
ఎఫ్‌టీఏపై సంతకాలు చేసిన భారత్, యునైటెడ్ కింగ్‌డమ్
భారత ఉత్పత్తులపై సుంకాలు సున్నాకు తగ్గించనున్న యూకే
భారతీయ రైతులు, ఎంఎస్‌ఎంఈలకు ప్రయోజనం
ఇండియన్ మార్కెట్‌లోకి చౌకగా బ్రిటిష్ విస్కీ, కార్లు, చాక్లెట్లు, ఇతర ఉత్పత్తులు
యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో నరేంద్ర మోదీ భేటీ
లండన్: భారత్, బ్రిటన్ సంబంధాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. పరస్పర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెండు రెట్లు పెంచుకోవాలని వ్యూహాత్మక భాగస్వామ్యపక్షాలైన భారత్, యూకే నిర్ణయించుకున్నాయి. అమెరికా వాణిజ్య విధానాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించాయి.
భారత ప్రధాని మోదీ గురువారం లండన్‌లో యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘యూకే–ఇండియా విజన్ 2035’ రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. అధికారికంగా సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ)గా పిలుస్తున్న డీల్‌పై మోదీ, కీర్ స్టార్మర్ సమక్షంలో భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, బ్రిటిష్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్ సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం వల్ల భారత్, యూకే మధ్య వాణిజ్యం ఏటా 34 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తు న్నారు. ఎఫ్‌టీఏపై సంతకాలు జరగడం పట్ల మోదీ హర్షం వ్యక్తంచేశారు. భారత్, యూకే సంబంధాల్లో ఇదొక చరిత్రాత్మక దినమని అభివరి్ణంచారు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయినట్లు తెలిపారు. కీర్ స్టార్మర్ స్పందిస్తూ.. యూరోపియన్ యూనియన్(ఈయూ) తా ము బయటకు వచి్చన అనంతరం కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం ఇదేనని స్పష్టంచేశారు.
ఉగ్రవాదంపై పోరులో ఐక్యంగానే..
కీర్ స్టార్మర్‌తో చర్చల అనంతరం ప్రధాని మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించినందుకు యూకే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, యూకే ఐక్యంగా పనిచేస్తున్నాయని చెప్పా రు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదన్నారు.
భారత్‌కు ఎనలేని మేలు
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత్‌కు ఎనలేని మేలు జరుగుతుందని ప్రధానమంత్రి వెల్లడించారు. భారత వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పరిశ్రమకు బ్రిటిష్ మార్కెట్‌లో నూతన అవకాశాలు లభిస్తాయన్నారు. భారతీయ యువత, రైతులు, మత్స్యకారులతోపాటు సూక్ష్మ, చిన్న, మ ధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్‌ఎంఈ) లబ్ధి చేకూరుతుందని స్పష్టంచేశారు. భారతీయ వ్రస్తాలు, పాదరక్షలు, వజ్రాలు, బంగారు ఆభరణాలు, సముద్ర ఆహారం, ఇంజనీరింగ్ వస్తువులకు యూకే మార్కెట్‌లోకి ప్రవేశం లభిస్తుందన్నారు. ‘విజన్–2030’ రోడ్‌మ్యాప్‌పై ఇండియా, యూకే అంకితభావంతో ముందుకెళ్తున్నాయని ఉద్ఘాటించారు.
మోదీకి స్టార్మర్ విందు
యూకే పర్యటన కోసం బుధవారం రాత్రి లండన్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో తరలివచి్చన ప్రవాస భారతీయులు ఆయనకు స్వాగతం పలికారు. లండన్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని తన నివాసంలో గురువారం మోదీకి బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. భారత్, యూకే కలిసికట్టుగా పనిచేస్తాయని స్టార్మర్ అన్నారు. రెండు దేశాలు సహజ భాగస్వామ్య పక్షాలు అని మోదీ చెప్పారు. చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించుకుంటున్నాయని తెలిపారు. డబుల్ కంట్రిబ్యూషన్స్ కన్వెన్షన్(డీసీసీ)పై ఏకాభిప్రాయానికి వచ్చామని వెల్లడించారు. రెండు దేశాల్లో టెక్నాలజీ, ఫైనాన్స్‌తోపాటు సేవల రంగానికి మేలు జరుగుతుందన్నారు. సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. భారత్–యూకే సంబంధాలపై మోదీ క్రికెట్ పరిభాషలో వివరణ ఇచ్చారు. కొన్నిసార్లు స్వింగ్ అండ్ మిస్ ఉండొచ్చని, అయినప్పటికీ ఎప్పటికీ స్ట్రెయిట్ బ్యాట్‌తో ఆడుతూనే ఉంటామన్నారు. హైస్కోరింగ్‌తోపాటు బలమైన భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాయని స్పష్టంచేశారు. మోదీ, స్టార్మర్ ‘బకింగ్‌హమ్ స్ట్రీట్ క్రికెట్ క్లబ్’ క్రీడాకారులతో సంభాíÙంచారు.
ఒప్పందంతో లాభమేంటి?
వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా భారత్, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడేళ్ల చర్చల తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇది అమల్లోకి వస్తే జరిగేది ఏమిటంటే..
→ బ్రిటిష్ ఉత్పత్తులపై ఇండియాలో సగటు సుంకాలు 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గిపోతాయి.
→ బ్రిటన్ నుంచి విస్కీ, చాక్లెట్లు, సాఫ్ట్ డ్రింకులు, కాస్మెటిక్స్, కార్లు, వైద్య పరికరాలు భారత మార్కెట్‌లోకి విస్తృతంగా ప్రవేశిస్తాయి.
→ బ్రిటిష్ విస్కీపై ప్రస్తుతం విధిస్తున్న 150 శాతం సుంకాన్ని భారత ప్రభుత్వం 75 శాతానికి తగ్గిస్తుంది. రాబోయే పదేళ్లలో 40 శాతానికి తగిస్తుంది. అంటే బ్రిటిష్ విస్కీ ఇండియాలో చౌకగా లభిస్తుంది.
→ భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులు, వస్తువులపై సుంకాలను యూకే సర్కార్ సగానికి తగ్గిస్తుంది. వ్రస్తాలు, పాదరక్షలు, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిపోతాయి.
→ ప్రధానంగా భారతీయ రైతులకు భారీ లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయ ఉత్పత్తులపై యూకేలో టారిఫ్‌లు దాదాపు 95 శాతం తగ్గుతాయి. జర్మనీ, నెదర్లాండ్స్‌తోపాటు ఈయూ రైతులతో సమానంగా, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువే భారతీయ రైతులు లాభపడతారు. ఇండియా నుంచి దిగుమతి అయ్యే తేయాకు, పండ్లు, కూరగాయలు, మసాలా పొడులు, తృణధాన్యాలు, పచ్చళ్లు, రెడీ–టు–ఈట్ ఆహారం, పండ్ల గుజ్జుతోపాటు శుద్ధి చేసిన ఆహారంపై టారిఫ్‌లు సున్నాకు పడిపోతాయి.
→ మత్స్య, సముద్ర ఉత్పత్తులపై సుంకాలను 99 శాతం తగ్గించబోతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడులో చేపలు, రొయ్యల పెంపకం చేస్తున్న రైతులకు లాభమే.
→ ఇండియా నుంచి యూకేకు దిగుమతి అయ్యే స్మార్ట్‌ఫోన్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, ఇన్వర్టర్లపై ఎలాంటి టారిఫ్ ఉండదు.
→ దేశీయ మద్యం ఉత్పత్తులు, పానీయాలు యూకే మార్కెట్‌లోకి ప్రవేశించబోతున్నాయి. సంప్రదాయ గోవా ఫెనీ, నాసిక్ వైన్స్, కేరళ కల్లు ఇందులో ఉన్నాయి.
→ ఎఫ్‌టీఏతో రానున్న మూడేళ్లలో ఇండియా నుంచి యూకేకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 20 శాతానికి పైగా పెరుగుతాయని అంచనా. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.
→ దేశీయ రైతులు, పరిశ్రమలను దృష్టిలో పెట్టుకొని పాడి ఉత్పత్తులు, వంట నూనెలు, యాపిల్స్‌ను ఎఫ్‌టీఏ నుంచి భారత ప్రభుత్వం మినహాయించింది. బ్రిటన్ నుంచి వచ్చే ఈ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు ఉండబోదు.
మీరు ఆంగ్ల పదాలు వాడొచ్చు
ఎఫ్‌టీఏపై సంతకాల తర్వాత మోదీ, స్టార్మర్ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్టార్మర్ స్పీచ్‌ను హిందీలోకి అనువాదం చేస్తున్న దుబాసీ కొంత ఇబ్బందిపడ్డారు. ఆయనకు అప్పటికప్పుడు సరైన హిందీ పదాలు తగల్లేదు. అది గమనించిన మోదీ ‘‘ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మీరు మధ్యలో ఆంగ్ల పదాలు వాడొచ్చు. దాని గురించి చింతించకండి’’ అని సూచించారు. దుబాసీ క్షమాపణ కోరగా, ఫర్వాలేదని మోదీ అన్నారు. ఇదంతా చూసిన స్టార్మర్ చిరునవ్వు చిందించారు.