
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల బ్రిటన్ పర్యటన గురువారం పూర్తయింది. ఇరు దేశాల మధ్యా సుదీర్ఘకాలంగా ఎంతో గాఢమైన అనుబంధం ఉన్నదని, ట్రంప్ హయాంలో అది మరింత విస్తరించిందని ఉమ్మడి మీడియా సమావేశంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కొనియాడారు. అది నిజమే. ఎందుకంటే వేరేచోట పెట్టుబడులు పెట్టొద్దని తమ దిగ్గజ సంస్థల్ని డిమాండు చేస్తున్న ట్రంప్ బ్రిటన్‌లో దాదాపు 15,000 కోట్ల పౌండ్ల విలువైన పెట్టుబడులకు సిద్ధపడ్డారు.
ఇందుకు సంబంధించిన ఒప్పందా లపై ఇరు దేశాల మధ్యా సంతకాలయ్యాయి. అలాగే రక్షణ సాంకేతిక ఒప్పందం కూడా కుదిరింది. బ్రిటన్ తన డిమాండ్లన్నిటికీ తలొగ్గి అందరి కన్నా ముందు మొన్న ఫిబ్రవరి లోనే వాణిజ్యం ఒప్పందానికి సై అనటం, మరో మూడు నెలల్లో ఒప్పందాన్ని ఖరారు చేసుకోవటం ట్రంప్‌కు నచ్చింది. దానికితోడు ప్రధాని కీర్ స్టార్మర్ అమెరికా వెళ్లినప్పుడు అధికారిక పర్యటనకు రావాలంటూ బ్రిటన్ రాజు చార్లెస్... స్టార్మర్ ద్వారా ఆహ్వానం పంపటం ఆయన్ను మరింత ఉక్కిరిబిక్కిరి చేసివుంటుంది.
ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిని రాజసౌధం రెండోసారి అధికారిక పర్యటనకు ఆహ్వానించటం, ఘనమైన విందునీ యటం ఇదే తొలిసారి. గత ఏలుబడిలో ట్రంప్ 2019లో బ్రిటన్‌లో అధికారిక పర్యటన జరిపారు. జార్జి డబ్ల్యూ బుష్, ఒబామాలకు ఆ అదృష్టం మొదటి దఫాలో మాత్రమే దక్కింది. రెండోసారి నాటి బ్రిటిష్ రాణి నుంచి విందు ఆహ్వానాలు మాత్రమే అందాయి.
కానీ ట్రంప్ షరతులన్నిటికీ తలొగ్గటం ద్వారా బ్రిటన్ ప్రయోజనాలను స్టార్మర్ దెబ్బతీశారని జనం ఆగ్రహించారు. వాణిజ్య ఒప్పందంలో అమెరికా సరుకులపై 10 శాతం మించి సుంకాలు విధించబోమని ఒప్పుకుని, తమ దేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే స్టీల్, అల్యూమినియంలపై మాత్రం 25 శాతం సుంకాలు విధించినా మౌనంగా ఉండిపోయారని ఆ విమర్శల సారాంశం. దీన్ని పునఃపరిశీలించాలని బ్రిటన్ కోరినా ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పటం తప్ప 25 శాతం సుంకాలపై ట్రంప్ మరే హామీ ఇవ్వలేదు.
బహుశా ఆయన దృష్టిలో ఆదుకోవటమంటే 15,000 కోట్ల పౌండ్ల పెట్టుబడులు పెట్టడం కావొచ్చు. వీటి ద్వారా దేశంలో 7,600 ఉద్యోగాలు వస్తాయని బ్రిటన్ ఆశిస్తోంది. ఇరు దేశాలకూ అనేక అంశాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. నాటో, ఉక్రెయిన్, పశ్చిమాసియా, చైనా తదితర అంశాల్లో రెండు దేశాలకూ ఏకీభావం ఉన్నా విభేదాలు కూడా ఉన్నాయి. లోగడ స్టార్మర్ ప్రకటించిన ప్రకారం వచ్చేవారం పాలస్తీనాను బ్రిటన్ గుర్తించాల్సి ఉంది.
ఆ పనిచేస్తే హమాస్ ఉగ్రవాదానికి మద్దతు పలికినట్టే అవుతుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఇటీవల హెచ్చరించారు. ట్రంప్ పర్యటనలో కూడా దీనిపై ఇరు దేశాధినేతల మధ్యా చర్చ జరిగింది. ఈ విషయంలో విభేదాలున్నాయని ఇద్దరూ అంగీకరించారు. బ్రిటన్ తాజా నిర్ణయమేమి టన్నది చూడాల్సి ఉంది.
రెండు దేశాలూ ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించేవి. ప్రపంచ సమస్యల పరిష్కార బాధ్యత భారం తమదేనని భావించేవి. కనీసం అలా చెప్పుకొనేవి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అవి సమష్టిగా పనిచేశాయి. ధిక్కరించిన దేశాలపై నాటో మాటున దాడులు కూడా చేశాయి. ప్రపంచంలోనే చైనా రెండో శక్తిమంతమైన ఆర్థిక శక్తిగా ఎదిగాక పరిస్థితి తలకిందులైంది. పశ్చిమాసియా మొదలుకొని ప్రపంచమంతటా ఎటుచూసినా విధ్వంసం, నిరాశా నిస్పృహలు ఆవరించాయి.
యుద్ధాలు, వాణిజ్య యుద్ధాలు, వలసదా రులపై ఆంక్షలు, ప్రజాస్వామ్య దేశాల్లో నియంతల హవా తదితరాలు వర్తమాన దుఃస్థితికి అద్దం పడుతున్నాయి. సమస్యలొస్తే ఇప్పుడెవరూ అమెరికా, బ్రిటన్‌ల వైపు చూడటం లేదు. అవి చక్కదిద్దుతాయన్న భ్రమలేవీ లేకపోగా... చాలా సమస్యలకు అమె రికా కారణమైతే, బ్రిటన్ వైఖరి కూడా అందుకు దోహదపడుతోందన్న అభిప్రాయమే అనేకుల్లో ఉంది. పైగా నిలకడ లేని ట్రంప్‌కు విశ్వసనీయత తక్కువ.
భారత్ తమకు అత్యంత సన్నిహితమని, ప్రధాని మోదీ కావాల్సినవారనీ మీడియా సమావేశంలో చెప్పిన ట్రంప్... ఉక్రెయిన్ విషయంలో ఆ దేశంతో కఠినంగా ఉండక తప్పడంలేదని గొప్పగా చెప్పుకొన్నారు. ఇలా మాట్లాడేవారిని ఏ దేశ ప్రజలైనా విశ్వసిస్తారా? మొత్తానికి ట్రంప్ తాజా పర్యటన వల్ల బ్రిటన్‌కు లాభించేది అంతంత మాత్రమేనని చెప్పాలి.