స్వేచ్ఛావాణిజ్యం కల సాకారం | Sakshi Editorial On Britain, India trade | Sakshi
Sakshi News home page

స్వేచ్ఛావాణిజ్యం కల సాకారం

Jul 25 2025 4:06 AM | Updated on Jul 25 2025 5:45 AM

Sakshi Editorial On Britain, India trade

దాదాపు నాలుగేళ్ల కాలం... పదహారు దఫాల చర్చలు... నలుగురు ప్రధానులు– ఎట్టకేలకు బ్రిటన్‌ అభీష్టం నెరవేరింది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ల సమక్షంలో రెండు దేశాల వాణిజ్య మంత్రులు పీయూష్‌ గోయెల్, జొనాథన్‌ రేనాల్డ్స్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై లండన్‌లో సంతకాలు చేశారు. ఈ ద్వైపాక్షిక ఒప్పందాన్ని బ్రిటన్‌ పార్లమెంటు ధ్రువీకరించాల్సి వుంది. 

ఆ ప్రక్రియకు ఏడాది సమయం పడుతుందంటున్నారు. 2030 నాటికి ఇరు దేశాల వాణిజ్య పరిమాణం 12,000 కోట్ల డాలర్లకు చేరుకోవాలన్నది ఎఫ్‌టీఏ లక్ష్యం. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతున్న భారత్‌తో ఎఫ్‌టీఏ సాకారం కావాలని ఆ దేశం ఎంతగానో ఎదురుచూసింది. అందుకు కారణముంది. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి బయటికొచ్చాక సాగిస్తున్న ఒంటరి ప్రయాణం దాని ఆర్థిక వ్యవస్థను ఒడిదుడుకుల్లో పడేసింది. 

ఒకప్పుడు ప్రపంచంలో రవి అస్తమించని సామ్రాజ్యాన్నేలిన దేశం నేల చూపులు చూడటం మొదలైంది. అందుకే కన్సర్వేటివ్‌ పార్టీకి చెందిన బోరిస్‌ జాన్సన్‌ ప్రధానిగా వున్నప్పుడు 2022లో తొలిసారి ఎఫ్‌టీఏ కుదుర్చుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. ఆయన స్థానంలో అదే పార్టీకి చెందిన లిజ్‌ ట్రస్‌ వచ్చారు. ఆమె 49 రోజుల్లోనే పదవి పోగొట్టుకున్నారు. తదనంతరం భారత్‌ మూలాలున్న రిషి సునాక్‌ ప్రధాని అయ్యారు. 

ఆయన కూడా నిష్క్రమించి ఎన్నికల్లో లేబర్‌ పార్టీ విజయం సాధించి ప్రస్తుత ప్రధాని స్టార్మర్‌ బాధ్యతలు స్వీకరించారు. వీరిలో అందరూ భారత్‌తో ఎఫ్‌టీఏ కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చినవారే. మొన్నటి ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ప్రధాన వాగ్దానాల్లో భారత్‌తో ఎఫ్‌టీఏ కుదుర్చుకుంటామన్నది ఒకటి. 

మొత్తానికి అనేక రకాల అడ్డంకులూ, అపోహలూ అధిగమించి ఒప్పందం సాకారమైంది. ఎఫ్‌టీఏ వల్ల బ్రిటన్‌లో ఏటా కొత్తగా 2,200 ఉద్యోగాలొస్తాయని, దేశ జీడీపీ 480 కోట్ల పౌండ్ల (రూ. 56,150 కోట్లు) మేర పెరుగుతుందని అంచనా. అయితే రెండు దేశాల్లోనూ ఎఫ్‌టీఏపై అసంతృప్తి తక్కువేమీ లేదు. 

ఈ ఒప్పందం వల్ల ప్రధానంగా లాభపడేది స్కాచ్‌ విస్కీ, జిన్‌ ఉత్పత్తిదార్లు, బ్రిటన్‌ కార్ల పరిశ్రమలు. జిన్, స్కాచ్‌ విస్కీలపై ప్రస్తుతం 150 శాతం దిగుమతి సుంకాలుండగా, అవి 75 శాతానికి పడిపోతాయి. వచ్చే పదేళ్ల కాలంలో 40 శాతానికొస్తాయి. అలాగే బ్రిటన్‌ కార్లపై ప్రస్తుతం 100 శాతం సుంకాలున్నాయి. 

అవి పది శాతానికి పడిపోతాయి. ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాలకు ఇది ఊరటనిచ్చే కబురు. మన ఎలక్ట్రిక్, హైబ్రిడ్‌ కార్లకు కూడా గిరాకీ ఏర్పడుతుంది. ఈ రంగంలో టాటాలకు డబుల్‌ ధమాకా అని చెప్పాలి. బ్రిటన్‌లో ఆ సంస్థ ఉత్పత్తి చేసే జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌లకు మన దేశంలో... ఇక్కడ ఉత్పత్తయ్యే టాటా ఎలక్ట్రిక్, హైబ్రిడ్‌ కార్లకు బ్రిటన్‌లో మార్కెట్‌ లభ్యత పెరుగుతుంది. 

మన దేశం నుంచి వెళ్లే  99 శాతం ఎగుమతులకు కూడా ఎఫ్‌టీఏ అమల్లోకొస్తే సుంకాల బెడద వుండదు. బ్రిటన్‌ నుంచి మనకొచ్చే దిగుమతులపై సుంకాలు 15 శాతం నుంచి ఒక్కసారిగా 3 శాతానికి పడిపోతాయి. చాలా సరుకులపై కస్టమ్స్‌ సుంకాలు తగ్గిపోతాయి. మన సాగు రంగానికి ఎఫ్‌టీఏ ఎంతగానో దోహదపడుతుందని వాణిజ్య నిపుణులంటున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌కు మన వార్షిక సాగు ఎగుమతుల విలువ కేవలం 81 కోట్ల డాలర్లు. 

ఈ ఒప్పందం వల్ల మన నుంచి తేయాకు, మామిడిపళ్లు, ద్రాక్ష, సుగంధ ద్రవ్యాలు, చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు వగైరాల ఎగుమతులు అపారంగా పెరుగుతాయని అంచనా వుంది. సేవల రంగా నికి సంబంధించినంతవరకూ యోగా బోధకులు, సంగీతవేత్తలు, పాకశాస్త్ర ప్రవీణులకు డిమాండ్‌ పెరుగుతుంది. ఈ రంగాల్లో పనిచేసే వారికోసం ఏటా 1,800 వీసాలు జారీచేస్తారు. 

వాహన విడి భాగాలు, వస్త్రాలు, పాదరక్షలు, క్రీడోపకరణాలు, ఆటబొమ్మలు, బంగారం, వజ్రాభరణాలు, ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు, సేంద్రీయ రసాయనాలు, ఇంజిన్లు వగైరాలపై దాదాపు 4 నుంచి 16 శాతం వరకూ సుంకాలు విధిస్తున్నారు. ఒప్పందం అమల్లోకొస్తే ఆ సుంకాలు కనుమరుగవుతాయి. కనుక ఎగుమతులు ఊపందుకుంటాయి. పర్యవసానంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

ఎఫ్‌టీఏపై రెండు దేశాల్లోనూ విమర్శలూ, ఆందోళనలూ వున్నాయి. ఇది అమల్లోకొస్తే స్వల్పకాలిక వీసాపై వచ్చే భారతీయ కార్మికులకూ, వారి యాజమాన్యాలకూ జాతీయ బీమా సంస్థ ఎన్‌ఐసీకి చేసే చెల్లింపుల నుంచి మూడేళ్ల మినహాయింపు ఇవ్వదల్చుకున్నారని, ఇందువల్ల దేశ ఖజానాకు ఏటా పది లక్షల పౌండ్ల నష్టంతోపాటు దేశీయ కార్మికుల ఉపాధికి గండిపడుతుందని కన్సర్వేటివ్‌ పార్టీ ఆరోపిస్తోంది. 

ప్రస్తుతం ఆ మినహాయింపు ఏడాది కాలానికి మాత్రమే వుంది. వలస విధానం మారదని, ఇప్పటికన్నా భారతీయ కార్మికుల సంఖ్య పెరిగే అవకాశం లేదని ప్రభుత్వం చెబుతోంది. తమ రంగాన్ని ఎఫ్‌టీఏ విస్మరించిందని, మేధోహక్కుల పరిరక్షణ సంగతి పట్టించుకోలేదని బ్రిటన్‌ ఫార్మా రంగం ఆరోపణ. ఒకవేళ పట్టించుకుని ఉంటే మన దేశంలో జెనెరిక్‌ ఔషధ పరిశ్రమ దెబ్బతింటుంది. 

ఆటోమొబైల్‌ విడిభాగాల రంగంలో బ్రిటన్‌ ప్రవేశిస్తే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) రంగం నష్టపోతుంది. అందుకు ప్రతిగా మన ఎంఎస్‌ఎంఈలకు కూడా బ్రిటన్‌ చోటిస్తే వేరుగా వుండేది. ఇక 2027 నుంచి బ్రిటన్‌ అమలుచేయబోతున్న ‘కార్బన్‌ టాక్స్‌’ అంశాన్ని ఏం చేశారో వెంటనే తెలియలేదు. కార్బన్‌ టాక్స్‌ వల్ల మన ఇనుము, ఉక్కు, అల్యూమినియం, ఎరువులు, సిమెంట్‌ రంగాలు దెబ్బతినే అవకాశం వుంది. మొత్తానికి ఎఫ్‌టీఏ అమల్లోకొచ్చాకే దాని అసలు కథ ఏమిటన్నది తెలుస్తుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement