పువర్తిలో ఒకే చితిపై హిడ్మా–రాజీ దహన సంస్కారాలు
ప్రభుత్వం ఇచ్చిన బ్లాంకెట్‌ను చితిపై వేసిన హిడ్మా తల్లి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామమైన ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువర్తిలో జరిగాయి. ఈ నెల 18న ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన హిడ్మా, ఆయన భార్య రాజీ మృతదేహాలతో కుటుంబీకులు గురువారం ఉదయం 8 గంటలకు పువర్తికి చేరారు.
ఈ విషయం తెలియగానే చుట్టుపక్కల గ్రామాల ఆదివాసీలు వందలాదిగా పువర్తికి చేరుకున్నారు. ఆదివాసీ పద్ధతులను అనుసరిస్తూ తలపై రెండు చేతులు ఉంచుకొని రున్–సాన్ అంటూ రోదించారు. మధ్యాహ్నం 11 గంటలకు హిడ్మా మృతదేహాన్ని దహనం చేసేందుకు తీసుకెళ్లగా స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల వారితో పువర్తిలో ఇటీవల వేసిన విశాలమైన రోడ్లు కిక్కిరిసిపోయాయి.
ఒకే చితిపై హిడ్మా–రాజీ మృతదేహాలను ఉంచి దహన కార్యక్రమాలను పూర్తి చేశారు. ఆదివాసీ సంప్రదాయాలను అనుసరిస్తూ చితికి నిప్పంటించడానికి ముందు గ్రామస్తులు టవళ్లు, దుప్పట్లు, బ్లాంకెట్స్.. ఇలా ఏదో ఒక వ్రస్తాన్ని చితిపై పేర్చారు.
హిడ్మా తల్లి పోజే ఇటీవల ప్రభుత్వం అందించిన కొత్త బ్లాంకెట్‌ను హిడ్మా చితిపై వేసింది. హిడ్మా అంత్యక్రియల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతాదళాలు బందోబస్తు ఏర్పాటు చేశాయి. గురువారం స్థానికంగా జరిగే సంతను సైతం రద్దు చేశారు.
చావులోనూ తోడుగా
పువర్తిలో 1990 దశకంలో మావోయిస్టుల ఆధ్వర్యంలో చెరువు నిర్మాణ పనులు జరుగుతుండగా..అక్కడి దళంతో పదేళ్ల హిడ్మాకు పరిచయమైంది. ఆ తర్వాత 1999లో పీపుల్స్ గెరిల్లా ఆర్మీ ఏర్పాటయ్యాక, ఒక ప్లాటూన్‌లోకి హిడ్మాను తీసుకున్నారు. జేగురుగొండ దళ కమాండర్‌గా హిడ్మా ఉన్నప్పుడే మరోదళంలో రాజీ కీలక సభ్యురాలిగా ఎదిగింది.
మొదట హిడ్మానే పెళ్లి ప్రస్తావన తెచ్చాడని, ఆరంభంలో ప్రతిపాదనను రాజీ నిరాకరించినా, చివరకు రెండేళ్ల తర్వాత వారిద్దరూ కలిసి విప్లవ జీవన ప్రయాణం మొదలుపెట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. పార్టీ నియమాలను అనుసరించి కలిసి జీవించేందుకు ముందుగానే ఇద్దరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నట్టుగా తెలిపారు. సుమారు రెండు దశాబ్దాలు విప్లవ పోరాటంలో కలిసి నడిచిన హిడ్మా–రాజీ అంత్యక్రియలను ఒకే చితిపై పూర్తిచేశారు.
మాట వింటే మట్టుబెట్టారు : హిడ్మా కుటుంబ సభ్యులు
ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్‌శర్మ పిలుపు మేరకు లొంగిపోయేందుకు వచ్చిన హిడ్మా, ఆయన భార్య రాజీ ఇతర అనుచరులను ప్రభుత్వ దళాలు ప్రాణాలతో పట్టుకొని కాల్చి చంపాయని ఆయన కుటుంబీకులు ఆరోపించారు. ఆపై ఎన్‌కౌంటర్ అని చెబుతున్నారని పేర్కొన్నారు. సామాజిక కార్యకర్త సోనిసోరితో కలిసి గురువారం పువర్తిలో వారు మీడియాతో మాట్లాడారు. హిడ్మా కుటుంబసభ్యులు గోండు భాషలో మాట్లాడుతుండగా సోనిసోరి హిందీలోకి అనువదించారు.


