
మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి వైభవం పునరావృతమవుతుందని బహుశా పాకిస్తాన్ ఇన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ ఊహించివుండదు. ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ను స్వల్ప వ్యవధిలో మూడుసార్లు వైట్‌హౌస్‌కు ఆహ్వానించి గౌరవించటం, నాలుగు రోజుల నాడు మునీర్‌తోపాటు ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సాదరంగా హత్తుకోవటం పాకిస్తాన్ దృష్టిలో చిన్న విషయాలేమీ కాదు. పైగా వారిద్దరికీ ట్రంప్ నుంచి దండిగా ప్రశంసలు దక్కాయి.
ఒక పాక్ ప్రధాని అమెరికా అధ్యక్షుణ్ణి కలుసుకుని మాట్లాడటం 2019 తర్వాత ఇదే తొలిసారి. అలాగని పాకిస్తాన్‌ను ఎప్పుడూ పూర్తిగా దూరం పెట్టింది లేదు. ప్రపంచం నలుమూలలా గాలిస్తున్న ఉగ్రవాది బిన్ లాడెన్‌కు పాక్ ఆశ్రయమివ్వటం వంటి ఉదంతాలు అమెరికాకు ఆగ్రహం కలిగించినా, ప్రచ్ఛన్నయుద్ధ కాలం నాటి పాక్ సహకారాన్ని అమెరికా మరువదల్చుకోలేదు. అదే సమయంలో మనం నొచ్చుకోకుండా ఉండేందుకు ఆ దేశాన్ని కాస్త దూరం పెట్టినట్టు కనబడేది.
ట్రంప్ తొలిసారి అధికారంలో కొచ్చినప్పుడు పాకిస్తాన్ పేరు చెబితే భగ్గుమనే వారు. అనంతరం వచ్చిన జో బైడెన్ సైతం పాకిస్తాన్‌ను తగినంత దూరంలోనే పెట్టారు. కానీ రెండోసారి అధికారంలో కొచ్చాక ట్రంప్ వైఖరి మారింది. భారత్ తన ఆదేశాలను శిరసా వహించటం లేదన్న అక్కసుతోపాటు స్వప్రయోజనాలపై దృష్టి పడింది. అందుకే పాకిస్తాన్‌కు అతిగా ప్రాధాన్యమిస్తున్నారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
గత కాలపు చెలిమికీ, వర్తమాన సాన్నిహిత్యానికీ చాలా తేడా ఉంది. అప్పట్లో మన దేశం సోవియెట్ యూనియన్‌కు సన్నిహితంగా ఉండటం, తన ఒత్తిళ్లకు లొంగకపోవటం తదితర కారణాలతో ఆసియాలో అమెరికాకు పాకిస్తానే దిక్కయ్యేది. ప్రస్తుత పరిస్థితి వేరు. ట్రంప్‌కు ఇప్పుడు దేశ ప్రయోజనాల కన్నా స్వీయ ప్రయోజనాలే ముఖ్యం. మాజీ అధ్యక్షుడు ఒబామా మాదిరే తనకూ నోబెల్ బహుమతి వచ్చితీరాలని ఆయన పట్టు దలగా ఉన్నారు.
భారత్–పాక్ యుద్ధంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఏడు ఘర్షణలు ఆపాననీ, అందువల్ల శాంతి బహుమతికి తాను అర్హుడిననీ ఆయన తరచూ చెప్పుకుంటు న్నారు. మధ్యమధ్యన మాట మార్చినా భారత్–పాక్‌లు రెండూ చర్చించుకోబట్టే యుద్ధం ఆగిందని ట్రంప్ స్వయంగా మూడు నాలుగు దఫాలు అన్నారు. మునీర్ సైతం ఘర్షణలు నిలపాలన్నది ఇరు దేశాల నిర్ణయమని తెలిపారు. ఇప్పుడు ట్రంప్ అబద్ధానికి పాక్ వంత పాడుతోంది.
ట్రంప్ కోరుకుంటున్నవి ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఖనిజాలు ప్రధాన మైనవి. పాక్ భూగర్భంలో అపార ఖనిజ సంపద ఉంది. బంగారం, రాగి, మాంగనీస్, క్రోమైట్ వగైరా 92 రకాల ఖనిజాలు అక్కడ లభ్యమవుతాయని చైనా ఖనిజాభివృద్ధి సంస్థ పరిశోధనలు తేల్చిచెప్పాయి. ఇవిగాక ఏఐ, ఎలక్ట్రిక్ కార్లు వగైరాల్లో ఉపయోగపడే కీలక ఖనిజాలున్నాయి. ఇందులో అధికభాగం ఉగ్రవాదుల హవా సాగుతున్న బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రాంతాల్లో ఉన్నాయి.
అందుకే ఖనిజ సంపద ద్వారా పాక్‌కు సమకూరే ఆదాయం 2 శాతం మించటం లేదు. నిరుడు పాకిస్తాన్ 521 ఉగ్రదాడులు ఎదుర్కొంది. అక్కడ విద్యుత్ కొరత కూడా తీవ్రంగా ఉంది. ఖనిజశుద్ధి పరిశ్రమలు స్థాపిస్తామంటేనే గనులు అప్పజెబుతామని పాక్ ఆశ చూపుతున్నా ఉగ్ర వాదం, విద్యుత్ సంక్షోభం కారణాలుగా చూపి ఏ దేశమూ ముందుకు రావటం లేదు. ఇప్పుడు ఆ ఖనిజ సంపదపై ట్రంప్ కన్నుపడింది. ఇదిగాక ట్రంప్ కుటుంబ భాగస్వామ్యం ఉన్న లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థ నడిపే క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు పాక్ అనుమతులిచ్చింది. ఆ దేశంపై మోజు పెరగటంలో వింతేముంది?
పాకిస్తాన్‌లో ప్రజా ప్రభుత్వం ఉండగా, ట్రంప్ దాన్ని బేఖాతరు చేసి సైనిక దళాల చీఫ్‌కు ప్రాధాన్యమిచ్చి వ్యవహారాలు చక్కబెట్టుకోవటం ఆందోళనకరం. పాక్ సైన్యం అమెరికా ఒత్తిడి పర్యవసానంగా గత రెండు దశాబ్దాల నుంచి ప్రభుత్వంలో ప్రత్యక్ష జోక్యాన్ని తగ్గించుకుంది. తెరవెనక మంత్రాంగానికే పరిమితమైంది. కానీ ట్రంప్ పుణ్యమా అని మళ్లీ సైన్యం ప్రభావం పెరుగుతోంది. ఇది ఆ దేశానికి మాత్రమే కాదు... పొరుగునున్న మనకు కూడా ప్రమాదకరమైన పరిణామం. మన ప్రభుత్వం దీన్ని పరిగణనలోకి తీసుకోక తప్పదు.