
అలజడి రేగినప్పుడూ, అశాంతి జాడలు కనబడినప్పుడూ సకాలంలో దాన్ని చక్క దిద్దటమే పాలకుల ప్రథమ కర్తవ్యం కావాలి. వేరే దేశాలతో సరిహద్దులున్న ప్రాంతాల్లో ఇది మరింత అవసరం. ఆ దృష్టి లేకపోవటం వల్లే చైనా సరిహద్దుల్లో ఉన్న లద్దాఖ్‌లో సాగుతున్న ఉద్యమం అదుపు తప్పి హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు బీజేపీ కార్యాలయాన్ని దగ్ధం చేయటంతో పాటు కొన్ని వాహనాలకు కూడా నిప్పుపెట్టారు. ఇళ్లు, దుకాణాలపై దాడులు చేశారు. సీఆర్‌పీఎఫ్ కాల్పుల్లో నలుగురు మరణించారు. కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. 2019లో జమ్మూ–కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి, జమ్మూ, కశ్మీర్‌ను చట్టసభ గల కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్‌ను చట్టసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చినప్పుడు ఈ ఆందోళనకు బీజం పడింది.
లద్దాఖ్‌ను రాష్ట్రం చేసి చట్ట సభ ఏర్పాటు చేయాలని, ఈశాన్య రాష్ట్రాల మాదిరిగా రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌ను తమకూ వర్తింప చేయాలని లద్దాఖ్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగంలోని 244వ అధికరణం కింద ఉన్న ఆరో షెడ్యూల్ పరిధిలోకి లద్దాఖ్‌ను తీసుకొస్తే శాసన, న్యాయ, పాలనాపరమైన నిర్ణయాలు తీసుకొనే స్వయంపాలిత జిల్లా మండళ్లు ఏర్పడతాయి. అవి లేనట్టయితే పరిశ్రమల స్థాపన పేరిట భూములు బయటివారికి పోతాయనీ, వారి ప్రాబల్యం పెరుగుతుందనీ ఉద్యమకారులు చెబుతున్నారు. గత అయిదేళ్లుగా ఎంతో శాంతియుతంగా ఉద్యమం కొనసాగుతోంది. దీనికి లేహ్ అపెక్స్ బాడీ (ఎల్‌ఏబీ), కార్గిల్ డెమాక్రటిక్ అలయెన్స్ (కేడీఏ) నాయకత్వం వహిస్తున్నాయి.
ఉద్యమాలు జరుగుతున్నప్పుడు వాటిని స్వప్రయోజనాలకు వినియోగించుకోవాలని చూసేవారు ఎప్పుడూ ఉంటారు. అలాంటి శక్తులకు అవకాÔ¶ మీయరాదనుకుంటే సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గాన్ని అన్వేషించాలి. లద్దాఖ్ ఉద్యమ డిమాండ్లు చూస్తే అవి గొంతెమ్మ కోరికలేమీ కాదని తెలుస్తుంది. ఈ ప్రాంత యువతకు ప్రభుత్వో ద్యోగాల్లో అన్యాయం జరగకూడదనుకుంటే లద్దాఖ్‌కు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జమ్మూ–కశ్మీర్‌లో భాగంగా ఉన్నప్పుడు అక్కడి సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలుండేవి. కేంద్రపాలిత ప్రాంతమైనాక అది కాస్తా పోయింది.
మూడేళ్ల పాటు నిరుద్యోగులు ఆశగా ఎదురుచూశాక కేంద్ర సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) రంగంలోకి దిగింది. కానీ ఆ ప్రక్రియ ఒక కొలిక్కి రావటానికి ఎంతో సమయం పట్టింది. నిరుడు ఎస్సెస్సీ 797 పోస్టుల భర్తీకి ప్రకటనిస్తే 30,000 మంది దరఖాస్తు చేశారు. 2021–22, 2022–23 మధ్య పట్టభద్రుల్లో నిరుద్యోగిత ఒక్కసారిగా 16 శాతం పెరిగింది. పలువురికి వయఃపరిమితి దాటింది. దానికి తోడు స్వయంపాలిత మండళ్లు రెండున్నా... వాటిలో స్థానికేతర అధికారుల హవా నడుస్తోంది. సహజంగానే రాజకీయ వ్యవస్థకు చోటు లేదు గనుక పార్టీలు సైతం ఈ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నాయి. లద్దాఖ్‌కు రాష్ట్ర ప్రతిపత్తితో పాటు దాని పరిధిలోని లేహ్, కార్గిల్‌లకు రెండు పార్లమెంటరీ స్థానాలు ఇవ్వాలని ఉద్యమకారులు కోరటం గమనించదగ్గది.
భౌగోళికంగా పర్వతప్రాంతం, తీవ్ర వాతావరణ స్థితిగతుల వల్ల అక్కడ పరిశ్రమల స్థాపనకు వచ్చేవారు తక్కువ. 13 గిగావాట్ల సౌరశక్తి ప్లాంట్‌కు లేహ్‌లోని పాంగ్ ప్రాంతంలో అనుమతించారు. కానీ దానికి దాదాపు 80 కిలోమీటర్ల ప్రాంతం కావాలి. ఈ ప్రాజెక్టు వస్తే పశుపోషణపై, సంచారజాతుల వారిపై తీవ్ర ప్రభావం పడుతుందనీ, జీవిక దెబ్బతింటుందనీ ఉద్యమకారుల ఆరోపణ. అసలే పర్యావరణం క్షీణించి అకాల వర్షాలూ, అత్యధిక ఉష్ణోగ్రతలతో హిమానీనదులు కొడిగడుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిశ్రమలు అవసరం లేదన్నది వారి వాదన.
ఉద్యమకారుల డిమాండ్లలో హేతుబద్ధమైన వాటిని తక్షణం పరిష్కరించటం, మిగిలినవాటిపై పరిశీలనకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేయటం అవసరమని ఇప్పటికైనా పాలకులు గ్రహించాలి. ఉద్యమ నాయకుడు సోనమ్ వాంగ్‌చుక్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థపై వెంటనే చర్యలు మొదలుపెట్టడం సబబేనా? హింసకు ఆయనే కారకుడని తేలితే వేరే విషయం. తగిన విచారణ జరిగితే అన్నీ బయటికొస్తాయి. ఉద్యమం మరింత తీవ్రం కాకూడదనుకుంటే అంతవరకూ ఓపిక పట్టడం అత్యవసరం.