బెంగాల్‌పై బీజేపీ ఫుల్‌ ఫోక‌స్‌! | BJP shifted its full organisational focus to West Bengal | Sakshi
Sakshi News home page

5 జోన్లు, 12 మంది లీడ‌ర్స్‌.. బెంగాల్‌పై బీజేపీ ఫోక‌స్‌!

Nov 25 2025 1:57 PM | Updated on Nov 25 2025 3:30 PM

BJP shifted its full organisational focus to West Bengal

బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య‌దుందుభి మోగించిన క‌మ‌లం పార్టీ ప‌శ్చిమ బెంగాల్‌పై ఫోక‌స్ పెట్టింది. వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో జ‌ర‌గ‌నున్న శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా క‌స‌ర‌త్తు ప్రారంభించింది. బిహార్ ఎన్నిక‌లు ముగిసిన వెంట‌నే బెంగాల్ ఎన్నిక‌ల ప్ర‌చార‌ కార్యాచ‌ర‌ణ చేప‌ట్టింది. ఎన్నిక‌ల‌కు 5 నెల‌లు ముందుగానే ప్ర‌చార వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రాన్ని ఐదు జోన్‌లుగా విభజించి, ఆరు రాష్ట్రాల నుంచి 12 మంది సీనియర్ నాయకులకు ప్ర‌చార బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

ప‌శ్చిమ బెంగాల్‌లోనూ జంగిల్‌రాజ్‌ను అంతం చేస్తామ‌ని బిహార్ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (Narendra Modi) ప్ర‌క‌టించారు. బిహార్ విజ‌యం బెంగాల్‌లో గెలుపున‌కు బాట వేసింద‌ని వ్యాఖ్యానించారు. కేంద్ర జౌళి శాఖ‌ మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఇదేర‌క‌మైన వ్యాఖ్య‌లు చేశారు. త‌మ త‌దుపరి ల‌క్ష్యం బెంగాల్‌లో కాషాయ జెండా ఎగుర‌వేయ‌డ‌మేన‌ని ఉద్ఘాటించారు. బెంగాల్‌లో అరాచ‌క పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడ‌తామ‌ని ప్ర‌తిన బూనారు. వీరి మాట‌ల‌ను బ‌ట్టి చూస్తేనే అర్థ‌మ‌వుతుంది.. బెంగాల్ ఎన్నిక‌ల‌ను బీజేపీ ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుందో.

త్రిముఖ వ్యూహం
బెంగాల్‌లో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప‌దిహేనేళ్ల పాల‌న‌కు ముగింపు ప‌లికి అధికారాన్ని ద‌క్కించుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉంది బీజేపీ. ఇందుకోసం క్షేత్ర‌స్థాయి కార్యాచ‌ర‌ణ సిద్ధం చేసిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. పశ్చిమ బెంగాల్‌ను 5 అధిక ప్రాధాన్యత గల జోన్‌లుగా విభజించి.. ప్రతి జోన్‌కు ఒక మంత్రిని, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని నియమించారు. వీరంతా ఎన్నికల వరకు బెంగాల్‌లోనే మకాం వేస్తారు. బీజేపీ క్షేత్ర‌స్థాయి నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, బూత్-స్థాయి యంత్రాంగాన్ని ఏకీకృతం చేయడం, తృణమూల్ కాంగ్రెస్ బలమైన కోటల్లోకి ప్రవేశించడం వంటి ల‌క్ష్యాల‌తో వీరు ప‌నిచేస్తారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌లు (West Bengal Assembly Election 2026) వ‌చ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో జరగనున్నాయి.

రాధా-బంగా జోన్ (పురులియా–బర్ధమాన్)
పురులియా, బర్ధమాన్‌లో త‌మ పార్టీ ఉనికిని పెంచుకోవాల‌ని బీజేపీ (BJP) భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లోగా సంస్థాగ‌తంగా బ‌లప‌డాల‌న్న ల‌క్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీంతో ఈ జోన్‌కు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (ఆర్గనైజేషన్) పవన్ సాయిని ప‌ర్య‌వేక్షుడిగా బీజేపీ అధినాయ‌క‌త్వం నియ‌మించింది. ఉత్తరాఖండ్ మంత్రి ధన్ సింగ్ రావత్ సహా-ప‌ర్య‌వేక్షుడిగా బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

హౌరా–హూగ్లీ–మేదినీపూర్ జోన్
హౌరా–హూగ్లీ ప‌ర్య‌వేక్ష‌ణ‌ను ఢిల్లీ సంస్థాగత మంత్రి పవన్ రాణా (Pavan Rana) చూసుకుంటారు. ఆయ‌న‌కు హరియాణాకు చెందిన సీనియ‌ర్ సంజయ్ భాటియా స‌హ‌కారం అందిస్తారు. మేదినీపూర్ బాధ్య‌త‌లు ఉత్తరప్రదేశ్ మంత్రి జేపీఎస్ రాథోడ్‌కు క‌ట్ట‌బెట్టారు. టీఎంసీ- బీజేపీ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లతో రాజకీయంగా సున్నితమైన ప్రాంతంగా మేదినీపూర్‌ను ప‌రిగ‌ణిస్తున్నారు. బీజేపీ నేత సువేందు అధికారి ప్రభావం ఇక్క‌డ ఎక్కువ‌గా ఉంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

కోల్‌కతా మెట్రోపాలిటన్ & సౌత్ 24 పరగణాలు
బీజేపీ అత్యంత కఠినమైన ప్రాంతాలలో ఒకటైన ఈ బెల్ట్‌ను హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన బీజేపీ కార్యదర్శి ఎం. సిద్ధార్థన్ ప‌ర్య‌వేక్షిస్తారు. మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి. రవి ఆయనతో కలిసి పని చేస్తారు. ఈ జిల్లాల్లో చాలా కాలంగా తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యం కొన‌సాగుతోంది. ఈ సారి ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఇక్క‌డ పాగా వేయాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది.

నబద్వీప్ & నార్త్ 24 పరగణాలు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యదర్శి మధుకర్ నూక‌ల‌ (Madhukar Nukala) ఈ ప్రాంతంలో కాషాయ పార్టీ ప్ర‌చార బాధ్య‌త‌లు చూస్తారు. యూపీ మంత్రి సురేష్ రాణా సహ-ఇన్‌చార్జ్‌గా ఉంటారు. సరిహద్దు జిల్లా అయిన‌ నార్త్ 24 పరగణాలను రాజకీయంగా వ్యూహాత్మక ప్రాంతంగా ప‌రిగ‌ణిస్తారు. ఇక్క‌డ సంస్థాగ‌తంగా బల‌ప‌డాల‌ని బీజేపీ భావిస్తోంది.

చ‌ద‌వండి: సిద్ధూ వ‌ర్సెస్ డీకే.. తెర‌పైకి మూడో పేరు!

ఉత్తర బెంగాల్ (మాల్డా–సిలిగురి డివిజన్)
అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ కార్యదర్శి అనంత్ నారాయణ్ మిశ్రాకు మాల్డా ప్రాంత‌ పర్యవేక్షణ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. కర్ణాటకకు చెందిన అరుణ్ బిన్నాడి.. సిలిగురి ప్రాంతం బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తారు. బీజేపీ సాంప్రదాయ మద్దతు స్థావరాలలో ఒకటిగా పరిగణించబడే ఉత్తర బెంగాల్ ప్రాంతం అంతటా మాజీ కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి చురుకైన పర్యవేక్షక పాత్రను పోషించ‌నున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement