
భారత్–బ్రిటన్‌ల మధ్య ప్రస్తుత వాణిజ్యాన్ని అనేక రెట్లు పెంచగలదని భావిస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాలూ గురువారం ఒక అంగీకారానికి రావటం ద్వైపాక్షిక వాణిజ్యంలో కీలక మలుపు. త్వరలో న్యూఢిల్లీలో రెండు దేశాల ప్రధానులూ సమావేశమై లాంఛనంగా ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటారు. వివిధ అంశాలపై ఇద్దరి దృక్పథాలూ వేర్వేరు కావటం, ఇద్దరూ పట్టువిడుపులు ప్రదర్శించకపోవటం తదితర కారణాల వల్ల ఒప్పందంపై మూడేళ్లుగా ఎడతెగని చర్చలు సాగాయి. వాస్తవానికి ఇరు దేశాల వాణిజ్యమూ 2004 నుంచి ఊపందుకుంది.
ముఖ్యంగా ఔషధాలు, దుస్తులు, వాహనాల విడిభాగాలూ, సర్వీసు రంగాల్లో మన దేశం నుంచి బ్రిటన్‌కెళ్లే ఎగు మతుల పరిమాణం బాగా పెరిగింది. అదే సమయంలో బ్రిటన్‌నుంచి మన దిగుమతులు కూడా చెప్పుకోదగ్గ స్థాయికి విస్తరించాయి. నిరుటి గణాంకాల ప్రకారం బ్రిటన్ మన నుంచి 3,300 కోట్ల డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటుండగా, బ్రిటన్‌కు మన ఎగుమతులు 2,300 కోట్ల డాలర్ల వరకూ వున్నాయి. ఈ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవటానికీ, సరుకుల నాణ్యతను పెంచటా నికీ ఈ ఒప్పందం మార్గ నిర్దేశం చేయబోతోంది. ఒప్పందం అమల్లోకి రాగానే 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 12,000 కోట్ల డాలర్లకు చేరుతుందని ఇరు దేశాలూ అంచనా వేస్తున్నాయి.
యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బయటికొచ్చినప్పటి నుంచీ కష్టాలు పడు తున్న బ్రిటన్‌ను గోరుచుట్టుపై రోకటి పోటులా కరోనా మహమ్మారి కాటేసింది. దాంతో అంతంత మాత్రంగా వున్న ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఈయూ సభ్యదేశంగా ఆ ప్రాంత దేశాలకు ఎలాంటి అవరోధాలూ లేకుండా సాగిపోయిన ఎగుమతులు ఇప్పుడు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొనాల్సి వస్తోంది. ఈయూ నుంచి వెలుపలకు రావటంవల్ల 2022 మధ్యకల్లా ఉత్పాదకత 5.5 శాతం మేర తగ్గింది.
ఇక అప్పటి నుంచీ వాణిజ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి గల అవకాశాల అన్వేషణ ఎక్కువైంది. ముఖ్యంగా చురుకైన ఆర్థిక వ్యవస్థలతో ఒప్పందాలు కుదిరితే పరిస్థితి మెరుగవుతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. భారత్ ఇప్పటికే ప్రపంచంలో అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. 2028 నాటికి మూడో స్థానానికి ఎగబాకవచ్చన్న అంచనాలున్నాయి.
అయితే కుదరబోయే ఈ ఒప్పందంపై రెండు దేశాల్లోనూ సహజంగానే విమర్శలున్నాయి. బ్రిటన్ కార్మికవర్గ ప్రయోజనాలను ప్రభుత్వం భారత్‌కు తాకట్టు పెట్టిందని అక్కడి విపక్షాల ఆరో పణ. ముఖ్యంగా స్వల్పకాలిక వీసాలపై బ్రిటన్ వచ్చే భారతీయ కార్మికులకూ, వారి యాజమాన్యా లకూ జాతీయ బీమా సంస్థ ఎన్‌ఐసీకి చేసే చెల్లింపుల నుంచి మూడేళ్లపాటు మినహాయింపు ఇవ్వ టాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ రాయితీ వల్ల బ్రిటన్ ఖజానా ఏటా పది లక్షల పౌండ్ల ఆదాయం నష్ట పోతుందనీ, ఈ వెసులుబాటు వినియోగించుకోవటానికి కంపెనీలు భారతీయ కార్మికులకు అధికంగా అవకాశాలిస్తాయనీ, దాంతో ఇక్కడివారి ఉపాధి దెబ్బతింటుందనీ వారి వాదన.
ఇది కేవలం తాత్కాలిక ఉద్యోగాలకే వర్తిస్తుందని, బయటివారికి శాశ్వత ఉద్యోగాలిచ్చే అవకాశం ఉండబోదని ప్రభుత్వ జవాబు. ఇప్పటికే అమెరికా, కెనడా, జపాన్‌లతో సహా 50 దేశాలకు ఇదే తరహా వెసులు బాట్లు ఇస్తుండగా భారత్‌తో కుదిరే ఒప్పందం వల్లే ఏదో జరిగిపోతుందని ఎలా అంటారని ప్రశ్నిస్తోంది. నిజానికి భారత్‌కు ఎన్‌ఐసీ వెసులుబాటు ఇవ్వకూడదని బ్రిటన్ భావించటం వల్లే ఒప్పందంపై ప్రతిష్టంభన ఏర్పడింది. మన దేశంలో సైతం ఈ మాదిరి ఒప్పందాలపై వ్యతిరేకత వుంది.
ఎఫ్‌టీఏల వల్ల మన ఎగుమతులకన్నా అటునుంచి దిగుమతులు పెరుగుతాయనీ, అవి స్థానిక ఉత్పత్తులను దెబ్బతీస్తాయనీ విమర్శకుల వాదన. పర్యవసానంగా ఏర్పడే వాణిజ్యలోటు దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని వారి విమర్శ. అలాగే ఈ ఎఫ్‌టీఏల వల్ల ఔషధ పేటెంట్లు, డేటా వినియోగం వంటి అంశాల్లో దేశీయ పరిశ్రమలకు అన్యాయం జరుగుతుందన్న ఆరోపణ మొదటి నుంచీ వుంది. ముఖ్యంగా జెనెరిక్ ఔషధ పరిశ్రమ దెబ్బతిని సాధారణ జనం నష్టపోతారన్న విమర్శ. అక్కడి ఉత్పత్తులతో పోటీపడటం మనవాళ్లకు కష్టమవుతుందన్న వాదన సరేసరి.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల నష్టాలున్నట్టే లాభాలూ వుంటాయి. ఉదాహరణకు మన ఔళి ఉత్పత్తులు, దుస్తులపై బ్రిటన్‌లో ఇంతవరకూ 12 శాతం సుంకాలుండేవి. ఒప్పందం అమల్లోకొస్తే ఆ బెడద వుండదు. బ్రిటన్ మార్కెట్లలో మనతో పోటీపడే చైనాకు ఇది సమస్యాత్మకం. మన దుస్తులపై సుంకాలు పెంచుతామని అమెరికా బెదిరిస్తున్న వర్తమానంలో ఇది మనకు కలిసొచ్చే అంశం. బ్రిటన్‌కు దుస్తులు, తెరలు, దుప్పట్లు వగైరాల ఎగుమతులు కనీసం 4 శాతం వరకూ పెరు గుతాయని అంచనా. అదే సమయంలో బ్రిటన్ కార్లు, విస్కీ, వైద్య ఉపకరణాలు వగైరాలు చవగ్గా లభిస్తాయి.
ఉదాహరణకు ఇప్పుడు రూ. 5,000 పలికే విస్కీ ధర రూ. 3,500కు పడిపోతుంది. రాగల పదేళ్లలో మరింత తగ్గుతుంది. ఇది ఇక్కడి మద్యం పరిశ్రమకు చేటు కలిగించేదే. కార్ల పరిశ్రమలకూ జరిగేది ఇదే. ప్రస్తుతం బ్రిటన్ తయారీ కార్లపై వంద శాతం సుంకాలు విధిస్తున్నారు. అవి కాస్తా పది శాతానికి పడిపోతాయి. గ్రామీణ, పట్టణప్రాంతాల్లోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు గిరాకీ పెరుగుతుందని వాణిజ్య నిపుణుల భావన.
లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగాలు ఎగుమతులు విస్తరిస్తే మరింతగా ఎదుగుతాయని వారంటున్నారు. ఐటీ రంగానికి కూడా ఇది వర్తిస్తుంది. ఏటా బ్రిటన్ ఐటీ సంస్థల్లో కనీసం 60,000 మంది నిపుణులకు అవకాశాలు లభిస్తా యని చెబుతున్నారు. అయితే లాభనష్టాలేమిటో ఒప్పందంపై సంతకాలయ్యాకే తెలుస్తుంది.