
ఉద్యోగాల కల్పనకు దన్ను
2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు
సీఈవోల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: భారత్–యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంతో (సెటా) చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) ఊతం లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు ఇది దోహదపడుతుందని ఆయన చెప్పారు. సెటా దన్నుతో 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకోవాలన్న లక్ష్యాన్ని సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు.
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో కలిసి సీఈవోల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. రెండు పెద్ద దేశాల ఉమ్మడి పురోగతికి, ప్రజల శ్రేయస్సుకు సెటా తోడ్పడుతుందన్నారు. అలాగే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను నెలకొల్పగలిగే రంగాలను గుర్తించాలని పరిశ్రమ వర్గాలకు సూచించారు. పాలసీపరంగా స్థిరత్వం, అంచనాలకు అనుగుణమైన నియంత్రణ విధానాలు, భారీ స్థాయి డిమాండ్ లాంటివి భారత్‌కు సానుకూలాంశాలని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఫార్మా, ఇన్‌ఫ్రా, ఎనర్జీ, ఫైనాన్స్ తదితర రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలని బ్రిటన్ కంపెనీలను ఆహ్వానించారు.
ఇరు దేశాల బంధం బలోపేతం..
ప్రస్తుతం అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ సెటాతో భారత్–యూకే మధ్య బంధం మరింత పటిష్టమైందని ప్రధాని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం భారత్–యూకే ద్వైపాక్షిక వాణిజ్యం 56 బిలియన్ డాలర్లుగా ఉంది. నిర్దేశించుకున్న డెడ్‌లైన్ 2030 నాటికి దీన్ని రెట్టింపు చేసుకోగలమనే నమ్మకం ఉంది‘ అని చెప్పారు. ‘టెలికం, ఏఐ, బయోటెక్, క్వాంటమ్, సెమీకండక్టర్, సైబర్, స్పేస్ తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు అవకాశాలు ఉన్నాయి.
అలాగే కీలక లోహాలు, రేర్ ఎర్త్ మొదలైన విభాగాల్లోనూ నిర్మాణాత్మకంగా ముందుకెళ్లాలి. భారత్–యూకే ఉమ్మడిగా ప్రపంచంలో అగ్రగాములుగా నిల్చేందుకు అవకాశమున్న రంగాలను రెండు దేశాల వ్యాపార దిగ్గజాలు గుర్తించాలి. ఫిన్‌టెక్, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్ లేదా స్టార్టప్‌లు.. ఇలా ఏ రంగంలోనైనా సరే ఇరు దేశాలు కలిసి అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పాలి‘ అని మోదీ పేర్కొన్నారు. యూకేకి చెందిన తొమ్మిది యూనివర్సిటీలు భారత్‌లో క్యాంపస్‌లు ప్రారంభిస్తాయని ఆయన తెలిపారు.
పరిశ్రమకు పూర్తి సహకారం: స్టార్మర్
అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు తీసుకోతగిన చర్యలను సూచించాలని పరిశ్రమ దిగ్గజాలను స్టార్మర్ కోరారు. వాణిజ్య ఒప్పందం ప్రయోజనాలను పొందేందుకు పరిశ్రమకు కావాల్సిన పూర్తి సహకారాన్ని అందిస్తామని ఆయన చెప్పారు. జూలైలో సెటాపై సంతకాలు జరిగినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య 6 బిలియన్ పౌండ్ల మేర వాణిజ్యం, పెట్టుబడులు
నమోదయ్యాయని పేర్కొన్నారు.
భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి..
ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025లో పాల్గొన్న సందర్భంగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లను మోదీ ఆహ్వానించారు. తద్వారా భారత్ వృద్ధి గాథలో పాలుపంచుకోవాలని సూచించారు. బ్యాంకింగ్ వ్యవస్థ గతంలో కొందరికే పరిమితమై ఉండేదని, దాన్ని అందరికీ సాధికారత కల్పించే సాధనంగా డిజిటల్ టెక్నాలజీ మార్చిందన్నారు.
జేఏఎం (జన్‌ధన్, ఆధార్, మొబైల్) వ్యూహం ఇందుకు ఉపయోగపడిందని చెప్పారు. ‘సాంకేతికత, ప్రజలు, భూమి.. ఇలా అన్నింటికీ ప్రయోజనం చేకూర్చగలిగే ఫిన్‌టెక్ ప్రపంచాన్ని సృష్టించాలి. ఇన్నోవేషన్ లక్ష్యమనేది వృద్ధి మాత్రమే కాకూడదు, మేలు చేసేదిగా ఉండాలి. ఫైనాన్స్ అంటే కేవలం అంకెలు కాదు.. మానవాళి పురోగతికి దోహదకారిగా ఉండాలి‘ అని ప్రధాని చెప్పారు. భారత్ విషయంలో ఏఐ అంటే సమ్మిళితత్వానికి సంక్షిప్త రూపమని చెప్పారు.