
తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరైన సమయంలో కలుగజేసుకున్నారని.. లేకుంటే భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉండేదని అమెరికా మరోసారి ప్రకటించుకుంది. భారత్-పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో ట్రంప్ నేరుగా జోక్యం చేసుకున్నారని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో తాజాగా ప్రకటించారు.
‘‘ట్రంప్ శాంతికి కట్టుబడి ఉన్నారు. అందుకే శాంతి అధ్యక్షుడిగా ఆయనకు గుర్తింపు దక్కింది. భారత్-పాక్ యుద్ధాన్ని ఆపింది ఆయనే. ఆ సమయంలో ఆయనే నేరుగా జోక్యం చేసుకున్నారు. తద్వారా ఇరు దేశాల ఉద్రిక్తతలను చల్లార్చారు. లేకుంటే ఆ దక్షిణాసియా దేశాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉండేదేమో.. ఇది వాస్తవం’’ అని రుబియో గురువారం ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మరికొన్ని దేశాల సంక్షోభాలకు ట్రంప్ తెర దించారని.. అది అమెరికన్లు ఎంతో గర్వించదగ్గ విషయమని రుబియో అన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా సంక్షోభంపై అమెరికా దృష్టిసారించిందని అన్నారాయన.
భారత్ ఖండన
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది భారత్. అయితే ఆ సమయంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపై ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే ఇరు దేశాల యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ ఇప్పటికి పదుల సంఖ్యలో ప్రకటించుకున్నారు. అయితే భారత్ మాత్రం ఆ దౌత్య ప్రకటనను తోసిపుచ్చుతూ వస్తోంది.
ఇరు దేశాల సైన్యాల మధ్య చర్చలు జరిగాయని.. పాక్ కోరినందునే తాము కాల్పుల విరమణకు అంగీకరించామని, ఇందులో అమెరికా సహా మరేయితర దేశపు జోక్యంగానీ.. ఒత్తిడిగానీ చేసుకోలేదని భారత ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే ట్రంప్ జోక్యంపై విపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. ఈ తరుణంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్‌లు ‘‘ఎవరీ జోక్యం లేదు’’ అని పార్లమెంట్‌లోనూ స్పష్టమైన ప్రకటనలు చేశారు. అయినప్పటికీ అమెరికా మాత్రం ట్రంప్‌కు క్రెడిట్ ఇచ్చుకోవడం మానడం లేదు.