కాగా టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ప్రభాకర్ పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున మునుగోడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో పొత్తు కారణంగా పోటీ చేయలేకపోయారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఆయన ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. -
ఎమ్మెల్సీగా కర్నె ప్రభాకర్ నియామకం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న కర్నె ప్రభాకర్‌ను తెలంగాణ శాసన మండలి సభ్యుని(ఎమ్మెల్సీ)గా నియమించారు. గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా నియమించారు. గత నెలలో జరిగిన మంత్రి మండలి సమావేశంలో ప్రభాకర్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖ రావు స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడుగా ఉన్న కర్నె ప్రభాకర్ గత ఎన్నికలలో నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే అక్కడ నుంచి టిఆర్ఎస్ తరపున కోసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ప్రభాకర్ పార్టీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున మునుగోడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో పొత్తు కారణంగా పోటీ చేయలేకపోయారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా అవకాశం దక్కలేదు. కర్నె ప్రభాకర్ స్వస్థలం సంస్థాన్ నారాయణపురం. తండ్రి జంగప్ప ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. కర్నెప్రభాకర్ ప్రాథమిక విద్యాభ్యాసం సంస్థాన్ నారాయణపురంలోని ప్రభుత్వ పాఠశాలలో కొనసాగింది. ఇక్కడే పదో తరగతి పూర్తి చేశారు. ఇంటర్, డిగ్రీ భువనగిరిలోని ఎస్ఎల్ఎన్ఎస్ కళాశాలలో చదివారు. అనంతరం జర్నలిజం కోర్సు కూడా పూర్తి చేశారు. -
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నాయని ఎంపిక
-
గవర్నర్ కోటాలో పేర్లు ఖరారు చేసిన కేసిఆర్
-
కంతేటి, ఎల్లయ్య, రత్నాబాయి పేర్లు ఖరారు
న్యూఢిల్లీ: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న నాలుగు నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలకు ముగ్గురు పేర్లను కాంగ్రెస్ ఖరారు చేసింది. కంతేటి సత్యనారాయణరాజు, నంది ఎల్లయ్య, రత్నాబాయి పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. నామినేటెడ్ ఎమ్మెల్సీల రేసులో పలువురు నేతలు నిలిచినప్పటికీ పీసీసీ క్రమశిక్షణ సంఘం కమిటీ ఛైర్మన్ కంతేటి సత్యనారాయణరాజు, పదవీకాలం పూర్తి కానున్న ఎంపీలు నంది ఎల్లయ్య, రత్నాబాయిలకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణి పేరు కూడా వినిపించినప్పటికీ ఆమెకు అవకాశం దక్కలేదు. అయితే నాలుగో స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీన్ని ఎవరికి కట్టబెడతారనే దానిపై కాంగ్రెస్ పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. ఆశావహలు నాలుగో సీటుపై ఆశలు పెట్టుకున్నారు.