
చిన్న నిప్పురవ్వ చాలు... పెనుమంటలు ఎగిసిపడటానికి! ఒక్క కారణమే చాలు... అసంతృప్తి పెల్లుబుకటానికీ, అధికార పీఠాల్ని కూలదోయటానికీ!! ఆ మధ్య శ్రీలంకలో, మొన్న బంగ్లాదేశ్‌లో, నెల క్రితం ఇండోనేసియాలో రోడ్లపైకి వెల్లువలా వచ్చిపడిన యువత శక్తేమిటో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి గ్రహించలేకపోయారు. నిరసనంటే తెలియని, ఉద్యమమంటే ఎరుగని ‘జెన్ జీ’ తరాన్ని తక్కువ అంచనా వేశారు.
అందుకే అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలై 36 గంటలు కాకుండానే ఆయనకు పదవీ భ్రష్టత్వం తప్పలేదు. అధ్యక్షుడు రాంచంద్ర పౌడ్వాల్ సైతం రాజీనామా చేశారు. కానీ ఈలోగా హింస పెల్లుబికి పార్లమెంటుకు నిప్పంటుకుంది. అధ్యక్షుడు, ప్రధాని భవంతులు తగలడిపోయాయి. మంత్రుల నివాసాలూ, పార్లమెంటు ఉన్న సింఘా దర్బార్ ఆవరణ ఉద్యమకారుల లక్ష్యంగా మారింది.
మంత్రుల్ని రక్షించటానికి ఆర్మీ హెలికాప్టర్లు రంగ ప్రవేశం చేయాల్సివచ్చింది. మాజీ ప్రధాని, పాలకపక్షంలో భాగస్వామిగా ఉన్న నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్‌బా, ఆయన భార్య విదేశాంగమంత్రి అర్జూరమా దేవ్‌బా, నేపాల్ మావోయిస్టు పార్టీ నేత, మాజీ ప్రధాని ప్రచండ తదితరుల ఇళ్లపై దాడులు చేయగా, దేవ్‌బా దంపతులపై దౌర్జన్యం చేసి, నెత్తురోడుతున్న దేవ్‌బాను ఈడ్చుకెళ్లారు. భద్రతా దళాల కాల్పుల్లో 19 మంది మరణించగా, దాదాపు 500 మంది గాయపడ్డారని చెబుతున్నారు.
చెప్పుకోదగిన నాయకుడు లేకున్నా సోమవారం ఉదయం వందల మందితో మొదలైన ఉద్యమం మధ్యాహ్నానికే వేలసంఖ్యకూ, అటు తర్వాత లక్షల్లోకి మారింది. దేశ రాజధాని కఠ్మాండూను దాటి జిల్లాలకు వ్యాపించింది. లాఠీచార్జి, బాష్పవాయు గోళాలు, రబ్బరు బుల్లెట్లు, చివరకు కాల్పులు ఫలితాన్నివ్వలేదు సరిగదా... ఆగ్రహించిన గుంపులు అధికార సౌధాలపై పడ్డాయి. హింసకు దిగొద్దన్న వినతులు బేఖాతరు కావటంతో ఉద్యమాన్ని విరమిస్తున్నామని నిర్వాహకులు ప్రకటించాల్సి వచ్చింది.
మొదట ఉద్యమం శాంతియుతంగా ప్రారంభమైంది. దానికి ప్రభుత్వమే ఆజ్యం పోసింది. సామాజిక మాధ్యమాల ద్వారా పిలుపందుకుని వస్తున్న విద్యార్థులు, యువతతో ఆ ప్రాంతం నిండుతుండగానే ప్రభుత్వం యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర 26 వెబ్ సైట్లను నిలిపివేసింది. ఆ మాధ్యమాలు పన్నులు చెల్లించకపోవటం వల్లే నిలిపేశామని సంజాయిషీ ఇచ్చినా నిజమేమిటో అందరికీ తెలుసు.
కనబడే కారణం మాధ్యమాల నిషేధమే అయినా అక్కడ నెలకొన్న ఆర్థిక సంక్షోభం అసలు హేతువు. సగటున రోజుకు రెండు వేలమంది పొట్టనింపుకోవటానికి దూర తీరాలకు వలసపోయే దుఃస్థితి నెలకొంది. దీన్ని సరిచేయకపోగా ప్రాజెక్టులన్నీ అవినీతి మయంగా మారాయి. సంపన్నుల పిల్లలు విదేశాల సందర్శనకు పోయి విలాసాల్లో గడుపుతూ సామాజిక మాధ్యమాల్లో ఆ దృశ్యాలు షేర్ చేయటం సహజంగానే నిరుద్యోగంతో దుర్భర జీవనం సాగిస్తున్న యువతలో ఆగ్రహాన్ని కలిగించింది.
ఇందుకు ప్రస్తుత పాలక పక్షంలోని సీపీఎన్(యూఎంఎల్), నేపాలీ కాంగ్రెస్‌లతోపాటు అరకొర సీట్లతో కింగ్‌మేకర్‌గా మిగిలిపోయిన మావోయిస్టు పార్టీ సైతం సిగ్గుపడాలి. శ్రీలంకలో మూడేళ్ల క్రితం, నిరుడు బంగ్లాదేశ్‌లో, నేడు నేపాల్‌లో ఒకే మాదిరి దృశ్యాలు కనిపించటం యాదృచ్ఛికం కాదు. ఈ మూడు ఉద్యమాలూ యువత, విద్యార్థుల నాయకత్వంలోనే జరిగాయి.
మూడింటి మధ్యా కనబడే మరో పోలిక ఏమంటే... వీటికి చైనాయే అధిక వడ్డీలకు అప్పులిచ్చి ఆర్థికంగా కుంగదీసింది. ఉదాహరణకు నేపాల్ పౌర విమానయాన మౌలిక సదుపాయాల మెరుగు కోసమంటూ తలపెట్టిన పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయానికి చైనా ప్రధాన రుణదాత. 2,200 కోట్ల డాలర్ల ఈ ప్రాజెక్టు రెండేళ్ల క్రితం సాకారమైంది. కానీ అది వృథా వ్యయమని కొన్నాళ్లకే తేలిపోయింది.
అందులో 10.5 కోట్ల డాలర్లకు పైగా అవినీతి జరిగిందని నిర్ధారణ అయింది. ఆ రుణాన్ని రీషెడ్యూల్ చేయాలని నేపాల్ కోరుతున్నా చైనా ససేమిరా అంటోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్(బీఆర్‌ఐ) ప్రాజెక్టు కూడా కష్టాల్లో పడింది. సరిగ్గా ఆగ్రహ జ్వాలల్లో నేపాల్ మండుతుండగా ఓలి శర్మ చైనా పర్యటన ముగించుకుని రావటం గమనించదగ్గది.