
వివాదాస్పద వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు సోమవారం జారీచేసిన మధ్యంతర ఆదేశాలు అటు పిటిషనర్లకూ, ఇటు కేంద్ర ప్రభుత్వానికీ పాక్షిక ఉపశమనం ఇచ్చాయి. చట్టంపై మొత్తంగా స్టే విధించకపోవటం కేంద్రానికి సంతృప్తి కలిగిస్తే, కొన్ని కీలకనిబంధనల అమలును నిలిపేయటం విపక్షాలకూ, పిటిషనర్లకూ సంతోషాన్నిచ్చింది. అయితే ఈ కేసులో పిటిషనర్ అయిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ వంటివారు ఈ ఉత్తర్వులపై నిరాశ పడకపోలేదు.
పిటిషనర్లలో ఒవైసీతోపాటు ఎంపీలు మహువా మొయిత్రా(టీఎంసీ), మనోజ్ కుమార్ ఝూ(ఆర్జేడీ), జియావుర్ రహమాన్(కాంగ్రెస్) ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ కూడా చట్టాన్ని సవాలు చేశాయి. మొన్న ఏప్రిల్‌లో పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టంపై మొత్తం 65 పిటిషన్లు దాఖలయ్యాయంటేనే ఇదెంత వివాదాస్పదమైనదో అర్థమవుతుంది. చట్టం రాజ్యాంగబద్ధమో కాదో ఈ ఉత్తర్వులు తేల్చలేదు. తుది తీర్పు ఆ అంశాన్ని పరిశీలిస్తుంది.
వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగానికి గురవుతున్నాయనీ, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయనీ కేంద్రం భావించింది. వాటిని చక్కదిద్దే ఉద్దేశంతోనే సవరణలు తెచ్చామని చెప్పింది. ముఖ్యంగా రిజిస్టర్ కాకపోయినా నిరాటంకంగా వక్ఫ్ అధీనంలో ఉంటే ఆ ఆస్తులు దానికే చెందుతాయన్న (వక్ఫ్ బై యూజర్) భావనను ఈ చట్టం రద్దు చేసింది. ఇకపై వక్ఫ్ ఆస్తులకు లిఖిత పూర్వక దస్తావేజు ఉండి తీరాలని నిర్దేశించింది. సుప్రీంకోర్టు ఈ నిబంధనపై స్టే విధించేందుకు నిరాకరించింది.
కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురవుతున్నాయని చట్టసభ గుర్తించి, దాన్ని నివారించాలనుకోవటం ఏకపక్ష చర్య ఎలా అవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. అలాగే వక్ఫ్ ఆస్తులకు 1995 నాటి చట్టం ఒక ప్రత్యేక ప్రతిపత్తినిచ్చింది. దాని ప్రకారం వక్ఫ్ ఆస్తి దురాక్రమణకు గురైందని ఏ దశలో గుర్తించినా దాని స్వాధీనానికి వక్ఫ్ బోర్డు చర్యలు తీసుకోవచ్చు. తాజా సవరణ దీన్ని రద్దు చేయటాన్ని ధర్మాసనం సమర్థించింది. ఇతర ఆస్తులతో సమానంగా పరిగణించటం వివక్ష తొలగింపే అవుతుందని భావించింది.
అన్య మతస్థులు కనీసం అయిదేళ్లుగా ఇస్లాం ఆచరణలో ఉంటేనే వక్ఫ్‌కు ఆస్తులు దానం చేయొచ్చన్న నిబంధనపై ధర్మాసనం స్టే విధించటం ఒక రకంగా ఊరట. ఇస్లాం ఆచరణంటే ఏమిటో చట్టం వివరించకపోవటం, దాన్ని గుర్తించటానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేసే నిబంధనలు, అందుకోసం ఏర్పాటయ్యే వ్యవస్థ సంగతి తేలేవరకూ ఈ నిబంధన నిలిచిపోతుంది. పౌరులు తమ ఆస్తిని ఎలా ఉపయోగించాలో నిర్ణయించుకునే హక్కు రాజ్యాంగంలోని 300వ అధికరణం ఇచ్చింది.
అన్య మతస్థులు వక్ఫ్ బోర్డుకు ఆస్తులివ్వరాదన్న నిబంధన దీన్ని ఉల్లంఘించటం లేదా? తుది తీర్పులోనైనా దీన్ని పరిశీలించక తప్పదు. వివాదాస్పద ఆస్తులపై వక్ఫ్ బోర్డుకూ, ప్రభుత్వాలకూ తగువు ఏర్పడినప్పుడు కలెక్టర్ స్థాయి అధికారి నిర్ణయించవచ్చన్న నిబంధనపై ధర్మాసనం స్టే ఇచ్చింది. ఈ నిబంధనలో మరో వైపరీత్యముంది. అసలు అలాంటి విచారణ మొదలైన మరుక్షణమే అది వక్ఫ్ ఆస్తిగా పరిగణించటానికి వీల్లేదని చెబుతోంది.
మొత్తానికి వివాదాలను ట్రైబ్యునల్స్ లేదా హైకోర్టులు మాత్రమే తేల్చాలనటం సరైన నిర్ణయం. అయితే వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు స్థానం కల్పించాలన్న నిబంధనను కొంత మార్పుతో అలాగే ఉంచటం సబబు కాదు. హిందూ, సిక్కు, క్రైస్తవ మతాలకు చెందిన సంస్థల్లో అన్య మతస్థులకు చోటు లేనప్పుడు, వక్ఫ్ బోర్డుల్లో మాత్రం ఎందుకుండాలి?
వక్ఫ్ చట్టంలో సమస్యలున్నాయి... సరిచేయమని కోరేవారిలో ఆ మతస్థులూ ఉన్నారు. అలా చేసే ముందు ముస్లిం మతాచార్యులతో, ముస్లిం పర్సనల్ లా బోర్డుతో మాట్లాడాలి. పార్టీల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి. పార్లమెంటులో అలజడి రేగాక బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) ఏర్పాటు చేశారు సరే... కానీ విపక్షాల అభ్యంతరాలను పట్టించుకున్నారా? సమర్థమైన, లోప రహితమైన విధానాలు తీసుకురాదల్చుకుంటే స్వాగతించాల్సిందే. కానీ ఆ విషయంలో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాలి. అటువంటి చర్య ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది.