
రాజకీయ అవినీతిని అంతం చేయటానికి, దేశంలో రాజ్యాంగ నైతికతను నెలకొల్పటానికి అని చెబుతూ లోక్‌సభలో బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, అందుకు సంబంధించిన మరో రెండు బిల్లులపై దేశవ్యాప్తంగా సకారణంగానే నిరసనలు వ్యక్త మవుతున్నాయి. లోక్‌సభలో అయితే తీవ్ర వాగ్వివాదాలు, పరస్పర ఆరోపణలు వెల్లువెత్తాయి.
బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తొలి వరస నుంచి మూడో వరసకు వెళ్లి ప్రసంగించాల్సి వచ్చిందంటే... ఆయనకు రక్షణ వలయంగా పార్లమెంటరీ భద్రత సేవలో ఉండే 12 మంది గార్డులు మోహరించాల్సి వచ్చిందంటే... బిల్లు ప్రతులు చించి పడేశారంటే... సభలో ఆగ్రహావేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ప్రధాని మొదలుకొని ముఖ్యమంత్రులూ, మంత్రులూ అవినీతి ఆరోపణలపై అరెస్టయి, 30 రోజుల్లోగా బెయిల్‌పై విడుదల కాని పక్షంలో వెనువెంటనే పదవుల నుంచి తప్పించేందుకు ఉద్దేశించామని చెబుతున్న ఈ బిల్లులు చట్టాలైతే ప్రకటిత లక్ష్యాలను నిజంగా నెరవేరుస్తాయా అన్నది ప్రశ్నార్థకం.
ఏ వ్యవస్థలోనైనా నేర న్యాయచట్టాలు పాలకుల అధికారాన్నీ, వారి రాజకీయ స్వప్రయోజనాలనూ ప్రతిఫలించినంతగా... న్యాయాన్ని ప్రతిబింబించవు. ఆచరణ సంగతి చెప్పనవసరమే లేదు. ఎక్కడి దాకానో ఎందుకు, ఆంధ్రప్రదేశ్‌లో తమ ఎన్డీయే కూటమి పాలన ప్రత్యర్థుల్ని వెంటాడి వేటాడి వేధిస్తున్న వైనం, తప్పుడు కేసులు బనాయిస్తున్న తీరు తెలియదా? కేవలం నిందగా, రుజువుకాని నేరంగా, ఒక ఆరోపణగా మాత్రమే ఉన్న దశలో బెయిల్ రాలేదన్న కారణంగా పదవులకు అనర్హులవుతారని చెప్పడం అంటే ప్రజల దృష్టిలో వారిని శాశ్వతంగా నేరం చేసిన వారుగా ముద్ర వేయటమే అవుతుంది.
నేరం చేశారో లేదో తేలకుండా, శిక్షేమీ పడకుండా... విచారణ ప్రక్రియ దానికదే శిక్షగా మారటం మన దేశంలో కళ్లముందు కనబడుతున్న సత్యం. ఈ విషయంలో సీబీఐ, ఈడీ సంస్థలు అనేకసార్లు న్యాయస్థానాలతో చీవాట్లు తింటున్న వైనం తెలియంది కాదు. అలాంటపుడు ఈ సవరణ ద్వారా రాజ్యాంగాన్నే ఆయుధంగా మార్చాలని చూడటం ఎవరి ప్రయోజనాల కోసం?
ఈ బిల్లులు కొందరంటున్నట్టు త్వరలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడున్న ‘వోట్ చోరీ’ నినాదాన్ని వెనక్కినెట్టి ‘అవినీతి నిర్మూలన’ ఎజెండాను అగ్రభాగాన నిలబెట్టి తాము మాత్రమే సచ్ఛీలురమనీ, ప్రత్యర్థులంతా అవినీతిపరులనీ ముద్రేయటానికా? నిజమే కావొచ్చు. ఆ మాటెలావున్నా ఇది దేశ ఫెడరల్ వ్యవస్థ అమరికను తీవ్రంగా దెబ్బ తీస్తుంది.
రాష్ట్రాల్లో ఎన్డీఏ యేతర పక్షాల ప్రభుత్వాలను ఎన్నికల ముందు పడగొట్టడానికి ఈ చట్టాలను ఎడాపెడా దుర్వినియోగం చేసే వీలుంది. న్యాయసమీక్షకు అవకాశం ఉందనేది అర్థరహిత తర్కం. పెండింగ్ కేసులతో సతమతమవుతున్న న్యాయస్థానాల్లో కేసుల విచారణ పూర్తికావటానికి ఎంత సమయం పడుతున్నదో అందరికీ తెలుసు. సారాంశంలో నేరం రుజువయ్యేవరకూ ప్రతి ఒక్కరినీ నిర్దోషిగా పరిగణించాలన్న న్యాయశాస్త్ర సిద్ధాంతానికి ఇది తూట్లు పొడుస్తోంది.
అవినీతి ప్రక్షాళనకు తొలి అడుగు వేయదల్చుకుంటే ముందు సీబీఐ, ఈడీ వంటి సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తినీయాలి. ఆ సంస్థల విశ్వసనీయతను పెంచాలి. అందుకోసం ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం చేసిందేమిటి? యూపీఏ హయాంలో సీబీఐకి ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అనే ముద్రపడింది. సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానమే ‘పంజరంలో చిలుక’గా సంస్థను అభివర్ణించింది.
గత పదకొండేళ్ల పాలనలో ఈ అపప్రథను తొలగించటానికి తీసుకున్న చర్యలేమిటో ఎన్డీఏ చెప్పగలదా? మొన్న మే నెలలో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్‌పై ఈడీ దాడి చేసిన కేసులో ఆ సంస్థ అన్ని హద్దుల్నీ ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ కటువుగా వ్యాఖ్యానించారు. నాలుగు నెలల క్రితం కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి రాజ్యసభలో వెల్లడించిన గణాంకాలు దిగ్భ్రాంతిపరుస్తాయి.
గత పదేళ్లలో ఈడీ 193 మంది రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేయగా, వారిలో కేవలం ఇద్దరికి శిక్ష పడింది. ఆప్ సర్కారులో మంత్రిగా ఉండి అరెస్టయిన సత్యేంద్ర జైన్‌పై సీబీఐ నాలుగేళ్లు దర్యాప్తు జరిపి చివరకు అంతా సవ్యంగానే ఉన్నట్టు తేల్చి కేసును మూసేస్తున్నట్టు న్యాయస్థానానికి తెలిపింది. కానీ ఈలోగా ఆయన ఏడాదిన్నరపాటు జైల్లో మగ్గాల్సి వచ్చింది.
అవినీతిని వ్యతిరేకించటమూ, ఈ బిల్లుల్ని సమర్థించటమూ ఒకటి కాదు. పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ లేకుండా ఈ బిల్లులు తీసుకురావటం గమనిస్తే ఇది కేవలం విపక్షాలను అవినీతిపరులుగా ముద్రేయటానికే అని అర్థమవుతుంది. పాలకులెవరైనా దుర్వినియోగానికి విస్తృతంగా అవకాశమున్న ఈ బిల్లుల్ని సంయుక్త పార్లమెంటరీ సంఘానికి (జేపీసీకి) పంపటం కాదు... పూర్తిగా వెనక్కి తీసుకోవాలి.