మావోయిస్టులను పట్టుకుని హతమార్చడం దారుణం: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్
బీజేపీ పాలకులు రాముని పేరు చెబుతూ నరరూప రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు: ఎమ్మెల్యే కూనంనేని
నేడు హైదరాబాద్‌లో అఖిలపక్షాల ధర్నా
సాక్షి, హైదరాబాద్: ప్రజా జీవితంలో కలుస్తామని ముందుకొచ్చే మావోయిస్టులకు ఆ అవకాశం కల్పించకుండా, వారిని పట్టుకుని చంపేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య దేశంలో చంపడం ఒక్కటే మార్గం కాదని, జన జీవన స్రవంతిలో కలుస్తామని చెప్పిన వారిని కూడా పట్టుకుని చంపడం ఏం పద్ధతి అని మండిపడ్డారు. ‘బీజేపీ ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్ల ద్వారా మావోయిస్టులను చంపడాన్ని నిరసిస్తూ సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఏ కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వామపక్ష, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌరహక్కుల నాయకులు, మేధావులు పాల్గొన్నారు. మహేశ్ గౌడ్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను అందరూ వ్యతిరేకించాలని, ఇటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.
హిడ్మా, కేశవరావు, తిరుపతి వంటి వారిని నాయకులుగా గుర్తిస్తామని, వారు ఎంచుకున్న పద్ధతి ప్రభుత్వాలకు నచ్చకపోయినప్పటికీ, వారు జీవితాంతం ప్రజల కోసం పాటుపడ్డారని గుర్తు చేశారు. మావోయిస్టు నాయకులను హత్య చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం వద్ద అఖిలపక్ష పార్టీల ధర్నా, సంతకాల సేకరణ నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించింది.
నరరూప రాక్షసుల్లా కేంద్ర ప్రభుత్వ పెద్దలు: కూనంనేని
ఎన్‌కౌంటర్ల పేరుతో కాల్చి చంపిన మావోయిస్టుల మృతదేహాలకు న్యాయమూర్తి, కుటుంబ సభ్యుల సమక్షంలో శవ పరీక్షలు నిర్వహించాలని, దీనిని వీడియో తీయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపైన కూడా కేసు నమోదు చేసి విచారించాలని జాతీయ కమిషన్ మార్గదర్శకాలు ఉన్నాయని, దీనిని కేంద్రం పాటించడం లేదన్నారు.
సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్రాన్ని, ప్రధాని మోదీని, బీజేపీని ప్రశ్నించే ప్రతి ఒక్కరిపైనా కేంద్రం దాడి చేస్తోందన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. అడవుల్లోని వనరులను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ప్రకృతిని విధ్వంసం చేస్తూ, అడ్డుగా ఉన్న మనుషులను చంపేస్తున్నారని ఆరోపించారు.
జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ బూటకపు ఎన్‌కౌంటర్లు ప్రభుత్వం మానుకోవాలని, మావోయిస్టులతో చర్చలు జరిపి, సమస్యను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అరుణోదయ విమలక్క, వివిధ పార్టీల నేతలు హన్మెశ్, చలపతిరావు, రమేశ్ రాజా, భాస్కర్ పాల్గొన్నారు.


