కొంతకాలంగా కర్ణాటకలో సీఎం మార్పుపై ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. పవర్ షేరింగ్ ఫార్ములా తెర మీదకు రావడం.. తన తండ్రి రాజకీయ భవిష్యత్తుపై సీఎం సిద్ధరామయ్య కొడుకు చేసిన వ్యాఖ్యలు.. అటుపై రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలన పూర్తి కావడంతో నవంబరులో నాయకత్వ మార్పు (Karnataka CM) తథ్యమని ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో..
రాష్ట్రంలో పవర్ పాలిటిక్స్‌పై కర్ణాటక బీజేపీ యూనిట్ వ్యంగ్యంగా స్పందిస్తోంది. మొన్నీమధ్యే.. నవంబర్ వచ్చినా డీకేకు సీఎం సీటు మాత్రం దక్కలేదని పేర్కొంటూ ఏఐ ఫన్నీ (BJPs AI video) ఏఐ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా సీఎం సిద్ధరామయ్యను ఉద్దేశించి మరో వీడియోను పోస్ట్ చేసింది. అందులో.. సిద్ధరామయ్య ఫేస్‌బుక్ లైవ్‌లో ఉంటారు. సీఎంగా రెండున్నరేళ్ల పాలన పూర్తైందని.. సీఎంగా ఇంకా ఎంత కాలం కొనసాగుతానో తెలియదని.. అందుకే మీ ముందుకు వచ్చానని అంటారు. ఈలోపు..
కింద కామెంట్ సెక్షన్‌లో అజ్మల్, జమాల్, రఫీక్, ఫైజ్.. అనే యూజర్లు ‘ఐదేళ్లు మీరే సీఎంగా ఉండాలి’ అంటూ కామెంట్ పెడతారు. అయితే శంకర్ కనకపుర అనే వ్యక్తి మాత్రం.. ‘ఇంకెంత కాలం సీఎంగా ఉంటారు. రాజీనామా చేసి దిగిపోండి’ అని కామెంట్ చేస్తాడు. దీంతో అగ్గి మీద గుగ్గిలం అయిన సిద్ధరామయ్య.. ఎవరా వ్యక్తి.. అతన్ని బ్లాక్ చేస్తా అంటాడు. రెండు వర్గాలను ఉద్దేశించేలా.. కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ చేసిన ఈ సెటైరిక్ ఈ వీడియో ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.
నాయకత్వ మార్పు నేపథ్యంతో అంతకు ముందు బీజేపీ ఏఐ ఆధారిత వీడియోలో డీకే శివకుమార్‌ని టార్గెట్ చేసింది. అందులో.. రాహుల్ గాంధీ వాట్సాప్‌లో హాయ్ అనే మెసేజ్ పంపిస్తారు. ఆ సమయంలో రాహుల్ పక్కన సిద్ధరామయ్య కూడా ఉంటారు. ఆ తర్వాత స్క్రాచ్ కార్డు పంపుతారు. డీకే దానిని స్క్రాచ్ చేయగా..‘నో ఛైర్ నవంబర్’ (No Chair November) అనే మెసేజ్ చూసి షాక్ అవుతాడు. మరోవైపు రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య కూడా నవ్వుకుంటారు. అనంతరం స్క్రీన్‌పై హస్కీ డ్యాన్స్‌ను దీనికి జోడించారు. బీజేపీ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. శివకుమార్‌కు ఇది కుర్చీలేని నవంబర్ అని వ్యంగ్యాస్త్రాలు విసిరింది.


