
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తన మాట వినని దేశాలపై తోచిన మోతాదులో సుంకాలు వేయటం నిత్యకృత్యమైంది. ఈ క్రమంలో న్యాయం, ధర్మం, విచక్షణ, హేతుబద్ధత వగైరాలు లేవు. రెండోసారి దేశాధ్యక్షుడైనా తమ దేశం ఎవరెవరితో ఏ స్థాయి వాణిజ్యం నెరపుతున్నదో తెలియని ట్రంప్... వేరే దేశాలు ఎవరితో ఎలాంటి సంబంధాలు నెలకొల్పుకోవాలో, వద్దో నిర్ణయించటానికి తగుదునమ్మా అంటూ తయారయ్యారు.
ఈనెల 1 నుంచి మన దేశంపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు లోగడ ప్రకటించిన ట్రంప్, వారం తిరగకుండానే మరో 25 శాతం మేర సుంకాలుంటాయని తాజాగా నిర్ణయించారు. ఇవిగాక పరోక్ష సుంకాలు మొదలవు తాయట. ఇవన్నీ 250 శాతం దాటినా దాటొచ్చని లోగడే ఆయన సెలవిచ్చారు. తన మాట నెగ్గటానికి కనిపించిందల్లా విసిరికొట్టే అల్లరిపిల్లల మొండిధోరణికీ, ట్రంప్ చేష్టలకూ తేడా ఉందా? తనకు రష్యా నచ్చలేదు గనుక ఆ దేశం నుంచి ముడి చమురు కొనరాదని ఆయన శాసిస్తున్నారు.
ఉక్రెయిన్‌తో జగడం ఆపేయాలని పదే పదే కోరుతున్నా వినని రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అక్కసుతో ఇవన్నీ చేస్తున్నట్టు అందరికీ కనబడుతోంది. కానీ అసలు కారణాలు వేరు. నిజానికి రష్యా చమురు కొని ప్రపంచమార్కెట్లు స్థిరంగా ఉండేలా చూడమని గతంలో చెప్పింది అమెరికాయే!
ప్రేమాభిమానాలను అపాత్రదానం చేయకూడదు. ట్రంప్ వ్యవహారశైలి చూచాయగా తెలుస్తున్నా, తొలి దఫాలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయన పట్ల సానుకూలంగా ఉన్నారు. దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలకు సానుకూలత అవసరమే. కానీ దానికి కూడా అవధులుంటాయి. 2019 సెప్టెంబర్‌లో అమెరికాలోని టెక్సాస్‌లో ‘హౌడీ మోదీ’ కార్యక్రమమైనా,ఆ మరుసటేడాది ట్రంప్ భారత్ సందర్శించినప్పుడు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ‘నమస్తే ట్రంప్’ అయినా దౌత్య పరిమితులు దాటాయన్న విమర్శలు వచ్చాయి.
ప్రభుత్వం సంగతి సరే... పౌరులు కూడా ఆ మాదిరే ఉన్నారు. అమెరికాలోని కొందరు ఎన్నారైలు ఆయన దేశాధ్యక్షుడు కావాలని యజ్ఞయాగాదులు చేశారు. అంతేకాదు... ప్యూ రీసెర్చ్ సంస్థ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ప్రపంచ వ్యవహారాల్లో ట్రంప్ వ్యవహారశైలిపై 24 దేశాల్లో 28,333 మందిని సర్వే చేస్తే సగం మంది భారతీయులు ఆయనపై విశ్వాసం వ్యక్తపరిచారట. ఆ సంగతి అప్పట్లో ఆ సంస్థ ప్రకటించింది. టర్కీ, జర్మనీ, మెక్సికో లాంటి దేశాల్లో మాత్రం అత్యధికులు (80 శాతం పైగా) ట్రంప్‌పై నమ్మకం లేదని తెలిపారు. ఈ ఫలితాల్లో మనం హంగేరి, ఇజ్రాయెల్, నైజీరియా, కెన్యాల సరసన చేరాం.
అయితే ట్రంప్ వికృత విన్యాసాలు గమనించాక మోదీ ఆయన విషయంలో దృఢవైఖరి ప్రదర్శిస్తున్నారు. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి అన్నదాతల, మత్స్యకారుల ప్రయోజనాలను విస్మరించే ప్రశ్నే లేదని గురువారం ఆయన మరోసారి కుండబద్దలు కొట్టారు. ఇందుకు వ్యక్తిగతంగా మూల్యం చెల్లించాల్సి వచ్చినా సిద్ధమేనన్నారు. మోదీ, ట్రంప్‌ల మైత్రి గురించి ఉన్న అభిప్రాయంతో సుంకాల ఒప్పందంలో అమెరికాదే పైచేయి అవుతుందనుకున్న మన విపక్షాలకు ఇది నిరాశ కలిగించే పరిణామమే.
దేశంలో 70 కోట్లమంది ప్రజానీకం ఆధారపడి బతికే రంగాలను విదేశాలకు గంపగుత్తగా అప్పగించే దుస్సాహసం ఎవరైనా చేయగలుగుతారా? పైగా అవి జన్యుమార్పిడి చేసినవి. ఆ చెత్త మన మార్కెట్లను ముంచెత్తితే కలిగే దుష్పరిణామాల గురించి చాన్నాళ్లుగా పర్యావరణవాదులు చెబుతూ వచ్చారు. తమ సాగు, పాడి ఉత్పత్తులపై అసలు సుంకాలే విధించరాదన్నది ట్రంప్ ఆంతర్యం.
ఆశపడటం సహజం... కానీ అది దురాశగా మార రాదని ఆయన గారికి చెప్పేదెవరు? ‘జీరో’ సుంకాల సంగతి బహిరంగంగా చెబితే నలుగురూ నోళ్లు నొక్కుకుంటారని ట్రంప్ భయపడి రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపుతూ, రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లు ఆపాలన్న రాగం అందుకున్నారు. ఏ సరుకు ధరైనా మార్కెట్ శక్తులు నిర్ణయించే వర్తమానంలో రష్యా నుంచి చవగ్గా కొనరాదని, దాన్ని హెచ్చు ధరకు అమ్మ రాదని ఆంక్షలు విధించాలని చూడటం ట్రంప్ తెలివితక్కువతనం. అమెరికా ఇన్నాళ్లూ ప్రవచించిన ప్రపంచీకరణకు వ్యతిరేకం. పైగా చైనాతో పోలిస్తే మన ముడిచమురు కొనుగోళ్లు తక్కువ. అయినా ఆ దేశంపై ట్రంప్ సానుకూలంగా ఉన్నారు.
ట్రంప్ పాత, కొత్త సుంకాలు అమలైతే భారత్ జీడీపీపై 0.6 శాతం ప్రభావం పడుతుందని ప్రముఖ మదుపు సంస్థ గోల్డ్‌మాన్ శాక్స్ ప్రకటించింది. ఇదిగాక వాణిజ్య అనిశ్చితి వల్ల పరోక్ష ప్రభావం ఉండొచ్చని ఆ సంస్థ చెబుతోంది. మొత్తానికి ట్రంప్ ఇదే మంకుపట్టుతో ఉంటే మనకు ఏదోమేర సమస్యలుండక తప్పదు. ఈ వైరం మనం కోరుకున్నది కాదు. అయినా వచ్చి పడింది. కనుక కలిసికట్టుగా ఉండి ఎదుర్కొనటమే ఏకైక మార్గం.