ఖాట్మండు: నేపాల్‌ను పాస్‌పోర్ట్‌ల సంక్షోభం కుదిపేస్తోంది. పాస్‌పోర్ట్‌లను ముద్రించి అందిస్తున్న ఫ్రెంచ్ కంపెనీ ఇడెమియాతో తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకోవడంలో జాప్యం జరగడమే ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. ఇడెమియా కంపెనీతో ఒప్పందం 2025 డిసెంబర్ 21తో ముగియనుంది. తదుపరి జర్మన్ కంపెనీలైన వెరిడోస్, ముహెల్‌బౌర్ ఐడీ సర్వీసెస్ 2026 మార్చి 9 నుండి పాస్‌పోర్ట్‌లను సరఫరా చేయనున్నాయి. దీంతో ఈ రెండింటి మధ్య కాలంలో పాస్‌పోర్ట్‌లను ఎలా అందించాలనేది నేపాల్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
ఇడెమియా ప్రస్తుతం ఒక్కో పాస్‌పోర్ట్‌ను $10.13(రూ.898.39)కు అందిస్తుండగా, కొత్త జర్మన్ కాంట్రాక్టర్లు $8.61(రూ.763.50)కే అందించనున్నారు. ఈ ధర వ్యత్యాసం కారణంగా, నేపాల్ సర్కారుకు తక్షణ ఏం చేయాలో తోచడం లేదు. అయితే ఒప్పందం ముగిసిన తర్వాత పాస్‌పోర్టులు కావాలంటే అధిక మొత్తాన్ని చెల్లించాలని, లేదా అవసరానికి మించి ఒక మిలియన్ పాస్‌పోర్ట్‌లను కొనుగోలు చేయాలని ఇడెమియా మెలికపెట్టింది. అయితే ఒక మిలియన్ పాస్‌పోర్ట్‌లను కొనుగోలు చేస్తే, కొత్త ఒప్పందం కంటే సుమారు $152,000(రూ.1,34,79,360) అదనపు భారం పడుతుంది. చౌకగా లభించే కొత్త కాంట్రాక్ట్ ఉన్నప్పుడు పాత కంపెనీకి ఎక్కువ ధర ఇవ్వడం లేదా అధిక సంఖ్యలో కొనడం వంటి చర్యలు అధికార దుర్వినియోగం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఇది దర్యాప్తు కమిషన్ (సీఐఏఏ) విచారణకు దారితీస్తుందనే భయం సంబంధిత అధికారుల్లో నెలకొంది.
అయినప్పటికీ పాస్‌పోర్ట్‌ల కొరతను నివారించేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ సమస్యకు వచ్చే వారం నాటికి చట్టబద్ధమైన రీతిలో పరిష్కారం కనుగొంటామని పాస్‌పోర్ట్ విభాగం డైరెక్టర్ జనరల్ హామీ ఇచ్చారు. అలాగే, కొత్త జర్మన్ కంపెనీలు ఒప్పందపు తేదీ అయిన మార్చి 9 కంటే ముందుగానే, అంటే ఫిబ్రవరి మధ్య నుంచే పాస్‌పోర్ట్‌లను అందించేలా చర్చలు జరిగాయన్నారు. ప్రస్తుతానికి అత్యవసరంగా విదేశాలకు వెళ్లాల్సిన వారికి, వైద్య చికిత్స కోసం వెళ్లేవారికి ప్రాధాన్యత ఇస్తూ పాస్‌పోర్ట్‌లను అందిస్తున్నారు. ఫిబ్రవరి మధ్య నుండి కొత్త పాస్‌పోర్ట్‌ల ముద్రణ క్రమం తప్పకుండా జరిగితే, కొరత సమస్య ఉండదని అధికారులు భరోసా ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘పొత్తు వద్దంటే చిత్తే’.. ‘ఇండియా కూటమికి’ మజ్లిస్ షాక్


