రాత్రిపూట వేగంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో చలి తీవ్రతకు ముగ్గురు వృద్ధుల మృతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా చలి వణికిస్తోంది. శీతాకాలంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోవడంతో చల్లదనం ఉండటం సాధారణమే. ఈ పరిస్థితులు వరుసగా నాలుగైదు రోజులుండటం.. ఆ తర్వాత సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరుగుతుంది. కానీ ఈసారి వాతావరణం మరింత భిన్నంగా ఉంది. ఈనెల 8 నుంచి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. దీనికితోడు ఈశాన్య దిశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రంగా ఉంది.
ఈనెల 8 నుంచి వరుసగా రెండు వారాల పాటు అత్యంత తీవ్రమైన చలి నమోదు కావడం గమనార్హం. నైరుతి సీజన్ చివరలో భారీ వర్షాలు నమోదు కావడం.. వాతావరణంలో నెలకొన్న మార్పుల వల్ల చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ముందస్తుగా అంచనా వేసింది. నెలాఖరు నాటికి మరింత తీవ్రమవుతుందని హెచ్చరించింది.
అడపాదడపా వాతావరణంలో మార్పులతో కాస్త ఉష్ణోగ్రతలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేసినప్పటికీ... పగటి పూట సాధారణ వాతావరణం నమోదవుతుండగా... రాత్రిపూట మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు వేగంగా పతనమై చల్లటి వాతావరణం ఏర్పడుతోంది. ఆకాశం నిర్మలంగా ఉండడం... మేఘావృతంగా లేకపోవడంతో భూఉపరితల ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోయి రాత్రిపూట తీవ్ర చల్లదనం ఉంటోందని అధికారులు చెబుతున్నారు.
రేపు అల్పపీడనం!
మలక్కాస్ట్రైట్ మధ్య ప్రాంతంలో గురువారం ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేసింది. ఇది క్రమంగా బలపడి 48 గంటల తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఈ వాయుగుండం క్రమంగా బలపడి పశి్చమ వాయవ్య దిశలో కదిలి నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని, ఉష్ణోగ్రతలు కూడా సాధారణానికి 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతానికి తెలంగాణకు ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.
కోహిర్‌లో 7.4 డిగ్రీలు
రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. గురువారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో 33.1 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 9.2 డిగ్రీలుగా నమోదైంది. రాష్ట్ర ప్రణాళిక శాఖ వివరాల ప్రకారం కనిష్ట ఉష్ణోగ్రత అత్యంత తక్కువగా మెదక్ జిల్లా కోహిర్‌లో 7.4 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. గురువారం రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6.9 డిగ్రీలు తక్కువగా నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.


