92 బ్యాంకు ఖాతాల్లోని రూ.8.46 కోట్లు తాత్కాలిక జప్తు
సాక్షి, హైదరాబాద్: పార్ట్‌టైం జాబ్‌లతో పెద్ద మొత్తంలో ఆదాయం పొందండి అంటూ ప్రకటనలు ఇస్తూ పలువురిని బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన భారీ సైబర్ మోసాల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.
నకిలీ ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో డబ్బు సంపాదన పేరుతో నడిచే మోసపూరిత ఎన్‌బీసీ యాప్, పవర్ బ్యాంక్ యాప్, హెచ్‌పీజెడ్ టోకెన్, ఆర్‌సీసీ యాప్, మేకింగ్ యాప్ వంటి మొబైల్ యాప్‌ల ద్వారా జరిగిన సైబర్ మోసాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ జోనల్ ఆఫీసు గురువారం 92 బ్యాంకు ఖాతాల్లోని రూ.8.46 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్‌లను తాత్కాలికంగా జప్తు చేసింది.
కొన్ని క్రిప్టో వాలెట్‌లు, ప్రముఖ క్రిప్టో ఎక్సే్ఛంజ్ కాయిన్ డీసీఎక్స్‌కు చెందిన ఖాతాలు సైతం జప్తు చేసినట్టు జోనల్ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కడప పోలీసులు గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
మోసం ఎలా జరిగింది?
వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు, బల్క్ ఎస్‌ఎంఎస్‌లతో సామాన్య ప్రజలను టార్గెట్ చేసిన మోసగాళ్లు ‘చిన్న పనులు చేస్తే భారీ కమిషన్’అంటూ పలు ఆకర్షణీయ ఆఫర్లు ఇచ్చారు. నకిలీ ఈ–కామర్స్ సైట్లలో వస్తువులు కొనడం, అమ్మడం అని చెప్పి ముందుగా డబ్బు డిపాజిట్ చేయించారు. చిన్న మొత్తంలో లాభం చూపి నమ్మకం కలిగించి, ఆ తర్వాత పెద్ద మొత్తాలు పెట్టించారు.
డబ్బు విత్‌డ్రా చేయాలంటే ‘ట్యాక్స్ కట్టాలి’, ‘క్లియరెన్స్ రుసుం’అంటూ మరిన్ని చెల్లింపులు డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆ యాప్‌లు అందుబాటులో లేకుండా, కస్టమర్లకు కనిపించకుండా చేసేవారు. ఇలా దేశవ్యాప్తంగా పలువురి నుంచి సుమారు రూ.285 కోట్లు కొల్లగొట్టినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.
ఈ డబ్బును 30 ప్రైమరీ బ్యాంక్ ఖాతాల్లో 15 రోజుల్లోపు ఉంచి, తర్వాత 80కి పైన ఇతర ఖాతాలకు మళ్లించారు. దర్యాప్తు అధికారులకు చిక్కకుండా ట్రాకింగ్‌ను కష్టతరం చేశారు. అదేవిధంగా భారీ మొత్తంలో నిధులను క్రిప్టోకరెన్సీగా మార్చారు. కొంత సొమ్మును హవాలా మార్గాల ద్వారా రూటింగ్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పలు బ్యాంకు ఖాతాలు గుర్తించిన ఈడీ అధికారులు రూ.8.46 కోట్లు జప్తు చేశారు.


