ఒకవేళ భజన అనే పోటీ గనుక ఒలింపిక్స్‌లో ఉండి ఉంటే.. పాకిస్తాన్‌కు కచ్చితంగా ఆ పోటీల్లో గోల్డ్ మెడల్ వచ్చి తీరేదేమో!. విన్నర్ పోడియంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉండి ఉండేవారేమో!.. ఈ మాటలు అంటోంది ఆ దేశ మాజీ దౌత్యవేత్త హుస్సేన్ హక్కానీ.
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై విపరీతమైన ప్రశంసలు గుప్పించాడు. కంబోడియా–థాయ్‌లాండ్ మధ్య తాజాగా కౌలాలంపూర్ ట్రంప్ సమక్షంలో శాంతి ఒప్పందం కుదరింది. ఈ నేపథ్యంలో.. శాంతి, స్థిరత్వానికి కృషి చేసే నాయకుండంటూ పాక్ ప్రధాని విపరీతమైన పొగడ్తలు గుప్పించారు.
మొన్న గాజా శాంతి ప్రణాళిక.. ఇప్పుడేమో ఇది. మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలో శాంతి కోసం ట్రంప్ చేసిన కృషి ప్రపంచాన్ని రక్షించింది. లక్షల మంది ప్రాణాలు పోకుండా నిలబెట్టింది అని షెహబాజ్ పేర్కొన్నారు.
దీనిపై పాకిస్తాన్ మాజీ అమెరికా రాయబారి హుస్సేన్ హక్కానీ, షెహబాజ్ షరీఫ్‌పై వ్యంగ్యంగా స్పందించారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్రంప్‌ను పొగడటంలో ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలిచే స్థాయిలో ఉన్నారంటూ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ఫరీద్ జకారియా వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ‘ఇది ఒలింపిక్ క్రీడ అయితే, షరీఫ్ పోడియం మీద గోల్డ్ మెడల్‌తో నిలిచేవారు అని అన్నారు.
ఈజిప్ట్‌లో జరిగిన గాజా శాంతి సదస్సులోనూ షరీఫ్ ట్రంప్‌ను విపరీతంగా పొడిగారు. ట్రంప్‌ను శాంతి పురుషుడిగా అభివర్ణిస్తూ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడంటూ మాట్లాడారు. ఆ సమయంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ చిత్రమైన హవభావాలు ప్రదర్శించడం విపరీతంగా వైరల్ అయ్యింది. షరీఫ్ మాటలతో కడుపు నిండిపోయిన ట్రంప్ ‘ఇక మాట్లాడేం లేదని, ఇంటికి వెళ్లిపోదాం’ అంటూ వ్యంగ్యంఆ స్పందించడం మరో కొసమెరుపు. అయితే షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలను పాక్ పౌరులే భరించలేకపోయారు. అంతలా దిగజారి పొగడాల్సిన అవసరం ఏముందంటూ.. ప్రధానిని తిట్టిపోశారు కూడా.


