
అమెరికాలో బుధవారం జరిగిన చతుర్భుజ కూటమి (క్వాడ్) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం అనుకున్న విధంగానే కశ్మీర్‌లోని పెహల్‌గామ్‌లో మొన్న ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడిచేసి 26 మందిని పొట్టన బెట్టుకున్న ఉదంతాన్ని తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనటంలో సహకరించుకోవటానికి సిద్ధంగా ఉన్నామని ఉమ్మడి ప్రకటన తెలియజేసింది.
‘ఇందుకు కారకులైనవారినీ, దాడిలో పాల్గొన్నవారినీ, వారికి ఆర్థికంగా సహకరించినవారినీ ఎలాంటి జాప్యం లేకుండా శిక్షించటానికి ఐక్యరాజ్యసమితి దేశాలన్నీ తోడ్పడాల’ని సూచించింది. క్వాడ్ వంటి కూటములు ఏర్పడటం వెనకుండే ధ్యేయం సంక్షోభ సమయాల్లో సమష్టిగా అడుగు మందుకేయటం కోసమే.
కానీ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తున్నా ఆ దేశాన్ని వేలెత్తి చూపటానికీ, అటువంటి కార్యకలాపాలు మానుకోవాలని హెచ్చరించటానికీ కూటమిలోని మిగతా మూడు దేశాలూ సిద్ధంగా లేవంటే క్వాడ్ ఆవిర్భావానికి గల ప్రాతిపదికే ప్రశ్నార్థకంగా మిగిలినట్టు లెక్క. పెహల్‌గామ్ ఘటన అనంతరం మన దేశం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడిచేసింది.
దానికి ప్రతిగా పాకిస్తాన్ సైన్యం మనపై క్షిపణులతో, డ్రోన్‌లతో దాడికి దిగాక మన దళాలు వాటిని తిప్పికొట్టడంతోపాటు అక్కడి వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇరు దేశాల మధ్యా ఇది పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమించే సూచనలు కనబడ్డాయి. కారణాలేమైతేనేం...నాలుగు రోజుల అనంతరం కాల్పుల విరమణకు ఇరు దేశాలూ అంగీకరించాయి.
ప్రపంచ దేశాలన్నీ ఈ పరిణామాలను ఎంతో ఆందోళనతో గమనించాయి. కానీ ఉమ్మడి ప్రకటన పాక్ పేరెత్తి ఖండించకుండా మర్యాదపూర్వకంగా, లౌక్యంగా మాట్లాడితే ఒరిగేదేమిటి? క్వాడ్ ఈనాటిది కాదు. పద్దెనిమిదేళ్ల క్రితం జపాన్ ద్వారా మన దేశాన్ని ఒప్పించి ఈ కూటమి ఏర్పాటుకు నాంది పలికింది అమెరికాయే. 2007లో కూటమి ఏర్పాటుపై చర్చించటానికి నాలుగు దేశాలూ సమావేశమైనప్పుడే చైనా ఉరిమింది.
తనకు వ్యతిరేకంగానే ఈ కూటమి ఏర్పడుతున్నదంటూ నిష్టూరానికి పోయింది. ఏడాది గడవకముందే జపాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి కూటమి నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. 2008లో ప్రభుత్వం మారి ఆస్ట్రేలియా సైతం నిష్క్రమిస్తున్నట్టు తెలియజేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో 2017లో తిరిగి క్వాడ్‌కు జీవం పోసింది అప్పటి ట్రంప్ ప్రభుత్వమే. అప్పటికల్లా దక్షిణ చైనా, తూర్పు చైనా సముద్ర జలాల్లో చైనా కార్యకలాపాలు పెరిగాయి. ‘అన్నీ నేనే... అంతా నాదే’ అంటూ పగడాల దిబ్బలు, ఇసుక మేటలు చైనా తన ఖాతాలో వేసుకుంది. అంతటితో ఊరుకోక స్ప్రాట్లీ దీవుల చుట్టూ ఏడు కృత్రిమ దీవుల నిర్మాణం ప్రారంభించింది.
ఇది జపాన్‌తో పాటు ఆస్ట్రేలియానూ... ఆ రెండు దేశాలకూ అన్ని విధాలా అండగా ఉంటున్న అమెరికానూ చికాకు పెట్టిన పర్యవసానంగానే క్వాడ్ మళ్లీ పురుడు పోసుకుంది. సారాంశంలో ఇది అమెరికా, చైనాల మధ్య జరిగే ఆధిపత్య పోరులో భాగంగా వచ్చింది. అందులో మనల్ని భాగస్వాముల్ని చేసి తన వివాదాన్ని మనకు కూడా అంటించిన అమెరికా మనకు సమస్య వచ్చినప్పుడు మాత్రం మనవైపుండదని పెహల్‌గామ్ రుజువు చేసింది.
మరి ఇలాంటి కూటములు పెట్టి ప్రయోజనమేమిటి? విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్ సిబల్ అన్నట్టు పాకిస్తాన్‌తో మిగిలిన మూడు సభ్య దేశాలకూ, ముఖ్యంగా అమెరికాకూ స్నేహ సంబంధాలుండటం వల్ల ఉమ్మడి ప్రకటనలో నేరుగా దాన్ని ప్రస్తావించటానికి మొహమాటపడి ఉండొచ్చు. మరి అదే పరిస్థితి మనకు ఉండదా? మనకూ, పాకిస్తాన్‌కూ వున్న వైషమ్యాలపై క్వాడ్ పెట్టేనాటికే మిగిలిన మూడు దేశాలకూ అవగాహన ఉండాలి. మరి ఎందుకు కలుపుకొన్నట్టు? ఇలాంటి పరిస్థితి తలెత్తగలదని ఆనాడు తెలియదా?
భూగోళంలో ఏమూల ఉగ్రవాదం ఉన్నా దాన్ని నిర్మూలించేదాకా వదలబోమని, దానిపట్ల దయాదాక్షిణ్యాలుండబోవని 2001లో తాను చేసిన శపథం అమెరికాకు గుర్తుందా? క్వాడ్ కూటమి సమావేశానికి ముందు మన విదేశాంగ మంత్రి జైశంకర్ మూడు దేశాల విదేశాంగ మంత్రులతో విడివిడిగా భేటీ అయ్యారు. పెహల్‌గామ్, తదనంతర పరిణామాలపై వారితో చర్చించారు.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరును వివరించారు. బహుశా దాని పర్యవసానంగా కనీసం పెహల్‌గామ్‌ను ప్రకటనలో ప్రస్తావించి చర్య తీసుకోవాలన్న డిమాండైనా చేశారు. లేకుంటే దానికి కూడా దిక్కు లేకపోయేదేమో! పాకిస్తాన్ ఎన్ని తప్పుడు పనులకు పాల్పడుతున్నా అమెరికాకు ఆ దేశమంటే మోజు.
‘రెండు దేశాలనూ బెదిరించి యుద్ధం ఆపాన’ని గొప్పలు పోయిన ట్రంప్, ఆ తర్వాత వారం గడవకుండా ఆ దేశ ఆర్మీ చీఫ్‌తో భేటీ అయి పొగడ్తలతో ముంచెత్తారు. చైనాతో మనకు సరిహద్దు వివాదాలున్న సంగతి నిజమే. ఆ విషయంలో మన దేశం రాజీ పడకుండా చర్చలు సాగిస్తోంది.
దురాక్రమణకు ప్రయత్నించినప్పుడల్లా ఎదుర్కొంటున్నది. క్వాడ్ ఉనికిలోకి రాకముందునుంచీ అది కొనసాగుతోంది. పరస్పరం సహకరించుకోవటానికీ, ఎదగటానికీ కూటములు అవసరం. అధునాతన సాంకేతికతల్లో తోడ్పడే అత్యంత కీలకమైన ఖనిజాల, ఇతర వనరుల సరఫరాపై చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా ఎదిగేందుకు, సరఫరాలకు అంతరాయం ఏర్పడకుండా చూసేందుకూ సమష్టిగా కృషి చేయాలని క్వాడ్ తీర్మానించటం హర్షించదగ్గదే.
ఈ ఏడాది చివరిలో క్వాడ్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు మన దేశంలో జరుగుతున్న నేపథ్యంలో కూటమి భాగస్వాముల్లో మరింత సదవగాహన, సమన్వయం అవసరమని... కీలక సమయాల్లో నిర్మొహమాటంగా ఉండటం ముఖ్యమని తెలుసుకుంటే మంచిది.