
రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లు ఆపాలంటూ వరస బెదిరింపులతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌ను లొంగదీసుకోవాలని చూస్తున్న తరుణంలో మన విదేశాంగ శాఖ తొలిసారి నేరుగా బదులీయటం కీలక పరిణామం. దీనికి రెండురోజుల ముందు స్థానిక తయారీ ఉత్పత్తుల్ని, సరుకుల్ని కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు.
అమెరికాలో గత కొన్ని దశాబ్దాలుగా అక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తూ వచ్చిన అస్తవ్యస్త విధానాల పర్యవసానంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి ట్రంప్ అమలుచేసిన తప్పుడు నిర్ణయాలు తోడై ఆర్థికవ్యవస్థను ఊపిరాడకుండా చేస్తున్నాయి. వాటి నుంచి బయటపడటం కోసం ఆయన ప్రపంచ దేశాలపై ఆర్థిక దండయాత్ర మొదలుపెట్టారు. చైనాపై 145 శాతం సుంకాల మోత మోగించటంతో మొదలుపెట్టి తన సన్నిహిత దేశాలపై సైతం దాదాపు 50 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించి, అనంతరకాలంలో వెనక్కితగ్గారు.
ఈ దశలో ఆయన మన జోలికి రాలేదు. మోదీతో 2016 నుంచీ ఉన్న సాన్నిహిత్యంతో ఆయన తాను చెప్పినట్టు వింటా రని ట్రంప్ భ్రమపడ్డారు. తీరా కథ అడ్డం తిరిగేసరికి ఆగ్రహోదగ్రుడవుతున్నారు. అందుకే కావొచ్చు... జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం, బంగ్లాదేశ్, ఇండొనేసియాలపై 15–20 శాతంమధ్య సుంకాలు విధించిన పెద్ద మనిషి మన దగ్గరకొచ్చేసరికి ఇప్పటికే విధించిన 25 శాతం సుంకాలతోపాటు రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు ఆపకపోతే మరిన్ని రెట్లు పెంచుతానని హెచ్చరించారు.
స్వదేశంలో సంపన్నులకూ, పారిశ్రామికవేత్తలకూ లక్షల కోట్ల డాలర్ల పన్ను రాయితీలు ప్రకటించి, ప్రపంచ దేశాలపై అదనపు సుంకాలు విధించటం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవాలన్నది ఆయన పథకం. దీన్ని చూసీచూడనట్టు వూరుకుంటే ఈ బాణీయే కొనసాగిస్తారు. అమెరికా పాటించే ద్వంద్వ ప్రమాణాలు ఎవరికీ తెలియనివి కాదు. కానీ ట్రంప్ మరింత నిస్సిగ్గుగా వాటిని ఆచరిస్తున్నారు.
ఒకపక్క తమ అణు పరిశ్రమలకు కావాల్సిన యురేనియం హెక్సాఫ్లోరైడ్ అయినా, విద్యుత్ వాహనాల తయారీలో అవసరమైన ప్లాటినం రకానికి చెందిన రసాయన మూలకం పలాడియం, ఎరువులు, రసాయనాలు వంటివి రష్యా నుంచి ఇప్పటికీ దిగుమతి చేసుకుంటూ... మనం మాత్రం ముడి చమురు కొనకూడదని శాసిస్తున్నారు.
అందుకే మోదీ స్వదేశీ ఉత్పత్తుల్నీ, సరుకులనూ కొనటం అత్యవసరమని ప్రజలకు పిలుపునిచ్చారు. వర్తమాన తరుణంలో స్వదేశీ నినాదం సరైనది. అయిదేళ్లక్రితమే మోదీ ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం ఈ విషయంలో పెద్దగా చేసిందేం లేదు.
అంతక్రితం ఉన్న యూపీఏ ప్రభుత్వం గురించి చెప్పనవసరం లేదు. గతంలో ప్రణాళికా సంఘం, ఇప్పుడు నీతి ఆయోగ్... అలాగే సాంకేతిక నిపుణుల మాట చెల్లుబాటవుతూ వచ్చింది. ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ ఈ విషయంలో ప్రభుత్వాన్ని గతంలో పలుమార్లు తీవ్రంగా తప్పుబట్టింది. కానీ మారిందేమీ లేదు.
ట్రంప్ ఒక్కరే కాదు...బ్రిటన్, ఈయూలు సైతం తమ వినియోగవస్తువులపై, యంత్ర పరిక రాలపై సుంకాలు తగ్గించమంటున్నాయి. అందుకు తలొగ్గితే మన సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) దెబ్బతింటాయి. అమెరికా ఒత్తిళ్లకు లొంగితే మన సాగు రంగం, పాడి పరిశ్రమ రంగం ఇబ్బందుల్లో పడతాయి. ఆ రెండు రంగాలపైనా 70 కోట్లమంది ప్రజానీకం ఆధారపడతారు.
ఇవిగాక జన్యుమార్పిడి చేసిన మొక్కజొన్న, సోయాబీన్స్ దిగుమతి చేసు కోవాలని అమెరికా కోరుకుంటోంది. ఇది ప్రమాదకరం. వాటి సంగతలావుంచి వర్తమాన అనిశ్చిత వాతావరణంలో మనమే కాదు...దేశాలన్నీ ఆత్మరక్షణ బాటపట్టాయి. తమ దేశానికొచ్చే విదేశీ సరుకుపై అధిక సుంకాలు విధించటం, విదేశాలకు ఎగుమతయ్యే తమ సరుకుకు తక్కువ సుంకాల కోసం ఒత్తిళ్లు తీసుకురావటం రివాజైంది.
ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్, సెమీకండ క్టర్‌లు, రక్షణ, సౌరశక్తి రంగాలకు పెద్దయెత్తున ప్రోత్సాహకాలు ఇవ్వాల్సివుంది. పెంచిన సుంకాల పరిధిలో ఎలక్ట్రానిక్స్, ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు వగైరాలను ట్రంప్ మినహాయించారు. ‘జాతీయ ప్రయోజనాల రీత్యా’ ఈ నిర్ణయం తీసుకున్నారట. కానీ ఆ ఉత్పత్తుల ధరల్ని పెంచటం ద్వారా అదనపు రాబడికి వ్యూహరచన చేస్తే అమెరికా సృష్టించదల్చుకున్న సంక్షోభంనుంచి ఉపశమనం పొందవచ్చు.
అయితే వాటికి మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తేనే ఇదంతా సాధ్యం. ఇప్పటికే స్వావలంబన దిశగా అడుగులేసివుంటే వేరుగా వుండేది. ఇప్పటికిప్పుడు తీసుకునే చర్యల నుంచి వెంటనే ఫలితాన్ని ఆశించలేం. ఈలోగా అమెరికా కోరుతున్నదేమిటో, మన తిరస్కరణకు కారణమేమిటో పార్లమెంటు వేదికగా తేటతెల్లం చేయాలి. అది జరిగితేనే ప్రజలు మరింత దృఢంగా మద్దతిస్తారు.