ఎన్‌హెచ్–63, ఎన్‌హెచ్–563లో రూ.271 కి.మీ. విస్తరణ టెండర్లకు ఆమోదం
రూ.10,034 కోట్లతో పనులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు కీలక జాతీయ రహదారుల్లో వాహనాలు వేగంగా ముందుకు సాగే వీలు లేకుండా ఇబ్బంది పెడుతున్న అడ్డంకులను అధిగమించేందుకు మార్గం సుగమమైంది. ఆ రోడ్లలో నాలుగు ప్రాంతాల్లో బైపాస్‌లను నిర్మించనున్నారు. ఎన్‌హెచ్–63 (నిజామాబాద్–జగదల్‌పూర్ రహదారి), ఎన్‌హెచ్–563 (జగిత్యాల–కరీంనగర్–వరంగల్–ఖమ్మం రహదారి)లను భారత్‌మాల పరియోజనలో భాగంగా నాలుగు లేన్లకు విస్తరించనున్న విషయం తెలిసిందే. కానీ, విస్తరణకు కావాల్సిన భూసేకరణ మొదలు ఇతర చాలా అంశాల్లో అడ్డంకులు నెలకొనటంతో పనులు ప్రారంభం కాకుండా జాప్యం జరుగుతూ వస్తోంది. తాజాగా ఆయా అడ్డంకులను అధిగమిస్తూ ఎన్‌హెచ్‌ఏఐ విస్తరణ పనులకు టెండర్లు తెరిచి నిర్మాణానికి మార్గం సుగమం చేసింది.
మొత్తం 271 కి.మీ. నిడివి గల విస్తరణ పనులకు రూ.10,034 కోట్ల మొత్తానికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదముద్ర వేసింది. ఆర్మూర్–జగిత్యాల, జగిత్యాల–కరీంనగర్, జగిత్యాల–మంచిర్యాల మధ్య ఈ పనులు జరగనున్నాయి వచ్చే ఫిబ్రవరిలో పనులు మొదలయ్యే అవకాశముంది. ఎన్‌హెచ్–63లో (ఆర్మూర్–మంచిర్యాల సెక్షన్)ఆర్మూర్–జగిత్యాల మధ్య 64 కి.మీ. నిడివి నిర్మాణానికి రూ.2,338 కోట్లు వ్యయం చేయనున్నారు. తాజా లైన్ క్లియర్‌తో మూ డేళ్లలో నిర్మాణం పూర్తి చేసుకోనుంది. ఇదే రోడ్డులో జగిత్యాల–మంచిర్యాల మధ్య 68కి.మీ. మేర మరో ప్యాకేజీ పనులు జరగనున్నాయి. ఇందుకు రూ.2,550 కోట్లు వ్యయం కానుంది. ఈపీసీ మోడల్‌లో టెండర్లు ఆమోదించారు. ఇప్పుడు ఎట్టకేలకు పనులు మొదలు కానున్నాయి. ఇక్కడి కోల్ బెల్ట్‌కు ఈ రోడ్డు విస్తరణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
⇒ ఎన్‌హెచ్–563 (జగిత్యాల–వరంగల్)లో భాగంగా జగిత్యాల–కరీంనగర్ మధ్య 59 కి.మీ. నిడివిని 4 వరుసలుగా విస్తరించనున్నారు. ఇందుకు రూ.2,484 కోట్లు ఖర్చు చేస్తారు. రోడ్డు విస్తరణతోపాటు జంక్షన్‌లను కూడా విస్తరించనుండటంతో ట్రాఫిక్ చిక్కులు దూరం కానున్నా యి. సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ పనులను హ్యామ్ పద్ధతిలో నిర్వహిస్తారు. దీని విస్తరణతో జగిత్యాల–వరంగల్ మధ్య ప్రయాణ సమయం గంటన్నర మేర తగ్గుతుంది. కరీంనగర్–వరంగల్ మధ్య 16 కి.మీ. మేర రూ.500 కోట్లతో రోడ్డును మెరుగుపరచనున్నారు.


