పిల్లల కళ్లెదుటే భార్యను హతమార్చిన భర్త
అనుమానంతో ఘాతుకం.. ఖమ్మంలో ఘటన
ఖమ్మం క్రైం: అనుమానమే పెనుభూతంగా మారడం.. తనకు దూరంగా ఉంటోందని కక్ష పెంచుకున్న ఓ భర్త రెక్కీ నిర్వహించి మరీ భార్యను దారుణంగా హతమార్చాడు. ఖమ్మం జిల్లా కేంద్రంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. జిల్లాలోని చింతకాని మండలం నేరడకు చెందిన గోగుల భాస్కర్‌కు ఏపీలోని జగ్గయ్యపేటకు చెందిన సాయివాణి (35)తో పదిహేనేళ్ల క్రితం వివాహం జరగగా పిల్లలు హర్షవరి్ధని, హేమేంద్ర ఉన్నారు.
వివాహం అయినప్పటి నుంచి సాయివాణిని అనుమానంతో వేధిస్తున్న భాస్కర్, ఆ తర్వాత మద్యానికి బానిసై పొలం, రెండు ట్రాక్టర్లు అమ్మేశాడు. ఆయనలో మార్పు రాకపోవడంతో సాయివాణి ఏడాది క్రితం పిల్లలతో సహా జగ్గయ్యపేటలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆపై పిల్లలను ఖమ్మంలోని తన సోదరి వద్ద ఉంచి చదివిస్తోంది. సోదరి సూచనతో సాయివాణి గత మే నెలలో ఖమ్మం వచ్చి ఓ ఫంక్షన్ హాల్‌లో పనికి కుదిరి పిల్లలిద్దరితో అద్దె ఇంట్లో జీవిస్తోంది.
పిల్లలు వద్దని వేడుకున్నా..
ఏడాదిగా కుటుంబాన్ని పట్టించుకోని భాస్కర్‌కు సాయివాణిపై కక్ష మరింత పెరగడంతో ఆమె ఉంటున్న ఇంటిని గుర్తించి కొన్నాళ్లుగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఆమె ప్రతిరోజూ ఉదయం 7గంటలకు వాకిలి ఊడ్చేందుకు బయటకు వస్తుందని గుర్తించి గురువారం తెల్లవారుజామునే వచ్చి ఆమెపై కత్తితో దాడి చేశాడు. సాయివాణి అరుపులకు ఇద్దరు పిల్లలు భయపడి ‘అమ్మను చంపొద్దు నాన్నా’అని వేడుకున్నా ఆమె కడుపులో పొడిచాడు.
కింద పడగానే ఆమెపై కూర్చుని గొంతుపై పొడుస్తుండగా కుమారుడు హేమేంద్ర సమీపంలోని ఆమె సోదరి ఇంటికి వెళ్లి చెప్పాడు. ఆపై కుమార్తె హర్షవర్థిని కత్తి లాక్కునే ప్రయత్నం చేయగా ఆమె చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఈలోపు సోదరి భర్త ఉపేందర్ వచ్చేలోగా అప్పటికే ప్రాణాలు పోయిన సాయివాణి తల వేరు చేయడానికి భాస్కర్ ప్రయత్నిస్తుండగా ఉపేందర్ గట్టిగా పట్టుకున్నాడు.
అంతలో వచ్చిన పోలీసులు మద్యం మత్తులో ఉన్న భాస్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఘటనలో తీవ్రంగా గాయపడిన హర్షవర్ధినిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిని ఏసీపీ రమణమూర్తి, టూటౌన్ సీఐ బాలకృష్ణ పరిశీలించారు.


