
రాక తప్పదనుకుంటున్న ముప్పు ముంగిట్లోకొచ్చింది. అమెరికా అధ్యక్షపీఠం అధిష్ఠించింది మొదలు నిలకడలేనితనంతో, పొంతనలేని వ్యాఖ్యలతో మిత్రుల్ని, వ్యతిరేకుల్ని కూడా సమానంగా ఇరకాటంలో పడేస్తున్న డోనాల్డ్ ట్రంప్... గతంలో హెచ్చరించినట్టే సుంకాల మోత మోగించారు. శుక్రవారం నుంచి భారత్ నుంచి వచ్చే సరుకులపై 25 శాతం సుంకాలు విధిస్తామని, ఇవిగాక రష్యా నుంచి ముడిచమురు, రక్షణ సామగ్రి కొంటున్నందుకు అదనంగా జరి మానా ఉంటుందని ప్రకటించారు.
అది ఎంత శాతమో చెప్పకపోయినా రష్యాతో వాణిజ్యం సాగించే భారత్, చైనాలపై 500 శాతం వరకూ అదనపు సుంకాలుంటాయని ఆయన లోగడ ప్రకటించారు. కనుక ఈ సుంకాల కన్నా జరిమానా వాటాయే ఎక్కువుంటుందని అంచనా వేయొచ్చు. తన ఆదేశాలను ఔదలదాల్చనందుకు మన ఆర్థిక వ్యవస్థను ‘మృత ఆర్థిక వ్యవస్థ’గా దూషించారు. అనాల్సిన వన్నీ అన్నాక ‘ఇంకా భారత్‌తో చర్చలు జరుగుతున్నాయి.
ఏం జరుగుతుందో చూద్దాం’ అని ముక్తాయించారు. ఆయన హుకుం అమలైతే వస్త్రాలు, రొయ్యలు, ఆభర ణాలు, వజ్రాలు, తోలు ఉత్పత్తులు వగైరాలపై తీవ్ర ప్రభావం పడుతుందనీ, ఆ రంగాల్లో ఉపాధి దెబ్బతింటుందనీ నిపుణుల అంచనా. ఈ రంగాల్లో 8,700 కోట్ల డాలర్ల విలువైన ఎగుమతులుంటున్నాయి. ఈ ఏడాది జీడీపీ 6.5 శాతానికి మించి వుండొచ్చని అంచనాలున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అది బాగా తగ్గవచ్చంటున్నారు.
ట్రంప్‌కు దౌత్య మర్యాదల సంగతి అటుంచి వ్యక్తిగా ఎలా మెలగాలో కూడా తెలియదు. బహిరంగ బెదిరింపులకు దిగటం, అన్యాయమని అందరికీ తెలిసేలా ప్రవర్తించటం ఆయన నైజం. బ్రెజిల్ సంగతే తీసుకుంటే అక్కడ ఆ మధ్య అధికారం కోల్పోయిన బోల్సొనారో ఆయ నకు ఇష్టుడు. కనుక అతనిపైవున్న నేరారోపణలు ఉపసంహరించి వదిలేయమని తాఖీదు పంపారు.
అంగీకరించనందుకు అదనపు సుంకాలు విధించారు. దేశాలకు సార్వభౌమత్వం ఉంటుందనీ, దానికి లోబడి సంబంధాలు నెరపాలనీ ఆయన భావించరు. వాణిజ్య ఒప్పందాలు సాకారం కావాలంటే వాటిని కుదుర్చుకోదల్చుకున్న రెండు పక్షాలకూ పరస్పర విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఓపిగ్గా చర్చించాలి. బ్రిటన్‌తో మనకు ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమే ఇందుకు ఉదాహరణ.
దాదాపు మూడేళ్లపాటు ఆ ఒప్పందంపై చర్చలు సాగాయి. ఒప్పందం అన్నాక ఇచ్చిపుచ్చుకోవడాలుంటాయి. ‘మేం పుచ్చుకుంటాం... ఇవ్వం’ అంటున్నారు. ‘మాతో ఒప్పందానికి భారత్ సుముఖంగా వుంది... ఇక సంతకాలే తరువాయి’ అంటూ చాన్నాళ్ల క్రితమే మన ప్రభుత్వం తరఫున తానే ప్రకటించారు.
ట్రంప్ ఆగ్రహావేశాలకు వేరే కారణాలున్నాయి. మన సాగు, పాడి రంగాలను పరిరక్షించేందుకు అమెరికా నుంచి వచ్చే ఆ ఉత్పత్తులపై మన దేశం అధిక సుంకాలు విధిస్తోంది. ఇందులో సహేతుకత ఉంది. అమెరికాలో ఆ రంగాలకు భారీ సబ్సిడీలుంటాయి. దాంతో తమ ఉత్పత్తుల్ని వేరే దేశాల్లో కారుచౌకగా అమ్ముకోవటానికి వీలుంటుంది.
అమెరికాతో పోలిస్తే మన సబ్సిడీలు చాలా తక్కువ. అవి రైతులకు లాభదాయకం కాకపోగా, ఆ రెండు రంగాల్లోనూ వ్యయం విపరీ తంగా పెరిగింది. రైతులు అధిక వడ్డీకి బయట అప్పులు చే యాల్సి వస్తోంది. తీరా గిట్టుబాటు ధర లభించక, అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ట్రంప్ ఒత్తిడి చేస్తున్నట్టు అధిక సుంకాలు తొలగిస్తే ఈ సంక్షోభం మరింత పెరుగుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆసరాగా ఉన్న ఆ రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నిజానికి ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో చేరినప్పుడే మన పాలకులు నిక్కచ్చిగా ఉండాల్సింది. కానీ దాటవేత ధోరణి ప్రదర్శించారు.
రష్యాతో వాణిజ్యంపైనా ఇంతే. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలన్నట్టు ఉంటే వేరుగా ఉండేది. కానీ మన దేశం వారి ఆదేశాలు పాటించింది. 2009–13 మధ్య మన ఆయుధ కొనుగోళ్లలో రష్యా వాటా 76 శాతం. అదిప్పుడు 36 శాతానికి పడిపోయింది. దీన్ని ఆపేయాలని, తన ఎఫ్–35 యుద్ధ విమానాలు, ఎంక్యూ–9బి డ్రోన్లు, పీ–81 సాగర ప్రాంత గస్తీ విమానాలు కొనితీరాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది.
నిజానికి భారత్‌కు ఆయుధ అమ్మకాలపై 1960 ప్రాంతాల్లో అమెరికా నిషేధం విధించబట్టే రష్యాపై ఆధారపడటం పెరిగింది. ముడి చమురు విషయానికొస్తే మొన్న ఫిబ్రవరికి రష్యా నుంచి కొనుగోళ్లు 25 శాతం మేర పడిపోయాయి. అదే సమయంలో అమెరికా నుంచి కొనుగోళ్లు వంద శాతం పెరిగాయి.
తన అంధభక్త గణాన్ని సంతృప్తిపరచటం కోసం, ఓటుబ్యాంకు పెంచుకోవటం కోసం ట్రంప్ దశాబ్దాల తరబడి ఎంతో ఓపిగ్గా నిర్మించుకుంటూ వచ్చిన ఇరు దేశాల సంబంధాలపైనా గొడ్డలి వేటు వేశారు. దీని పర్యవ సానాలు మనపై ఉన్నట్టే, అమెరికాపైనా ఉంటాయి. ఆయన ధోరణి మారకపోతే మన ఆర్థిక వ్యవస్థ మాటేమోగానీ... అమెరికా ఆర్థిక వ్యవస్థ ‘మృతప్రాయం’ కావటం ఖాయం.