సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన వ్యవస్థలను కూటమి ప్రభుత్వం కొనసాగించి ఉంటే రైతులకు మంచి జరిగేదన్నారు పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఆ వ్యవస్థలు లేకనే తుపాన్ కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు.
తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైఎస్సార్‌సీపీ హయాంలో రైతుల సంక్షేమంపై వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కానీ, తుపాన్‌తో నష్టపోయిన రైతులను చంద్రబాబు ఆదుకోలేదు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతుల దగ్గరకు చంద్రబాబు వెళ్తారు?. గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. ఇదంతా చంద్రబాబు నిర్వాకం వల్లే..
.. మాపై విష ప్రచారం చేస్తూనే అబద్ధాలు, మోసాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ అన్నారు.. ఇప్పటివరకూ ఏమైనా తేలిందా?, సుప్రీంకోర్టు ఆదేశాలను సిట్ పాటించడం లేదు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైఎస్సార్‌సీపీపై తప్పుడు కేసులు. కుట్ర సిద్ధాంతంతో పాలన చేస్తున్నారు. చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారు. ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉన్నాయి..
.. చంద్రబాబు అవినీతికి సాక్ష్యాలు ఉన్నాయి. కానీ, ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసులను ఎత్తివేయాలని చూస్తున్నారు. అవినీతి చేయకపోతే చంద్రబాబుకి ఎందుకంత భయం?. తప్పు చేయనప్పుడు కేసుల్ని ఎదుర్కోవాలి కదా. తప్పు చేశారు కాబట్టే కేసులు వెనక్కి తీసుకుంటున్నారు. మేం అధికారంలోకి వచ్చాక కేసులన్నీ తిరగతోడతాం. అన్ని కేసులపై పునర్విచారణ చేయిస్తాం’’ అని సజ్జల స్పష్టం చేశారు.



