
ఏ దేశానికైనా ప్రథమ ప్రాధాన్యం స్వీయ ప్రయోజనాలు. ఆ తర్వాతే మిగిలినవన్నీ. గాల్వాన్ ఘర్షణల తర్వాత గత అయిదేళ్లుగా భారత్, చైనాల మధ్య ఏర్పడిన వివాదాలు అనేకానేక చర్చల పరంపర తర్వాత కూడా అసంపూర్ణంగానే ఉండిపోయిన నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మన దేశంలో రెండురోజులు పర్యటించటం, ఇరు దేశాల మధ్యా ఏదో మేరకు సదవగాహన కుదరటం హర్షించదగ్గ పరిణామం.
ఆయన ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అంతకు ముందు విదేశాంగ మంత్రి జైశంకర్‌తో చర్చలు జరిపారు. ఇరుగు పొరుగు అన్నాక సమస్యలు ఉంటాయి. ఒకటి రెండు పర్యటనలతోనో, రెండు మూడు దఫాల చర్చల్లోనో అవి పరిష్కారం కావాలంటే సాధ్యం కాకపోవచ్చు. అందుకు ఎంతో ఓరిమి, తమ వైఖరిపై అవతలి పక్షాన్ని ఒప్పించే నేర్పు అవసరం. దీర్ఘకాలం ఆ వివాదాలను కొనసాగనిస్తే మూడో దేశం తనకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది.
నిరుడు అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అప్పటికి నాలుగేళ్ల తర్వాత తొలిసారి కలుసుకున్నారు. ఇరు దేశాల సంబంధాలనూ సాధారణ స్థితికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే మొన్న జూన్‌లో కైలాస– మానససరోవర్ యాత్రకు భక్తులను అనుమతించేందుకు చైనా అంగీకరించింది.
భారత్ సందర్శించే చైనా యాత్రికులకు మన దేశం పర్యాటక వీసాలు పునరుద్ధరించింది. ఈనెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలోని తియాన్‌జిన్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో వాంగ్ యీ వచ్చారు. ఆ సదస్సుకు మోదీ హాజరుకావాలంటే సుహృద్భావ సంబంధాలు అవసరమని కూడా చైనా భావించింది.
ప్రధాని ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశానికి హాజరైతే ఆయన ఏడేళ్ల అనంతరం చైనా సందర్శించి నట్టవుతుంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సైనికుల మధ్యా జరిగిన ఘర్షణల తర్వాత సైనికాధికారుల స్థాయిలో చాలా దఫాలు చర్చలు సాగాయి. అయినా సరిహద్దుల్లో ఏప్రిల్ 2020కి ముందున్న పరిస్థితులు ఏర్పడలేదు. ఆఖరికి కజాన్‌లో మోదీ–షీల మధ్య సమావేశం తర్వాత కూడా గత పది నెలల్లో చెప్పుకోదగ్గ ప్రగతి లేదు.
వాంగ్ యీ పర్యటన సందర్భంగా ఇరుదేశాలూ 12 అంశాల్లో కీలక నిర్ణయాలు తీసు కున్నాయి. రెండు దేశాల మధ్యా విమాన రాకపోకలను పునరుద్ధరించుకోవాలనీ, వివాదాస్పద సరిహద్దు సమస్యపై చర్చించేందుకు మూడు వేర్వేరు బృందాలు ఏర్పాటు చేసుకోవాలనీ తీర్మా నించాయి. సరిహద్దు విషయంలో ఇప్పుడు పనిచేస్తున్న బృందంతో పాటు తూర్పు, మధ్య సెక్టార్లకు సంబంధించి వేర్వేరు బృందాలు ఏర్పడితే త్వరితగతిన పరిష్కారం సాధించవచ్చని ఇరు దేశాల విదేశాంగమంత్రులూ భావించారు.
అలాగే వాణిజ్యాన్ని పెంచుకోవటానికి సరి హద్దుల్ని మళ్లీ తెరవాలని నిర్ణయించారు. లిపూలేఖ్ పాస్, షిప్కి లా పాస్, నాథూ లా పాస్‌ల గుండా ఈ వాణిజ్యం సాగుతుంది. అలాగే పరస్పరం పెట్టుబడుల ప్రవాహానికి కూడా అనుమ తిస్తారు. అన్నిటికన్నా ముఖ్యం – అరుదైన ఖనిజాల ఎగుమతులకు చైనా అంగీకరించటం. స్మార్ట్ ఫోన్‌ల నుంచి ఫైటర్‌జెట్ల వరకూ, విండ్ టర్బైన్‌ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకూ ఉత్పాదన ప్రక్రియలో ఈ అరుదైన ఖనిజాలు అత్యవసరం.
ఇవి ప్రపంచంలో 99 శాతం చైనాలోనే లభ్యమవుతాయి. వీటితోపాటు ఎరువుల ఎగుమతులపై లోగడ విధించిన నిషేధాన్ని తొలగించ టానికి చైనా అంగీకరించటం ఈ పర్యటనలో ప్రధానాంశం. మన రైతులు ఎక్కువగా మొగ్గు చూపే డీఏపీ ఎరువులు చైనాలో ఉత్పత్తవుతాయి. రెండుచోట్లా ప్రవహించే నదీజలాలపై డేటాను ఇచ్చిపుచ్చుకోవటానికి భారత్, చైనా అంగీకరించాయి. త్రీగోర్జెస్ డ్యామ్‌ను మించిన స్థాయిలో బ్రహ్మపుత్ర నదిపై 16,000 కోట్ల డాలర్ల వ్యయంతో భారీ ఆనకట్ట నిర్మించాలని చైనా తలపెట్టిన నేపథ్యంలో నదీ జలాల డేటాపై అంగీకారం కుదరటం హర్షించదగ్గది.
చర్చల తర్వాత తాజా ప్రపంచ పరిణామాలపై వాంగ్ యీ విడుదల చేసిన ప్రకటనలో పరోక్షంగా అమెరికా వ్యవహారశైలిపై విమర్శలుండటం గమనార్హం. స్వేచ్ఛా వాణిజ్యాన్నీ, అంతర్జాతీయ సంబంధాలనూ భగ్నం చేసేలా కొందరు ఏకపక్షంగా బెదిరింపులకు దిగుతున్న పర్యవ సానంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన ప్రస్తావించారు.
ఆధిపత్య ధోరణులు ఏ రూపంలో ఉన్నా గట్టిగా ప్రతిఘటించటం చాలా అవసరం. ఏదేమైనా ఇరుదేశాలూ సాధ్యమైనంత త్వరగా సరిహద్దు సమస్యకు పరిష్కారం అన్వేషించగలిగితే, ఉగ్రవాదం అంతానికి చేతులు కలిపితే... ప్రధాని మోదీ చెప్పినట్టు అది రెండు దేశాల మధ్య మాత్రమే కాదు, ఆసియా ఖండంలోనే కాదు... యావత్ ప్రపంచశాంతికీ, సౌభాగ్యానికీ దోహదపడుతుంది. సాధ్యమైనంత త్వరగా అది సాకారం కావాలని ఆశించాలి.