లుఫ్తాన్సా విమానంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఓ భారతీయ విద్యార్థి.. తోటి ప్రయాణికులపై దాడి చేశాడు. పదునైన మెటల్ ఫోర్క్‌తో ఇద్దరు టీనేజర్లపై దాడికి పాల్పడ్డాడు. షికాగో నుంచి జర్మనీకి ప్రయాణిస్తున్న విమానంలో ఘటన జరిగింది. నిందితుడిని ప్రణీత్ కుమార్ ఉసిరిపల్లి(28)గా అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రయాణికులు భయాందోళన చెందారు. ఈ హింసాత్మక ఘటన కారణంగా పైలట్లు విమానాన్ని బోస్టన్‌కు మళ్లించాల్సి వచ్చింది.
అధికారుల సమాచారం మేరకు.. విమానం అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ప్రణీత్ కుమార్.. 17 ఏళ్ల ఇద్దరు టీనేజర్లపై ఫోర్క్‌తో దాడి చేశాడు. మొదట నిద్రలో ఉన్న ఓ యువకుడి భుజంపై ఫోర్క్‌తో గాయపరిచాడు. అనంతరం మరో యువకుడిపై తల వెనుక భాగంలో గాయపరిచాడు. అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన విమాన సిబ్బందిపై కూడా దాడి చేశాడు.
ఈ ఘటన అనంతరం లుఫ్తాన్సా ఫ్లైట్ 431 బోస్టన్ లోగన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యవసరంగా దారి మళ్లించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఫెడరల్ ఏజెంట్లు, పోలీసులు విమానంలోకి ప్రవేశించి ప్రణీత్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన ఇద్దరు యువకులను ఆసుపత్రికి తరలించారు. దాడి ఘటనలో ప్రణీత్‌కు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, 2,50,000 డాలర్ల జరిమానా విధించవచ్చు. ప్రస్తుతం అతను ఫెడరల్ కస్టడీలో ఉన్నాడు. బోస్టన్‌లోని యూఎస్ జిల్లా కోర్టులో హాజరుపర్చనున్నారు. ప్రణిత్ కొన్ని సంవత్సరాల క్రితం విద్యార్థి వీసాతో అమెరికాలోకి ప్రవేశించాడు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అతడు అక్కడే ఉంటున్నట్లు సమాచారం.


