
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. మన దేశంపై ఉన్న అదనపు సుంకాల భారాన్ని 50 శాతానికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఉన్న 25 శాతం సుంకాలకూ బుధ వారం నుంచి మరో 25 శాతం చేరింది. క్షణానికో రకంగా, రోజుకో విధంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవటంలో సిద్ధహస్తుడైన ట్రంప్ చివరికి ఏం చేస్తారోనన్న ఉత్కంఠ అందరిలో ఉండేది. మూర్ఖత్వం విచక్షణను ఎరుగదు. తన ఆదేశాలను ధిక్క రిస్తూ రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయటం వల్లే ఈ చర్య తీసుకున్నట్టు అమెరికా చెప్పుకొంటోంది.
మనల్ని మించి ముడిచమురు కొంటున్న చైనాకు ఆ తర్కం ఎందుకు వర్తించదో ఇంతవరకూ అది సంజాయిషీ ఇవ్వలేకపోయింది. అసలు రష్యా– ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే శక్తి అమెరికాకు తప్ప మరెవరికీ లేదు. ఎందుకంటే తెరవెనకుండి యూరప్ దేశాల ద్వారా ఉక్రెయిన్‌ను రష్యాపై ఉసిగొల్పిందీ, ఆ యుద్ధానికి అంకు రార్పణ చేసిందీ తానే. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించటం ద్వారా... లేక ఇక వెనక్కు తగ్గాలని ఉక్రెయిన్‌ను కోరటం ద్వారా శాంతికి దోహదపడాల్సింది కూడా తానే.
కానీ ఆ పని చేయకపోగా ఆ యుద్ధం కొనసాగటానికి మనమే బాధ్యులమంటూ దబాయిస్తోంది. దాన్ని ‘మోదీ యుద్ధం’గా అభివర్ణిస్తూ వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో నోరు పారేసుకున్నారు. మనం చమురు కొనటం వల్లే రష్యా యుద్ధం కొనసాగుతోందని తప్పుడు భాష్యానికి దిగారు. ఏ రకంగా చూసినా ప్రపంచంలో సకల అవలక్షణాలకూ బాధ్యత వహించక తప్పని అమెరికాయే రష్యా– ఉక్రెయిన్ యుద్ధానికి కూడా కర్త, కర్మ, క్రియ. ఏకకాలంలో భిన్న సూచనల్ని పంపి అవతలి పక్షాన్ని గందరగోళపరచటం అమెరికాకు అలవాటైన విద్య.
ఈ దబాయింపులకు ముందురోజే ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ ‘చివరకు రెండు దేశాలూ ఒక్కటవుతాయి’ అని మాట్లాడారు. అందరికన్నా ముందు ఏప్రిల్‌లోనే వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు మొదలెట్టిన భారత్... మే 1 లేదా జూన్ 1 కల్లా దానిపై సంతకాలు చేయాల్సిందని ఆయన చెబుతున్నారు. చర్చించు కుని ఒప్పందంపై సంతకాలు చేస్తారు తప్ప, తమకు నచ్చినట్టు రాసుకుని, ఒప్పందం పూర్తయినట్టేనని చెబితే అంగీకరించేదెవరు? ఇలాంటివి మాఫియా సామ్రాజ్యాల్లో చెల్లుబాటవుతాయి. నాగరిక ప్రపంచంలో సాధ్యపడదు.
భారత్–అమెరికా సంబంధాలు ఆదినుంచీ సంక్లిష్టమైనవే. ఇందుకు అమెరికా తనను తానే నిందించుకోవాలి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పాకిస్తాన్‌కు సాయపడుతూ, మనల్ని చీకాకు పరిచేందుకు నిరంతరం ప్రయత్నించేది. ఆ దశ దాటి ఇరు దేశాల మధ్యా స్నేహం చిగురించి, దృఢమైన బంధంగా మారి దశాబ్దాలు దాటుతోంది. కానీ పాకిస్తాన్‌ను దువ్వటం ఆపలేదు.
ఉగ్రవాద ఘటనలు జరిగినప్పుడల్లా మన దేశం డిమాండ్ చేస్తే తాత్కాలికంగా ఆర్థిక సాయం ఆపటం లేదా ఆయుధ సామగ్రి ఎగుమతి నిలిపినట్టు కనబడటం, ఆ తర్వాత పునరుద్ధరించటం అమెరికా దురలవాటు. మొన్నటికి మొన్న పెహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్యపై ఒక్క మాట మాట్లాడటానికి నోరు పెగలని ట్రంప్, భారత్–పాక్ ఘర్షణల్ని ఆపానని స్వోత్కర్షకు పోవటం ఇప్పటికీ ఆపలేదు. సరిగదా పాక్ ఆర్మీ చీఫ్‌కు ఘన ంగా మర్యాదలు చేశారు.
కెనడాలో జరిగిన జీ–7 శిఖరాగ్ర సదస్సు నుంచి రావాలన్న ఆహ్వానాన్ని మోదీ తిరస్కరించటం, తమ డెయిరీ ఉత్పత్తులనూ, జన్యుమార్పిడి ఆహార ఉత్పత్తులనూ అనుమతించాలన్న ఒత్తిడికి అంగీకరించకపోవటం ట్రంప్ కడుపుమంటకు కారణం. కానీ ముడిచమురు సాకు చెబుతున్నారు. భారత్‌లో 46 శాతం మంది సాగు రంగంపై ఆధారపడతారు. అమెరికాలో ఇది ఒక్క శాతమే. ఆ ఒక్కశాతం కోసం దేశ జనాభాలో సగంమంది ఆధారపడే రంగాన్ని ధ్వంసం చేయాలట!
ఏమైతేనేం తాజా సుంకాల భారం మన దేశంనుంచి పోయే 66 శాతం ఎగుమతులపై తీవ్ర ప్రభావమే చూపగలదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందువల్ల ఈ ఏడాది, వచ్చే ఏడాది మన వృద్ధిపై 0.8 శాతం కోత పడవచ్చంటున్నారు. రత్నాభర ణాలు, దుస్తులు, వాహనాల విడిభాగాలు, స్టీల్, రొయ్యలు, తోలు ఉత్పత్తులు వగైరాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందనీ, ఈ రంగాల్లో అనిశ్చితి ఏర్పడుతుందనీ అంచనా.
లక్షలాదిమంది కార్మికుల ఉద్యోగాలకు ముప్పు కలగవచ్చు కూడా. ఈ ఎగుమతుల్ని వేరే దేశాలకు మళ్లించగలిగితే నష్టాన్ని తగ్గించుకోగలం. అదృష్టవశాత్తూ మనది ఎగుమతుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాదు. అందుకే దేశ ప్రజానీకమంతా ఒక్కటై పట్టుదలగా ఇక్కడి ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తే ఈ గండాన్ని గట్టెక్కడం కష్టం కాదు.