కనుచూపు మేర అభిమాన జనం.. పక్క రాష్ట్రంలోనూ చెక్కుచెదరని ప్రజాభిమానం
వైఎస్ జగన్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం
అభిమాన నేతను చూసేందుకు పోటెత్తిన అభిమానులు
దగ్గర నుంచి చూడాలని, చేయి కలపాలని పోటీపడ్డ యువత
నాంపల్లి కోర్టు వరకు అడుగులో అడుగు వేసిన జనం
జగన్‌ను చూసేందుకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది సైతం పోటీ
జనాదరణను చూసి ఓర్వలేకపోయిన పచ్చ మీడియా
ఇష్టానుసారం డిబేట్లతో నోరు పారేసుకున్న వైనం
జనం తరలి రావడమే తప్పు అన్నట్లు స్వీయ తీర్పు
సాక్షి, హైదరాబాద్: జనాభిమానం పోటెత్తింది.. బేగంపేట ప్రాంతం జనసంద్రంగా మారింది.. కనుచూపు మేర అభిమాన జనం.. జగన్నినాదాలతో భాగ్యనగరం హోరెత్తింది.. పొరుగు రాష్ట్రంలో సైతం అభిమానం చెక్కుచెదరలేదని స్పష్టమైంది.. తమ అభిమాన నేత వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇక్కడికొస్తున్నారని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న యువత భారీ సంఖ్యలో తరలి రావడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది..
2014 తర్వాత తెలంగాణలో వైఎస్సార్‌సీపీ కార్యకలాపాలు లేకపోయినా వేలాది మంది అభిమానులు బేగంపేట మొదలు నాంపల్లి వరకు ‘జై జగన్.. సీఎం సీఎం..’ అంటూ నినాదాలు చేస్తూ జననేత అడుగులో అడుగు వేసుకుంటూ రావడం కనిపించింది.. జగనన్నను దగ్గరి నుంచి చూడాలని.. వీలైతే చేయి కలపాలని, మాట కలపాలని పెద్ద సంఖ్యలో యువత ముందుకు చొచ్చుకు వస్తుంటే నియంత్రించడానికి పోలీసులు శ్రమించాల్సి వచి్చంది.. హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌కు ఇంతటి ఆదరణ లభించడం చూసి ‘పచ్చ’ మీడియాకు పిచ్చెక్కింది.. రెండు రోజుల ముందు నుంచే విషం చిమ్మిన సదరు ఎల్లో మీడియా.. తాజాగా అవాకులు, చెవాకులు పేలుతూ అక్కసు వెళ్లగక్కింది.

జగనన్నా.. నీ వెంటే మేమంతా: జగన్ కాన్వాయ్ వెంట పరుగులు తీస్తున్న అభిమానులు
జగన్‌ను చూడటానికి ఇంత మంది జనం ఎలా వచ్చారంటూ నిష్టూరమాడింది. ప్రత్యేకంగా డిబేట్లు పెట్టి జగన్‌ను నోటికొచ్చినట్లు మాట్లాడుతూ తెలంగాణ అధికారగణాన్ని తప్పు పట్టింది. ఓ తోక పత్రికకు చెందిన చానల్ మరో అడుగు ముందుకు వేసి లోటస్ పాండ్ వద్ద జనమే లేరని పచ్చి అబద్ధాలు చెప్పడం దుర్మార్గం. దీనంతటికీ కారణం జగన్‌కు జనాదరణ చెక్కుచెదరక పోగా, మరింత పెరిగిందని తేటతెల్లమవ్వడమే.
అన్నా.. నీవు సంతోషంగా ఉండాలె
వైఎస్ జగన్ కోర్టు హాల్ నుంచి బయటికి రాగానే ఆయనతో ఫొటో దిగేందుకు అభిమానులు, ప్రజలు ఎగబడ్డారు. దీంతో కోర్టు హాల్ నుంచి కారు వరకు జగన్‌ను క్షేమంగా చేర్చడం కోసం పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. లిఫ్ట్ వద్ద పెద్ద ఎత్తున సిబ్బంది, న్యాయవాదులు చొచ్చుకువచ్చారు. ‘అన్నా.. నీవు సంతోషంగా ఉండాలె’ అంటూ మహిళా సిబ్బంది ఆకాంక్షించారు. ‘నమస్తే జగన్ అన్నా.. మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది’ అంటూ న్యాయవాదులు మాట కలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో కొంత మంది అభిమానులు పోలీసులను దాటుకుని ఒక్కసారిగా దగ్గరకు వచి్చనా, ఆయన అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అక్కడ నుంచి నేరుగా తల్లి వైఎస్ విజయమ్మను కలిసేందుకు బంజారాహిల్స్ లోటస్ పాండ్‌లోని ఇంటికి బయలుదేరారు. ఇంటి వద్దకు వెళ్లాక జన సందోహంలో చిక్కుకుపోయారు. భారీగా తరలివచి్చన అభిమానులకు అభివాదం చేసుకుంటూ నెమ్మదిగా ఇంట్లోకి వెళ్లారు. మధ్యాహ్న భోజనం తర్వాత తిరిగి బేగంపేట విమానాశ్రయానికి వెళ్లారు.
రెచ్చిపోయిన పచ్చ మీడియా
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌కు భారీగా ఆదరణ లభించడం చూసి ఎల్లో మీడియా పూనకాలెత్తింది. ఉదయం 11 గంటల నుంచే అక్కసు వెళ్లగక్కడం ప్రారంభించింది. అంతకు ముందు రెండు రోజుల నుంచి కూడా విష ప్రచారం చేయడమే కాకుండా గురువారం మరో అడుగు ముందుకు వేసి వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ప్రత్యేక చర్చా వేదికలు నిర్వహించింది. ఇష్టానుసారం మాట్లాడుతూ.. జగన్‌ను చూడటానికి ఇంతగా జనం రావడం తప్పు అని తేల్చింది.
యూరప్ పర్యటన తర్వాత కోర్టులో హాజరై వెళ్లాలన్న సూచన మేరకే వస్తున్నారని తెలిసినా, పనిగట్టుకుని దుష్ప్రచారం చేసింది. జగన్‌ను చూడటానికి అంత మంది జనం వస్తే పోలీసులు ఏం చేశారని ఓ పచ్చ చానల్ ప్రెజెంటర్ అక్కసు వెళ్లగక్కడం చర్చనీయాంశమైంది. జగన్ ప్రజాదరణ కలిగి ఉండటమే నేరం అన్నట్లు సదరు ప్రెజెంటర్ తీర్పు చెప్పడం చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌లు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ఉదయం టిఫిన్ అమరావతిలో, మధ్యాహ్న భోజనం మరో ఊళ్లో, రాత్రి డిన్నర్ హైదరాబాద్‌లో చేస్తుండటం ఎల్లో మీడియా కంటికి కనిపించడం లేదా? వారినెందుకు తప్పు పట్టరు? అంటూ ప్రశ్నిస్తున్నారు.

బేగంపేటలో అపూర్వ స్వాగతం
గత నెల యూరప్ పర్యటనకు అనుమతి వచ్చిన నేపథ్యంలో సీబీఐ కోర్టు సూచించిన మేరకు గురువారం న్యాయస్థానం ఎదుట హాజరయ్యేందుకు వచి్చన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి హైదరాబాద్‌లో అపూర్వ స్వాగతం లభించింది. బేగంపేట విమానాశ్రయంలో పెద్ద సంఖ్యలో జనం ఆయనకు ఘన స్వాగతం పలికారు. జై జగన్.. అంటూ నినదించారు. ‘అన్నా.. జగనన్నా..’ అని అరుస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. జగన్ వస్తున్నారని తెలుసుకుని ఉదయం నుంచే నగరంతో పాటు పలు ప్రాంతాలకు చెందిన అభిమానులు.. ప్రజలు భారీగా తరలివచ్చారు. జగన్ కాన్వాయ్ వెంట నాంపల్లిలోని సీబీఐ కోర్టు వరకు అడుగులో అడుగు వేశారు. దారి మధ్యలో అడుగడుగునా నినాదాలు చేస్తున్న అభిమానులకు వైఎస్ జగన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
బారికేడ్లను దాటిన అభిమానం
వైఎస్ జగన్ ఉదయం 10.51 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వేచి చూస్తున్న పెద్ద సంఖ్యలో అభిమానులు, ఆయన్ను చూడగానే.. ‘జై జగన్..’అంటూ నినాదాలు చేశారు. వారి కేరింతలతో విమానాశ్రయం ప్రాంగణం మారుమోగింది. ఓ దశలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి జగన్‌ను చూసేందుకు పరుగులు తీశారు.
ఉదయం 11.11 సమయంలో తన కాన్వాయ్‌లో విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన జగన్.. గ్రీన్ ల్యాండ్స్, రాజ్‌భవన్, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా నిర్ణీత సమయానికే నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. ఈ మార్గంలో అభిమానులు భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆయన కాన్వాయ్ వెనుక ద్విచక్ర వాహనాల్లో అభిమానులు బయలుదేరారు.
ఉదయం 11.45 గంటలకు జగన్ కాన్వాయ్ నాంపల్లి కోర్టుకు చేరుకోగానే.. అప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు జగన్ ఉన్న వాహనాన్ని మాత్రమే లోపలకు అనుమతించారు. కోర్టు బయట కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని వేచి ఉన్నారు. సీబీఐ కోర్టు ప్రాంగణంతో పాటు న్యాయస్థానం లోపల కూడా న్యాయవాదులతో నిండిపోయింది. జగన్‌ను చూసేందుకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కూడా పోటీ పడ్డారు. మధ్యాహ్నం 12.26 గంటలకు జగన్ బయటకు వచ్చారు.


