చందంపేట: నల్లగొండ జిల్లా చందంపేట మండలం కంబాలపల్లిలో ఆవులు కృష్ణా నదిని ఈదుకుంటూ శనివారం ఆంధ్ర ప్రాంతానికి తరలి వెళ్లాయి. చందంపేట మండలం కంబాలపల్లి, కాచరాజుపల్లి, గువ్వలగుట్ట, పొగిళ్ల తదితర ప్రాంతాల ఆవులను.. కాపరులు జనవరి నెలలో గ్రాసం కోసం ఆంధ్రకు తరలిస్తుంటారు.
కంబాలపల్లి నుంచి ఆంధ్ర ప్రాంతంలోని మాచర్లకు వెళ్లాలంటే సుమారు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతో ఆవులను ఇలా రెండు కిలోమీటర్ల మేర కృష్ణా నదిని దాటిస్తుంటారు. మొదట గంగమ్మకు పూజలు చేసి గోవులను క్షేమంగా ఒడ్డుకు చేర్చాలని మొక్కుతారు. జనవరిలో మేత కోసం వెళ్లిన ఆవులు.. ఆరు నెలల తర్వాత జూన్‌లో స్వస్థలానికి ఈదుకుంటూనే తిరిగొస్తాయి. దూడలను మాత్రం కాపరులు తమతో పాటు పుట్టీల్లో తీసుకెళ్తారు.


