కాంగ్రెస్ ఏం చేసిందని ఆ ప్రభుత్వంలో భాగస్వాములయ్యారు?
నైతికత ఉంటే ఆ పదవులకు రాజీనామా చేసి మాట్లాడండి
కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ ఆమోదాన్ని స్వాగతిస్తున్నా
మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్ : ‘సోకాల్డ్ కమ్యూనిస్టులు, అర్బన్ నక్సల్స్‌కు ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి కనిపించడం లేదా ? కాంగ్రెస్ ఏం చేసిందని ఆ ప్రభుత్వంలో భాగస్వాములయ్యారు? 6 గ్యారంటీలు నెరవేర్చిందా? మేనిఫెస్టో హామీలను అమలు చేసిందా? నైతికత ఉంటే ఆ పదవులకు రాజీనామా చేసి మాట్లాడండి’అని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.
‘భారత్‌ను ప్రపంచంలోనే నంబర్‌వన్ చేయడమే మా లక్ష్యం. ఆర్థిక ప్రగతిలో భారత్‌ను 4వ స్థానానికి చేర్చాం. మరి మీరు సాధించిందేమిటి? అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే.. మతతత్వం అని ముద్ర వేస్తారా? మీరు ప్రభుత్వంలో భాగస్వాములపై ఏసీల్లో కూర్చుని అమాయకులను రెచ్చగొట్టి తుపాకులు పట్టిస్తారా? మీ మాయమాటలు నమ్మి అమాయకులు అడవుల్లో తిరుగుతూ చస్తున్నారు.
మోదీ అభివృద్ధిని చూసి నక్సలైట్లు లొంగిపోతున్నా... మీలో మార్పు కనిపించదా’అని ప్రశ్నించారు. గురువారం బీజేపీ కార్యాలయంలో సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ ఆమోదాన్ని స్వాగతిస్తున్నాం. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనని ఎన్నికల ముందు దు్రష్పచారం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి దీనికి ఏం సమాధానం చెబుతారు? రాష్ట్రంలో ఆర్కే (రేవంత్‌రెడ్డి, కేటీఆర్) పాలన కొనసాగుతోంది’అని వ్యాఖ్యానించారు.
‘నగరాల్లో, పట్టణాల్లో ఏసీ రూముల్లో ఉంటూ బూటకపు ఎన్‌కౌంటర్ల గురించి మాట్లాడుతున్న సోకాల్డ్ కమ్యూనిస్టులు, అర్బన్ నక్సల్స్ ఎన్నడైనా లొంగిపోవాలని చెప్పారా? వారు చనిపోయాక మాత్రం బూటకపు ఎన్‌కౌంటర్లని మాట్లాడుతూ పాటలు పాడి శవాలకు నివాళి అరి్పంచడం తప్ప వారు చేసిందేమిటి’అని నిలదీశారు. ‘బీజేపీకి ఒక లక్ష్యం ఉంది. బ్యాలెట్‌ను నమ్ముకుని బీజేపీ వరుసగా కేంద్రంలో అధికారంలోకి వచి్చంది. దాదాపు 20 రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతోంది.
కోట్లాది మందికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తున్నం. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినం. ఆర్థిక ప్రగతిలో భారత్‌ను అమెరికా, రష్యా, చైనా, జపాన్ సరసన చేర్చినం. మా లక్ష్యం 2047 నాటికి వరల్డ్ నంబర్‌వన్ దేశంగా భారత్‌ను మార్చేందుకు వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్నాం.. మరి మీ లక్ష్యం ఏమిటి’అని ప్రశ్నించారు. సినీదర్శకుడు రాజమౌళి భవిష్యత్‌లో దేవుడిని నమ్మేలా చూడాలని, ఆయన బాగుండాలని కోరుకుంటున్నట్టు ఒక ప్రశ్నకు బదులిచ్చారు.
బండి సంజయ్‌పై లీకేజీ కేసు కొట్టివేత
హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: హనుమకొండ జిల్లా కమలాపూర్ స్టేషన్‌లో కేంద్రమంత్రి బండి సంజయ్‌పై 2023లో నమోదైన పదవ తరగతి పేపర్ లీకేజీ కేసును హైకోర్టు కొట్టివేసింది. కేసు దర్యాప్తు అంతా అస్తవ్యస్తంగా ఉందని, అభియోగ పత్రం రికార్డులో లేదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఫిర్యా దుదారుడు కమలాపూర్ జెడ్పీ హైసూ్కల్ హెచ్‌ఎం పేర్కొన్న విషయాలకు కేసులోని విషయాలతో సరిపోలడం లేదని అభిప్రాయపడింది.
ఈ కేసు కొనసాగించడం సరికాదంటూ సంజయ్‌పై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. కేసును కొట్టివేయా లని కోరుతూ సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టి గురువారం తీర్పు వెలువరించింది.
చేయని తప్పుకు జైలుకు పంపారు: బండి సంజయ్
అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తనపై పెట్టిన టెన్త్ పేపర్ లీకేజీ కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని బండి సంజయ్ అన్నారు. ‘నేను చేయని తప్పుకు జైలుకు పంపారు. నాపట్ల, బీజేపీ కార్యకర్తల పట్ల క్రూరంగా వ్యవహరించారు. బీజేపీ కార్యకర్తల ధాటికి తట్టుకోలేక జైలుకు తీసుకెళ్లారు. టెన్త్ హిందీ పేపర్‌ను ఎవరైనా లీక్ చేస్తారా? అంటూ జనం నవ్వుకున్నారు’అని సంజయ్ పేర్కొన్నారు.
‘కేసీఆర్ ప్రభుత్వం మెడలు వంచిన పార్టీ.. బీజేపీ అనే తృప్తి నాకు మిగిలింది. ఈ పాపం ఊరికే పోదు.. కక్ష సాధింపు చర్యలకు ఫలితం ఉంటుంది’అని అన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని బీజేపీ ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ పేర్కొన్నారు.


