breaking news
International Relations
-
ఏనుగుపై తొడగొట్టిన ఎలుక!
భారత్, అమెరికా దేశాల మధ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్న దశ అనూహ్యంగా మొదలైంది. ఏనుగు కుంభస్థలంపై ఎలుక పిల్ల ఓ మొట్టికాయ వేసిందట! రెండు దేశాలను ఉద్దేశించి ఓ ఆర్థిక నిపుణుడు చేసిన వ్యాఖ్యానం ఇది. అయితే ఇందులో ఏనుగెవరు? ఎలుకెవరు? గత పాతికేళ్లుగా డాలర్ డ్రీమ్స్‌ను పలవరిస్తూ వస్తున్న మన మిడిల్ క్లాస్ కుటుంబ రావులు ఈ ప్రశ్నకు ఠకీమని సమాధానం చెప్పగలరు. అపారమైన ఆర్థిక – సైనిక బలం, అగ్రరాజ్య హోదా ఉన్న అమెరికా ఎలుకెట్లా అవుతుంది? లక్షల సంఖ్యలో మన వంశోద్ధారకుల్ని కూడా ఉద్ధరిస్తున్న అమెరికా దేశం ఏనుగు కాకుండా ఎలుకవుతుందా అనే సందేహం వారికి ఉంటుంది. మరి నూటా నలభై కోట్ల జనాభా, అందులో 90 కోట్ల మంది యువత ఉన్న భారత దేశాన్ని కూడా ఎలుకతో పోల్చడం సాధ్యంకాదు కదా!వాణిజ్య ట్యారిఫ్లను ఆయుధాలుగా మార్చుకొని కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కవ్వింపు చర్యలకు పాల్పడటం, తదనంతర ప్రపంచ పరిణామాల నేపథ్యంలో రిచర్డ్ ఓల్ఫ్ అనే అమెరికన్ ఆర్థికవేత్త చేసిన విశ్లేషణ సంచలనంగా మారింది. భారతదేశంపై ట్రంప్ చేసిన 50 శాతం సుంకాల ‘యుద్ధ ప్రకటన’పై ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఈ వ్యాఖ్యానాన్ని విస్తారమైన అర్థంలో చేశార నుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా కలిగే దీని పర్యవసానాలను దృష్టిలో పెట్టుకొని ఏనుగుపై ఎలుక మొట్టికాయ వేసినట్టేనని అన్నారు. ప్రపంచ జనాభాలో నాలుగున్నర శాతం లేని దేశం 95 శాతం ప్రజలను ఆజ్ఞాపించాలని చూసే పెత్తందారీతనం బెడిసి కొడుతుందని ఆయన జోస్యం చెప్పారు.అమెరికా ట్యారిఫ్ కొరడా ప్రయోగం భారత్‌పై ప్రభావం చూపబోదని దాని అర్థం కాదు. తక్షణ ఫలితంగా భారత్ ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. మొత్తం అంత ర్జాతీయ వాణిజ్యంలో 90 బిలియన్ డాలర్ల పైచిలుకు లోటును భారత్ ఎదుర్కొంటున్నది. ఈ లోటులో సింహభాగం చైనా వాణిజ్యంలోనే! ‘మేకిన్ ఇండియా’ సత్ఫలితాలిస్తే తప్ప ఈ లోటును అధిగమించడం సాధ్యం కాదు. ఒక్క అమెరికా వాణిజ్యంలోనే భారత్ మిగులు భాగస్వామిగా ఉంటున్నది. అమెరికాకు 87 బిలియన్ డాలర్ల సరుకుల్ని ఎగుమతి చేస్తున్న మన దేశం అక్కడి నుంచి 45 బిలియన్ డాలర్ల కిమ్మత్తు చేసే సరుకుల్ని దిగుమతి చేసుకుంటున్నది. 50 శాతం ట్యారిఫ్ ప్రభావం 70 శాతం వ్యాపారంపై పడుతుందని, ఫలితంగా వెనువెంటనే 20 బిలియన్ డాలర్ల మేరకు నష్టపోతామని ఎగుమతిదార్ల సంస్థలు చెబుతున్నాయి. వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. తిరుపూర్, నోయిడా, సూరత్ వంటి పట్టణాల్లో అప్పుడే ఉద్యోగాల కోత, ఫ్యాక్టరీల మూత మొదలైంది.అమెరికా కొరడా ఝుళిపిస్తుంటే భారత్ చేతులు ముడుచు కొని కూర్చుంటుందా? కూర్చోలేదు కూడా! ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటివరకూ భారత నాయకత్వం పరిణతితో, ప్రాప్తకాలజ్ఞతతో వ్యవహరించిందనే చెప్పాలి. భారత్ – పాక్‌ల మధ్య ఏర్పడిన తీవ్ర ఉద్రిక్తతల సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. యుద్ధం మొదలుకావడం, రెండు రోజుల్లోనే పాక్‌ను భారత్ దారుణంగా దెబ్బతీయడం, ఆ వెనువెంటనే కాల్పుల విరమణ ప్రకటన రావడం జరిగింది. భారత్ – పాక్‌లు ప్రకటించకముందే తన వల్లనే యుద్ధం ఆగిపోయిందని ట్రంప్ ప్రకటించుకున్నారు. దీన్ని భారత్ అధికారికంగా ఖండించ లేదు. ట్రంప్‌కు మోదీ భయపడ్డారని, ఆయన ఆదేశించగానే కాల్పుల విరమణ అమలు చేశారనే ప్రచారం జరిగింది. చాలా మంది నమ్మారు. తదనంతర పరిణామాలను గమనిస్తే అప్పటి అభిప్రాయం కేవలం అపోహ మాత్రమే కావచ్చనిపిస్తున్నది. గతంలో విధించిన 25 శాతం ట్యారిఫ్‌కు అదనంగా మరో 25 శాతం విధించడానికి కారణం తాము ఆంక్షలు విధించిన రష్యా నుంచి భారీఎత్తున చమురు కొనుగోలు చేయడమేనని ఇప్పుడు అమెరికా చెబుతున్నది. అసలు కారణం అది కాదన్న సంగతి అందరికీ తెలుసు.అమెరికాలోని వ్యవసాయ, పాల ఉత్పత్తి రంగాలను చిరకాలంగా భారత మార్కెట్ ఊరిస్తున్నది. అవి భారత్‌లో ప్రవేశించగలిగితే ఇబ్బడిముబ్బడిగా అమెరికా విత్తన కంపెనీలు, పాల ఉత్పత్తుల కంపెనీలు లాభాలు పోగేసుకోగలుగుతాయి. జన్యుమార్పిడి పంటలైన సోయాబీన్, మొక్కజొన్నలను దిగు మతి చేసుకోవాలని అమెరికా భారత్‌ను డిమాండ్ చేస్తున్నది. వ్యవసాయ రంగాన్ని పరాధీనం చేయగలిగే జీఎమ్ పంటలను ఒక విధానంగా భారత ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. అట్లానే పాల ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని అమెరికా షరతు పెట్టింది. ఈ షరతు అంగీకరిస్తే దేశవాళీ పాడి పరిశ్రమ లక్ష కోట్లకు పైగా నష్టపోతుందని ఒక అంచనా. పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న దేశం పాల ఉత్పత్తులను చౌక సుంకాలకు దిగుమతి చేసుకోవడం ఏమిటి? ఇప్పటికీ 40 శాతం మంది ప్రజలు వ్యవసాయ ఆధారిత రంగాలపై ఆధారపడిన దేశం విషతుల్యమైన జీఎమ్ పంటలను దిగుమతి చేసుకో వలసిన అవసరమేమిటి? ట్రంప్ సర్కార్ కోరిన ఈ హిరణ్యాక్ష వరాలకు భారత్ తలాడించలేదు.ఆయన నోబెల్ బహుమతి పిచ్చికి భారత ప్రభుత్వం సహకరించలేదన్న దుగ్ధ కూడా అమెరికా అధ్యక్షుడిని వేధిస్తున్న దట! ట్రంప్ మధ్యవర్తిత్వం వల్లనే కాల్పుల విరమణకు ఒప్పు కున్నామని భారత్ ఒక మాట అధికారికంగా చెబితే తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కుతుందని ట్రంప్ ఆశ. భారత్ – పాక్ వ్యవహారాల్లో మూడో దేశం జోక్యాన్ని చాలాకాలంగా భారత్ అంగీరించడం లేదు. ఒక దేశాధినేత నోబెల్ పిచ్చిని తీర్చడం కోసం తన దేశ సార్వభౌమాధికారంతో రాజీపడడానికి భారత్ అంగీకరించలేదు. ఇటువంటి రాజీ పట్ల పాక్‌కు ఎటు వంటి అభ్యంతరమూ లేదు. ట్రంప్ కోరుకుంటున్న ప్రకటనను పాక్ మిలిటరీ చీఫ్ అసీఫ్ మునీర్ చేశారు. దాంతో మునీర్‌ను పొగడ్తల్లో ముంచడమే గాక ఆయన్ను వైట్‌హౌస్‌లో భోజనానికి ప్రత్యేకంగా ట్రంప్ ఆహ్వానించారు.ఏకధ్రువ ప్రపంచం నుండి బహుధ్రువ ప్రపంచం వైపు మానవాళి అడుగులు వేస్తున్న కీలకమైన మలుపులో భారతదేశం తన ప్రయోజనాల కోసం అనుసరించవలసిన విదేశీ విధానంపై కేంద్ర సర్కార్‌కు ఇప్పటికే ఒక స్పష్టత ఉన్నది. అంతర్జాతీయ సంబంధాల్లో సిద్ధాంతాల పాత్ర ప్రచ్ఛన్న యుద్ధంతోపాటే కరిగిపోయింది. భౌగోళిక రాజకీయ అవరోధాలున్న సందర్భా ల్లోనూ ఉభయతారకంగా నెగ్గుకురావడానికి అవసరమైన వ్యూహాలకు మన విదేశాంగ విధానం పెద్దపీట వేస్తున్నది. విదేశాంగ మంత్రిగా ఉన్న జైశంకర్ దీర్ఘకాలం పాటు దౌత్యవేత్తగా పనిచేశారు. ఆ అనుభవ సారాన్ని రంగరించి, ప్రభుత్వ ఆలోచనల్ని కూడా కలబోసి ‘ది ఇండియా వే’ (భారత్ మార్గం : అనిశ్చిత ప్రపంచంలో అనుసరణీయ వ్యూహాలు) అనే పుస్తకాన్ని రాశారు. మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో అనుసరించదగిన వ్యూహాలపై అందులో చర్చించారు. భారత విదేశాంగ విధానం ఇప్పుడీ తాజా పంథాలోనే కొనసాగు తున్నట్టు కనిపిస్తున్నది.ఇంకెంతోకాలం అగ్రరాజ్యంగా అమెరికా మనలేదని, డాలర్ పెత్తనానికి కూడా రోజులు దగ్గరపడినట్టేనని పలువురు ఆర్థిక నిపుణులు జోస్యం చెబుతున్నారు. ట్రంప్ చర్యలు ఈ పరిణామాన్ని వేగవంతం చేయగలవని అంచనా వేస్తున్నారు. అమెరికా నాయకత్వంలోని ‘జీ–7’ దేశాల పాశ్చాత్య కూటమిని ఆర్థిక రంగంలో ‘బ్రిక్స్’ దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) ఇప్పటికే అధిగమించడాన్ని ఇందుకు రుజువుగా వారు చూపెడుతున్నారు. వచ్చే ఏడాది ‘బ్రిక్స్’ కూటమికి భారత్ నాయకత్వం వహించబోతున్నది. భౌగోళిక రాజకీయాలతోపాటు పలు అంశాలపై వైరుద్ధ్యాలున్న రెండు అతిపెద్ద దేశాలను (భారత్ – చైనా) వ్యూహాత్మక స్నేహం వైపు నడిపించిన ఘనత ట్రంప్‌దేనని అమెరికన్ నిపుణులే విమర్శి స్తున్నారు. ఇండో – పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తర ణను అడ్డుకోవడానికి అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా లతో కలిసి ఏర్పడిన ‘క్వాడ్’ కూటమి తాజా పరిణామాలతో నిర్వీర్యమైనట్టే! గల్వాన్ ఘర్షణ అనంతరం రెండు దేశాల మధ్యన ఏర్పడిన ఉద్రిక్తతలను ఉపశమింపజేయడానికి అవసరమైన కొన్ని చర్య లను రెండు దేశాలూ ఇప్పటికే తీసుకోవడం ఆరంభించాయి. మన విదేశాంగ మంత్రి జైశంకర్ జిన్‌పింగ్‌ను కలిశారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఢిల్లీకి వచ్చి మంతనాలు జరి పారు. భారత యాత్రికుల కోసం మానస సరోవరం మార్గాన్ని చైనా తెరిచింది. చైనాకు విమానయానాలను భారత్ పునరు ద్ధరించింది. చైనాలోని తియాంజిన్‌లో ప్రారంభమైన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. శనివారం నాడాయనకు చైనాలో ఆత్మీయ స్వాగతం లభించింది. భారతదేశపు శాస్త్రీయ సంగీత నృత్యా లతో చైనా యువతీ యువకులు ఆయన్ను అలరించారు. అమె రికా పెత్తందారీతనానికి వ్యతిరేక వేదికను ఈ సదస్సు బలో పేతం చేసే అవకాశం ఉన్నది.ఆదివారం నాడు చైనా అధ్యక్షుడు షీ–జిన్‌పింగ్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ద్వైపాక్షిక సమస్యలు, సంబంధాలపై వారి మధ్య చర్చలు జరగవచ్చు. ఎస్సీఓ శిఖ రాగ్ర సభకు అమెరికా బద్ధ శత్రువైన రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా హాజరవు తున్నారు. ఈ నేతలతో కూడా మోదీ చర్చలు జరిపే అవకాశం ఉన్నది. రష్యాతో మనది చెక్కుచెదరని దశాబ్దాల స్నేహబంధం. ఇరాన్‌తో మనకున్న అనుబంధానికి శతాబ్దాల చరిత్ర ఉన్నది. ట్రంప్ ట్యారిఫ్ల నేపథ్యంలో భారత్ కొత్త మార్కెట్లకు విస్తరించడం కోసం అందివచ్చిన వేదికలన్నిటినీ ఉపయోగించుకుంటుంది. ఈ ప్రయాణంలో భారత్ వైఖరి వేగిర పడిన చందంగా కాకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. ఎస్సీఓ సమావేశం ముగిసిన తర్వాత బుధవారం నాడు బీజింగ్‌లో మరో భారీ ర్యాలీని చైనా నిర్వహిస్తున్నది. రెండో ప్రపంచ యుద్ధంలో సామ్రాజ్యవాద శక్తులను (ముఖ్యంగా జపాన్ సామ్రాజ్యవాదం) ఓడించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చైనా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నది. ఎస్సీఓ సభకు హాజరయ్యే దేశాలన్నీ ఈ ర్యాలీకి హాజరవుతున్నా భారత్ మాత్రం జపాన్ పట్ల స్నేహభావంతో హాజరు కావడం లేదు. పైగా తియాంజిన్ సదస్సుకు ముందు రెండు రోజులపాటు ప్రధాని మోదీ జపాన్‌లో పర్యటించారు. రెండు దేశాల మధ్య టెక్నాలజీ రంగంలో పలు ఒప్పందాలు కుదిరాయి. జపాన్ కూడా భారత ప్రధానికి ఘనమైన స్వాగతాన్నే ఏర్పాటు చేసింది. జపనీయులు గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ ఆయనకు ఆహ్వానం పలికి ఆకట్టుకున్నారు.ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి, ఒక అభివృద్ధి చెందిన దేశం హోదా వైపు అడుగులు వేయడానికి ఆచరణా త్మకమైన, వివేకవంతమైన విదేశాంగ విధానం ఒక్కటే సరి పోతుందా? దేశీయంగా అందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామా? అనే విషయాలను సమీక్షించుకోవలసిన సమయమిది. జీఎస్టీ శ్లాబుల కుదింపు, స్వదేశీ వాడకం ఉద్యమానికి ప్రధాని పిలుపు నివ్వడం ట్రంప్ ట్యారిఫ్ల నేపథ్యంలో తీసుకున్న చర్యలే కావచ్చు. వాటివల్లనే స్వదేశీ మార్కెట్ బలపడుతుందా? మన దేశ ప్రజల కొనుగోలు శక్తి బలంగా ఉంటే అమెరికా, ఐరోపా దేశాల ఉమ్మడి బలంతో సమానంగా ఉంటుంది. అటువంటి వ్యవస్థను సృష్టించుకోగలగడమే చైనా విజయ రహస్యంగా ఆర్థికవేత్తలు చెబుతున్నారు. చైనా ఆర్థికాభివృద్ధి పంథా ఒక హైబ్రిడ్ మోడల్. అది పూర్తిస్థాయి పెట్టుబడిదారీ విధానం కాదు. సోషలిస్టు విధానమూ కాదు. ప్రభుత్వ నియంత్రణకు లోబడిన పెట్టుబడి పూర్తి లాభాపేక్షతో కాకుండా సామాజిక వృద్ధికి కట్టుబడి ఉంటుంది. ఈ ఆర్థిక విధానం ఫలితంగా కోట్లాది మంది పేదరికం సంకెళ్ళను తెంచుకొని ఒక బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోగలిగారు. మనం మాత్రం సమాజంలో తీవ్ర అసమానతలకూ,పేదరికానికీ ఒక ముఖ్య కారణ మైన ప్రైవేటీకరణ బాట వెంటనే ఇంకా పరుగులు తీస్తున్నాము. ఈ బాట ఇంకెంతమాత్రమూ పేదరికాన్ని నిర్మూలించలేదనీ, అసమానతల్ని పోగొట్టలేదనీ ఇప్పటికే రుజువైంది. దేశీయంగా బలమైన మార్కెట్‌ను నిర్మించుకోగలిగినప్పుడే రాచవీధిలో పట్టపుటేనుగు నడిచినంత ఠీవిగా అంతర్జాతీయ సంబంధాల్లో నడవగలం. ఎలుకల మొట్టికాయలు అప్పుడు ఏమీ చేయలేవు!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మళ్లీ చివురించిన చెలిమి
ఏ దేశానికైనా ప్రథమ ప్రాధాన్యం స్వీయ ప్రయోజనాలు. ఆ తర్వాతే మిగిలినవన్నీ. గాల్వాన్ ఘర్షణల తర్వాత గత అయిదేళ్లుగా భారత్, చైనాల మధ్య ఏర్పడిన వివాదాలు అనేకానేక చర్చల పరంపర తర్వాత కూడా అసంపూర్ణంగానే ఉండిపోయిన నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మన దేశంలో రెండురోజులు పర్యటించటం, ఇరు దేశాల మధ్యా ఏదో మేరకు సదవగాహన కుదరటం హర్షించదగ్గ పరిణామం. ఆయన ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అంతకు ముందు విదేశాంగ మంత్రి జైశంకర్‌తో చర్చలు జరిపారు. ఇరుగు పొరుగు అన్నాక సమస్యలు ఉంటాయి. ఒకటి రెండు పర్యటనలతోనో, రెండు మూడు దఫాల చర్చల్లోనో అవి పరిష్కారం కావాలంటే సాధ్యం కాకపోవచ్చు. అందుకు ఎంతో ఓరిమి, తమ వైఖరిపై అవతలి పక్షాన్ని ఒప్పించే నేర్పు అవసరం. దీర్ఘకాలం ఆ వివాదాలను కొనసాగనిస్తే మూడో దేశం తనకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. నిరుడు అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అప్పటికి నాలుగేళ్ల తర్వాత తొలిసారి కలుసుకున్నారు. ఇరు దేశాల సంబంధాలనూ సాధారణ స్థితికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే మొన్న జూన్‌లో కైలాస– మానససరోవర్ యాత్రకు భక్తులను అనుమతించేందుకు చైనా అంగీకరించింది. భారత్ సందర్శించే చైనా యాత్రికులకు మన దేశం పర్యాటక వీసాలు పునరుద్ధరించింది. ఈనెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలోని తియాన్జిన్లో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో వాంగ్ యీ వచ్చారు. ఆ సదస్సుకు మోదీ హాజరుకావాలంటే సుహృద్భావ సంబంధాలు అవసరమని కూడా చైనా భావించింది. ప్రధాని ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి హాజరైతే ఆయన ఏడేళ్ల అనంతరం చైనా సందర్శించి నట్టవుతుంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సైనికుల మధ్యా జరిగిన ఘర్షణల తర్వాత సైనికాధికారుల స్థాయిలో చాలా దఫాలు చర్చలు సాగాయి. అయినా సరిహద్దుల్లో ఏప్రిల్ 2020కి ముందున్న పరిస్థితులు ఏర్పడలేదు. ఆఖరికి కజాన్‌లో మోదీ–షీల మధ్య సమావేశం తర్వాత కూడా గత పది నెలల్లో చెప్పుకోదగ్గ ప్రగతి లేదు. వాంగ్ యీ పర్యటన సందర్భంగా ఇరుదేశాలూ 12 అంశాల్లో కీలక నిర్ణయాలు తీసు కున్నాయి. రెండు దేశాల మధ్యా విమాన రాకపోకలను పునరుద్ధరించుకోవాలనీ, వివాదాస్పద సరిహద్దు సమస్యపై చర్చించేందుకు మూడు వేర్వేరు బృందాలు ఏర్పాటు చేసుకోవాలనీ తీర్మా నించాయి. సరిహద్దు విషయంలో ఇప్పుడు పనిచేస్తున్న బృందంతో పాటు తూర్పు, మధ్య సెక్టార్లకు సంబంధించి వేర్వేరు బృందాలు ఏర్పడితే త్వరితగతిన పరిష్కారం సాధించవచ్చని ఇరు దేశాల విదేశాంగమంత్రులూ భావించారు. అలాగే వాణిజ్యాన్ని పెంచుకోవటానికి సరి హద్దుల్ని మళ్లీ తెరవాలని నిర్ణయించారు. లిపూలేఖ్ పాస్, షిప్కి లా పాస్, నాథూ లా పాస్‌ల గుండా ఈ వాణిజ్యం సాగుతుంది. అలాగే పరస్పరం పెట్టుబడుల ప్రవాహానికి కూడా అనుమ తిస్తారు. అన్నిటికన్నా ముఖ్యం – అరుదైన ఖనిజాల ఎగుమతులకు చైనా అంగీకరించటం. స్మార్ట్ ఫోన్ల నుంచి ఫైటర్జెట్ల వరకూ, విండ్ టర్బైన్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకూ ఉత్పాదన ప్రక్రియలో ఈ అరుదైన ఖనిజాలు అత్యవసరం. ఇవి ప్రపంచంలో 99 శాతం చైనాలోనే లభ్యమవుతాయి. వీటితోపాటు ఎరువుల ఎగుమతులపై లోగడ విధించిన నిషేధాన్ని తొలగించ టానికి చైనా అంగీకరించటం ఈ పర్యటనలో ప్రధానాంశం. మన రైతులు ఎక్కువగా మొగ్గు చూపే డీఏపీ ఎరువులు చైనాలో ఉత్పత్తవుతాయి. రెండుచోట్లా ప్రవహించే నదీజలాలపై డేటాను ఇచ్చిపుచ్చుకోవటానికి భారత్, చైనా అంగీకరించాయి. త్రీగోర్జెస్ డ్యామ్‌ను మించిన స్థాయిలో బ్రహ్మపుత్ర నదిపై 16,000 కోట్ల డాలర్ల వ్యయంతో భారీ ఆనకట్ట నిర్మించాలని చైనా తలపెట్టిన నేపథ్యంలో నదీ జలాల డేటాపై అంగీకారం కుదరటం హర్షించదగ్గది.చర్చల తర్వాత తాజా ప్రపంచ పరిణామాలపై వాంగ్ యీ విడుదల చేసిన ప్రకటనలో పరోక్షంగా అమెరికా వ్యవహారశైలిపై విమర్శలుండటం గమనార్హం. స్వేచ్ఛా వాణిజ్యాన్నీ, అంతర్జాతీయ సంబంధాలనూ భగ్నం చేసేలా కొందరు ఏకపక్షంగా బెదిరింపులకు దిగుతున్న పర్యవ సానంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన ప్రస్తావించారు. ఆధిపత్య ధోరణులు ఏ రూపంలో ఉన్నా గట్టిగా ప్రతిఘటించటం చాలా అవసరం. ఏదేమైనా ఇరుదేశాలూ సాధ్యమైనంత త్వరగా సరిహద్దు సమస్యకు పరిష్కారం అన్వేషించగలిగితే, ఉగ్రవాదం అంతానికి చేతులు కలిపితే... ప్రధాని మోదీ చెప్పినట్టు అది రెండు దేశాల మధ్య మాత్రమే కాదు, ఆసియా ఖండంలోనే కాదు... యావత్ ప్రపంచశాంతికీ, సౌభాగ్యానికీ దోహదపడుతుంది. సాధ్యమైనంత త్వరగా అది సాకారం కావాలని ఆశించాలి. -
హిజాబ్ వ్యవహారం మా అంతర్గతం: భారత్
న్యూఢిల్లీ: స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్‌ను నిషేధించడం మత స్వేచ్ఛను కాలరాయడమేనంటూ అంతర్జాతీయ మత స్వేచ్ఛ(ఐఆర్ఎఫ్) సంఘంలో అమెరికా ప్రతినిధి రషద్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ అసహనం వ్యక్తం చేసింది. తమ అంతర్గత వ్యవహారాలపై రెచ్చగొట్టేలా మాట్లాడడం మానుకోవాలంది. దీనిపై కొన్ని దేశాలు చేసిన విమర్శలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ శనివారం తిప్పికొట్టారు. నిజానిజాలు తెలుసుకోకుండా నోరు పారేసుకోవద్దని సూచించారు. వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు అవసరమైన వ్యవస్థలు, యంత్రాంగం తమకు ఉన్నాయన్నారు. ఈ వివాదాన్ని ఓ కుట్రగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అభివర్ణించారు. సుప్రీంలో పిల్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అన్ని విద్యా సంస్థల్లోనూ ఉమ్మడి డ్రెస్ కోడ్ అమలయ్యేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మరోవైపు బెంగళూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో నోటీస్ బోర్డుపై హిజాబ్ గురించి అభ్యంతరకరంగా రాశారంటూ తల్లిదండ్రులు నిరసనకు దిగారు. దీనికి బాధ్యురాలిగా ఓ టీచర్‌ను యాజమాన్యం సస్పెండ్ చేసింది. -
చైనాకు క్వాడ్ పరోక్ష హెచ్చరికలు
వాషింగ్టన్: ఇండో–ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణం నెలకొల్పడానికి కృషి చేస్తామని క్వాడ్ సదస్సు ప్రతిజ్ఞ చేసింది. వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ప్రాంతంలో అంతర్జాతీయ నిబంధనలు అమలు కావాలని పిలుపునిచ్చింది. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమి క్వాడ్ సదస్సు శుక్రవారం వైట్‌హౌస్‌లో జరిగింది. తొలిసారిగా నాలుగు దేశాధినేతలు ప్రత్యక్షంగా పాల్గొన్న ఈ సందస్సులో ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో తమ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇదో అవకాశమని నేతలు చెప్పారు. భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడె సుగా సదస్సు అనంతరం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో చైనా పట్టు బిగిస్తున్న నేపథ్యంలో క్వాడ్ సదస్సు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ సంయుక్త ప్రకటనలో నేరుగా చైనా పేరు ప్రస్తావించకుండా అంతర్జాతీయ నిబంధనలకు లోబడే ఏ దేశమైనా ప్రవర్తించాలని పేర్కొన్నారు. ‘ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛగా వాణిజ్యం జరగాలి. వివాదాలు శాంతియుతంగా పరిష్కారం కావాలి. దేశాల ప్రజాస్వామ్య విలువలు, ప్రాదేశిక సమగ్రత కాపాడేలా కలసికట్టుగా కృషి చేస్తాం’’అని ఆ సంయుక్త ప్రకటన పేర్కొంది. అక్టోబర్ నుంచి భారత్ వ్యాక్సిన్ ఎగుమతుల్ని పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని క్వాడ్ సదస్సు స్వాగతించింది. పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ అందేలా కృషి చేయనున్నాయి. 2022 నాటికల్లా వంద కోట్ల వ్యాక్సిన్లను ఇతర దేశాలకు అందజేయనున్నాయి. ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాణిజ్యం జరగడానికి వీలుగా మౌలిక సదుపాయాల కల్పనలో పరస్పరం సహకరించుకోనున్నాయి. వాతావరణ మార్పుల్ని ఎదుర్కోవడానికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని ఒక నిర్ణయానికొచ్చాయి. -
భారత్, చైనాలు కలసి పనిచేస్తే ఆసియాకు మేలు
సింగపూర్: భారత్, చైనాలు పరస్పర విశ్వాసంతో కలసి పనిచేస్తే ఆసియాకు మెరుగైన భవిష్యత్తు ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. సరిహద్దుల్లో ప్రశాంతత నెలకొనేలా సమస్యలు పరిష్కరించుకోవడంలో ఇరు దేశాలు గొప్ప పరిపక్వత, విజ్ఞానాన్ని ప్రదర్శించాయని తెలిపారు. సింగపూర్ పర్యటనలో ఉన్న మోదీ శుక్రవారం ‘షాంగ్రి–లా’ సమావేశంలో కీలకోపన్యాసం చేశారు. 28 ఆసియా–పసిఫిక్ దేశాల అంతర ప్రభుత్వ భద్రతా వేదిక అయిన ఈ కార్యక్రమాన్ని 2002 నుంచి సింగపూర్‌లోని షాంగ్రి–లా అనే హోటల్లో ఏటా నిర్వహిస్తున్నారు. విభేదాలు, స్పర్థలను పక్కనపెట్టి ఈ ప్రాంత దేశాలన్నీ కలసి పనిచేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రాంతీయ సముద్ర తీర వివాదాలను ప్రస్తావిస్తూ..ఇండో–పసిఫిక్ ప్రాంతాన్ని భారత్ ఓ వ్యూహంగానో, కొందరి సభ్యుల క్లబ్గానో చూడదని ఉద్ఘాటించారు. ‘చర్చలు, ఉమ్మడి నిబంధనల ఆధారిత విధానాల ఆధారంగానే ఈ ప్రాంత అభివృద్ధి, భద్రత సాధ్యమని విశ్వసిస్తున్నాం. స్థిరమైన, వివక్షలేని అంతర్జాతీయ వాణిజ్య విధానాలకే భారత్ మద్దతిస్తుంది. పోటీ ఎక్కడైనా ఉంటుంది. కానీ పోటీ ఘర్షణగా, విభేదాలు వివాదాలుగా మారకూడదు’ అని వాణిజ్యంలో పెరిగిపోతున్న రక్షణాత్మక ధోరణులను పరోక్షంగా ప్రస్తావించారు. ఇండో–పసిఫిక్ ప్రాంత భవిష్యత్తుకు ఆసియాన్ కేంద్ర బిందువుగా ఉండబోతోందని జోస్యం చెప్పారు. ప్రాంతీయ అనుసంధానత వ్యాపారాభివృద్ధిని మించి వేర్వేరు దేశాలను చేరువ చేస్తోందని అన్నారు. అంతకు ముందు, మోదీ సింగపూర్ అధ్యక్షురాలు హలీమా యాకూబ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అంతరాలను చెరిపేస్తున్న సాంకేతికత: మోదీ సాంకేతికత ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి గొంతుకగా మారి, సామాజిక అడ్డంకులను తొలగిస్తోందని మోదీ అన్నారు. సృజనాత్మకతకు మానవీయ విలువలు జోడించి ఈ శతాబ్దపు సవాళ్లను అధిగమించాలని పిలుపునిచ్చారు. సింగపూర్‌లోని ప్రతిష్టాత్మక నన్యంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ(ఎన్టీయూ)లో నిర్వహించిన ట్రాన్స్ఫార్మింగ్ ఆసియా త్రూ ఇన్నోవేషన్’ అనే సదస్సులో మోదీ ప్రసంగించారు. మార్పును వినాశకారిగా చూడొద్దని, సాంకేతికత ఆధారిత సమాజం వల్లే అంతరాలు నశిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. పాశ్చాత్య దేశాల ఆధిపత్యం 300 ఏళ్ల నుంచే.. ‘21వ శతాబ్దం ఆసియాదే. మరి మనకు ఈ సెంటిమెంట్ ఉందా అన్నదే అతిపెద్ద సవాలని అనుకుంటున్నా. ప్రతి సృజనాత్మకత తొలుత అవాంతరంగా కనిపిస్తుంది. సమాజంలోని అంతరాలను సాంకేతికత సాయంతో పారదోలొచ్చు. సాంకేతికత అందరికీ అందుబాటులో ఉంటూ వినియోగదారుడికి అనుకూలంగా ఉండాలి. డిజిటల్ యుగానికి తగినట్లుగా నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, నీరు, గాలి కాలుష్యం, శరవేగంగా పెరుగుతున్న పట్ణణీకరణ, వాతావరణ మార్పులు, ఎక్కువ కాలం నిలిచే మౌలిక వసతుల నిర్మాణం, సముద్ర వనరుల పరిరక్షణ తదితరాలు నేడు మనకు సవాళ్లు విసురుతున్నాయి. సుమారు 1600 ఏళ్ల పాటు ప్రపంచ జీడీపీలో భారత్, చైనాల వాటానే 50 శాతంగా ఉండేది. గత 300 ఏళ్ల నుంచే పాశ్చాత్య దేశాల ఆధిపత్యం మొదలైంది. సాంకేతికతను ఆయుధాల తయారీకి వినియోగిస్తే ప్రపంచ దేశాల మధ్య ఘర్షణలు తప్పవు’ అని మోదీ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎన్టీయూ, భారత వర్సిటీల మధ్య విద్య, పారిశ్రామిక భాగస్వామ్యానికి సంబంధించి ఆరు ఒప్పందాలు కుదిరాయి. ఇక్కడ నిర్వహించిన ఎగ్జిబిషన్‌కు హాజరైన మోదీ..మనుషులతో సంభాషించే ఓ రోబోతో మాట్లాడారు. లూంగ్‌కు బౌద్ధ జ్ఞాపిక ప్రదానం.. చర్చల సందర్భంగా లూంగ్‌కు మోదీ 6వ శతాబ్దం నాటి బౌద్ధగుప్త జ్ఞాపిక నమూనాను కానుకగా ఇచ్చా రు. బౌద్ధమతం భారత్ నుంచి ఆగ్నేయాసియాకు వ్యాపించిందనడానికి సాక్ష్యంగా భావిస్తున్న ఈ జ్ఞాపికపై సంస్కృత వాక్యాలున్నాయి. అలాగే, సింగపూర్ మాజీ రాయబారి టామీ కోహ్(80)కు ప్రధాని మోదీ పద్మశ్రీ పురస్కారాన్ని అందజేశారు. ఈ ఏడాది పద్మశ్రీ పొందిన ఆసియాన్ దేశాలకు చెందిన 10 మందిలో కోహ్ ఒకరు. కోహ్ గతంలో అమెరికా, ఐక్యరాజ్య సమితిలో రాయబారిగా చేశారు. 8 ఒప్పందాలపై సంతకాలు ఆర్థిక, రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్, సింగపూర్ నిర్ణయించాయి. నావికా దళాల మధ్య రవాణా సహకారం సహా ఇరు దేశాల మధ్య 8 ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని మోదీ, సింగపూర్ ప్రధాని లూంగ్‌తో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై చర్చించారు. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం(సీఈసీఏ)పై రెండో సమీక్ష సమావేశం విజయవంతమైందని మోదీ తెలిపారు. లూంగ్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు పటిష్టమయ్యాయని అన్నారు. సింగపూర్ కంపెనీల సహకారంతో నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, పుణే విమానాశ్రయ అభివృద్ధిని ప్రస్తావించారు. -
కెరీర్ విత్ పొలిటికల్ సైన్స్
తెగలు, సమూహాలు, నగరాలు, దేశాలుగా నివసిస్తున్న ప్రజల మధ్య..వారి జీవన గమనానికి అవసరమైన నియమాలు రూపొందించడం, వాటిని అమలు చేయడం ద్వారా ప్రజలు కలసి మెలసి జీవించడానికి ఒక రకమైన వారధిగా నిలిచేవే రాజకీయాలు.. రాచరికం నుంచి ప్రజల చేతుల్లోకి అధికారం విస్తరించిన నేపథ్యంలో రాజకీయాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి..ప్రజలు తమకు కావల్సిన అవసరాల గొంతుకను రాజకీయమనే వ్యవస్థ ద్వారా వినిపిస్తుంటారు.. ఈ క్రమంలో రూపొందించే చట్టాలు, జరిగే నిర్ణయాలు, తీసుకునే చర్యలు వంటి అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేదే రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్).. దేశాల పరిపాలనకు సంబంధించిన విధానాలు, ప్రభుత్వ నియమాలు, రాజ్యాంగం పాత్ర, చట్టాల తయారీ మార్గాలు, ఎన్నికలు... ఇలా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకు అవసరమైన అన్ని అంశాలను విశ్లేషణాత్మకంగా చర్చించేదే రాజనీతి శాస్త్రం. ఇందులో రాజకీయ విలువలు, సంస్థలు, అవి పని చేసేతీరు, రాజ్యాంగం వంటి అంశాలు ఉంటాయి. లీడర్‌గా ఎదగడానికి: శరవేగంగా మార్పు దిశగా ప్రపంచం దూసుకుపోతున్న ప్రస్తుత తరుణంలో సమాజాన్ని వివిధ మాధ్యమాల నుంచి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం రాజకీయాలు అనే కోణంలోనే కాకుండా.. ప్రస్తుత ఆధునిక యుగంలో ఒక వ్యక్తిలా కాకుండా నాయకుడిగా ఉండాల్సిన పరిస్థితి. కుటుంబం నుంచి పని చేసే సంస్థ వరకు నలుగురికీ ఆదర్శంగా నిలుస్తూ.. నడిపిస్తూ ముందుకు సాగాలి. అంటే విద్యార్హతలతోపాటు నాయకత్వ లక్షణాలు కూడా నియామక ప్రక్రియలో నిర్ణయాత్మకంగా నిలుస్తున్న తరుణంలో ఒక వ్యక్తిని పరిపూర్ణ మూర్తిమత్వం ఉన్న నాయకుడిగా తీర్చిదిద్దేందుకు కావల్సిన అవగాహనను పొలిటికల్ సైన్స్ అందిస్తుంది. అంతేకాకుండా భవిష్యత్‌లో రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకునే వారికి కావల్సిన పరిజ్ఞానాన్ని కూడా కల్పిస్తుంది (రాజకీయాల్లో రాణించాలంటే పొలిటికల్ సైన్స్ చదవాల్సిన అవసరం లేదు). కేవలం సంబంధిత రంగ పోకడలను, నేపథ్యాన్ని అవగాహన చేసుకోవడానికి ఈ శాస్త్రం వీలు కల్పిస్తుంది. అధ్యయనం ఇక్కడి నుంచే: పొలిటికల్ సైన్స్‌ను అధ్యయనం చేయడం పాఠశాల దశ నుంచే ప్రారంభమవుతుంది. అయితే ఆ స్థాయిలో కేవలం పౌర విధులు, ఎన్నికలు, నాయకులను ఎన్నుకునే విధానం, నాయకత్వ అర్హతలు వంటి అంశాల చుట్టే కేంద్రీకృతమవుతుంది. డిగ్రీ స్థాయికి వచ్చేసరికి పొలిటికల్ సైన్స్‌గా ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్‌గా విస్తృత పరిధిలో ఆవిష్కృతమవుతుంది. కేవలం జాతీయ స్థాయి అంశాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయంగా రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసే అవకాశం ఇక్కడ లభిస్తుంది. రాజనీతి శాస్త్రంలో డిగ్రీ తర్వాత పోస్ట్‌గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ వంటి కోర్సులు చేసే అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉంటే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటుచేసుకున్న లేదా మనుగడలో ఉన్న అంశాలను ఎంపిక చేసుకుని.. దాని ఆధారంగా పరిశోధనలు చేయవచ్చు. కాలక్రమేణా వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని రాజనీతి శాస్త్రానికి సంబంధించి పబ్లిక్ పాలసీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వంటి కొత్త సబ్జెక్ట్‌లను ప్రవేశపెట్టారు. పబ్లిక్ పాలసీ: సమగ్రాభివృద్ధిలో పబ్లిక్ పాలసీ అనేది ఒక విడదీయరాని భాగం. భవిష్యత్ విధాన నిర్ణేతలు, విశ్లేషకులకు, ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థలు ఒక పథకాన్ని రూపొందించేటప్పుడు చేయాల్సిన ఊహాత్మక కూర్పు, ఆచరణాత్మక నైపుణ్యాలు, సిద్ధాంతాలు వంటి అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి రూపొందించిన కోర్సు పబ్లిక్ పాలసీ. ఒక విధానాన్ని రూపొందించేటప్పుడు..దాని సాధ్యాసాధ్యాలకు సంబంధించి అన్ని కోణాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయడానికి ఈ కోర్సు దోహదం చేస్తుంది. ఇందులో హెల్త్ పాలసీ, ఎన్విరాన్మెంటల్ పాలసీ, ఉమెన్ పాలసీ, ఎడ్యుకేషన్ పాలసీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ పాలసీ వంటి ఎన్నో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి కార్పొరేట్ కంపెనీల్లోని సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగాల్లో, ఎన్జీవోలు, మెకన్సీ, డెలాయిట్ వంటి కన్సల్టెంగ్ కంపెనీలు, కమ్యూనికేషన్ కంపెనీల్లో పీఆర్ విభాగాల్లో, మీడియా హౌస్‌లలో, పరిశోధన సంస్థల్లో, యునెటైడ్ నేషన్స్, యూనిసెఫ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో కన్సల్టెంట్స్గా, ప్రభుత్వంతో సంబంధం ఉన్న ఆడిట్ ఫార్మ్స్ వంటి సంస్థలు కెరీర్ వేదికలుగా నిలుస్తున్నాయి. ఈ విభాగానికి సంబంధించి కేవలం మాస్టర్స్ స్థాయిలో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది. అందిస్తున్న సంస్థలు: ఐఐఎం-బెంగళూరు (కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్మెంట్, వెబ్సైట్: www.iimb.ernet.in), టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్-ముంబై (వెబ్సైట్: www. tiss.edu), నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ-బెంగళూరు (కోర్సు: మాస్టర్ ఇన్ పబ్లిక్ పాలసీ, వెబ్సైట్: www.nls.ac.in), సెయింట్ జేవియర్స్ -ముంబై (వెబ్సైట్: http://xaviers.edu), టెరీ యూనివర్సిటీ (కోర్సు: ఎంఏ-పబ్లిక్ పాలసీ అండ్ సస్టెయినబిలిటీ డెవలప్మెంట్, వెబ్సైట్: www.teriuniversity.ac.in), జిందాల్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ పాలసీ-సోనిపట్ (కోర్సు: మాస్టర్ ఇన్ పబ్లిక్, వెబ్సైట్: www. jsgp.edu.in), ఢిల్లీ యూనివర్సిటీ (కోర్సు: ఎంబీఏ-పబ్లిక్ సిస్టమ్స్ మేనేజ్మెంట్, వెబ్సైట్: www.du.ac.in). ఇంటర్నేషనల్ రిలేషన్స్: అంతర్జాతీయ రాజకీయాలను విశ్లేషణాత్మక దృష్టితో అధ్యయనం చేసే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్సును ప్రారంభించారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి జాతీయ/అంతర్జాతీయ ఎన్జీవోలు, యునెటైడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ ఏజెన్సీలు, పరిశోధనా సంస్థలు, మీడియా హౌస్‌లలో అవకాశాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్సు పీజీ/పీహెచ్డీ స్థాయిలో మాత్రమే అందుబాటులో ఉంది. అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ-న్యూఢిల్లీ (వెబ్సైట్: www.jnu.ac.in), జిందాల్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ (వెబ్సైట్: www.jsia.edu.in), పాండిచ్చేరి యూనివర్సిటీ (వెబ్సైట్: www.pondiuni.edu.in). కెరీర్ అవెన్యూస్: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ ప్లానింగ్, సోషల్ పాలసీ, అకడమిక్స్, పబ్లిక్ అఫైర్స్, అనాలిసిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఫారెన్ కరస్పాండెంట్, సిటీ ప్లానర్, డిప్లొమాట్, ఇంటెలిజెంట్ ఎక్స్పర్ట్,ఇంటర్నేషనల్ ఆర్గనైజర్, ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్, రాయబార కార్యాలయాల్లో ట్రాన్స్‌లేటర్, ప్రభుత్వ, పరిశోధనా సంస్థలు, ఎన్జీవోలు, యూనివర్సిటీలు, బిజినెస్ హౌస్, కార్పొరేట్ కంపెనీలు, మీడియా హౌస్‌లు తదితరాలు కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. పొలిటికల్ సైంటిస్ట్: ప్రస్తుత రాజకీయ వ్యవస్థను పొలిటికల్ సైంటిస్ట్‌లు అధ్యయనం చేస్తుంటారు. అంటే ఒక సమూహం పోకడను నిశితంగా గమనిస్తుంటారు. ఉదాహరణకు ఎవరైనా ఒక అం శంపై ప్రజా అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం సర్వేలు నిర్వహిస్తుంటారు. అలాంటప్పుడు వీరి సేవలు అవసరమవుతాయి. వివిధ రకాల సర్వేలు నిర్వహించడం, వాటి ఫలితాలను విశ్లేషించడం, సంబంధిత వ్యక్తులను ఇంటర్వ్యూ చేయడం, సంబంధిత డాక్యుమెంట్స్ స్క్రూటినీ, వివిధ సంస్థలకు సలహాదారులుగా వ్యవహరించడం, ప్రభుత్వ సంస్థల కోసం కన్సల్టింగ్ వర్క్ నిర్వహించడం, నిర్దేశిత అం శాలపై పత్రికలకు వ్యాసాలు రాయడం వంటివి వీరి విధులు. రీసెర్చ్: రాజనీతి శాస్త్రం వల్ల విశ్లేషణాత్మక సామర్థ్యం, డేటా అనాలిసిస్, కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే కాకుండా ఓరల్, రిటెన్ స్కిల్స్ కూడా మెరుగుపడతాయి. తద్వారా రీసెర్చ్ అసిస్టెంట్‌గా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే కెరీర్ ప్రారంభించవచ్చు. పొలిటికల్ సైన్స్ కోర్సులను అందిస్తున్న కాలేజీలు, యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లు, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లలో టీచింగ్‌తో సమాంతరంగా పరిశోధనా కార్యకలాపాలు కూడా తప్పనిసరి. ఎందుకంటే సంబంధిత అంశంపై సమకాలీనంగా చోటుచేసుకుంటున్న మార్పులపై అప్డేట్గా ఉండాలంటే పరిశోధనా విభాగం పాత్ర ఎంతో. కాబట్టి ఆయా ఇన్స్టిట్యూట్లలో రీసెర్చర్‌గా కూడా చేరొచ్చు. పాలసీ మేకింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్: పొలిటికల్ సైన్స్‌ను ప్రభావవంతంగా అన్వయించే లక్షణం ఉన్న వారికి అవకాశాలు కల్పిస్తున్న మరో విభాగం పాలసీ మేకింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే కొన్ని కీలక రంగాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు.. ఆ నిర్ణయాల పర్యవసానాలను సామాజికంగా అన్వయించాల్సి ఉంటుంది. ఆ సమయంలో పొలిటికల్ సైన్స్ అభ్యర్థులు కీలకంగా మారతారు. హౌసింగ్, ట్రాన్స్‌పోర్టేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనిటీ రిలేషన్స్, కార్పొరేట్ హైరింగ్ స్ట్రాటజీస్, హెల్త్, లా వంటి విభాగాల్లో ఈ తరహా రిక్రూట్మెంట్ ఎక్కువగా జరుగుతుంది. హెచ్ఆర్ విభాగాల్లో: పొలిటికల్ సైన్స్‌లో పీజీ లేదా అడ్వాన్స్డ్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ విభాగాల్లో కూడా అవకాశాలు ఉంటాయి. పరిశ్రమల్లో వీరిని ఇండస్ట్రియల్ పొలిటికల్ సైంటిస్ట్‌లుగా నియమించుకుంటారు. ఉత్పాదకత విషయంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి, ఉద్యోగుల మధ్య సంబంధాలను నెలకొల్పడం వంటి అంశాలను నిర్వహించడానికి వీరి సేవలను వినియోగించుకుంటారు. ప్రభుత్వ పథకాల విశ్లేషణ: పొలిటికల్ సైన్స్ అభ్యర్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల విశ్లేషణ/మాల్యాంకనం లేదా సంబంధిత పరిశోధనలో లేదా సమస్య పరిష్కార రంగాల్లో అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో ఆయా పథకాల అడ్మినిస్ట్రేటర్స్, మేనేజర్స్, డెవలపర్స్‌గా స్థిరపడొచ్చు. రాష్ట్ర స్థాయిలో అర్బన్ ప్లానింగ్, హెల్త్ ప్లానింగ్, క్రిమినల్ జస్టిస్ వంటి వీరి సేవలను ఎక్కువగా వినియోగించుకుంటారు. సహకారం: న్యూస్‌లైన్, కేయూ క్యాంపస్, వరంగల్ జిల్లా. కావల్సిన లక్షణాలు పొలిటికల్ సైన్స్ కోర్సును ఎంచుకున్న వారికి కావల్సిన లక్షణాలు. అవి.. రిటెన్, ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిపోర్ట్ రైటింగ్ స్కిల్స్ విశ్లేషణాత్మక-సృజనాత్మక ఆలోచన తార్కిక వివేచన-సమస్య పరిష్కార నైపుణ్యం సత్వరంగా నిర్ణయం తీసుకునే నేర్పు విమర్శను స్వీకరించే గుణం ఓపెన్ మైండ్ మానవ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం అన్ని సామాజిక శాస్త్రాలలోఅంతర్భాగంగానే రాజనీతిశాస్త్రం కూడా ముఖ్యమనేది గుర్తించాలి. రాజనీతిశాస్త్ర అధ్యయనం చేసిన విద్యార్థుల్లో సంకుచిత స్వభావాలు తొలిగి విశాల దృక్పథం అలవడుతుంది. కులం మతం ప్రాంతాలకు అతీతంగా విశ్వమానవ కల్యాణానికి ప్రపంచాన్ని జాగృతం చేయటం అనేది రాజనీతిశాస్త్ర అధ్యయనం చేసిన విద్యార్థుల్లో ఉంటుంది. రాజనీతిశాస్త్ర అధ్యయనం వివిధ కాంపిటీటివ్ ఉద్యోగాల కోసం రాసే రాతపరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సివిల్స్, గ్రూప్ పోస్టులకు. రాజీకీయాల అవగాహనకు కూడా రాజనీతిశాస్త్రం అధ్యయనం కూడా అవసరమే. - డాక్టర్ ఎ.హరిప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, రాజనీతిశాస్త్ర విభాగం-కాకతీయ యూనివర్సిటీ. ఇతర అవకాశాలు పొలిటికల్ సైన్స్ కోర్సు పూర్తి చేసిన వారికి టీచింగ్, రీసెర్చ్, పబ్లిషింగ్, బిజినెస్, జర్నలిజం రంగాల కేంద్రీకృతంగా అవకాశాలు ఉంటాయి. మిగతా అభ్యర్థుల మాదిరిగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలు, ఇతర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు నిర్వహించే అన్ని రకాల ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరు కావచ్చు.టీచింగ్‌పై ఆసక్తి ఉంటే బీఈడీ, డీఈఈసెట్, పీఈసెట్, లాంగ్వేజ్ పండిట్స్ పరీక్షలకు హాజరుకావచ్చు. సంబంధిత కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు/ కాలేజీలు/ యూనివర్సిటీలలో ఫ్యాకల్టీగా కెరీర్ ప్రారంభించవచ్చు. మీడియా, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు పూర్తిచేయడం ద్వారా రోజురోజుకూ విస్తరిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. -
తప్పులను తప్పనిసరిగా గుర్తు పెట్టుకుంటాను!
మై ఫిలాసఫీ జీవితం చాలామందికి పూలబాట కాకపోవచ్చు. పూలబాట అయినవాళ్లకు...అది శాశ్వతం కాకపోవచ్చు. ఈ ఎరుక మనలో ఉంటే కష్టాల్లోనైనా, సుఖాల్లోనైనా స్థిరచిత్తంతో ఉండే గుణం అలవడుతుంది. ‘నా శక్తి ఇది’ అని గొప్పగా చెప్పుకునే వాళ్లకు ‘నా బలహీనత ఇది’ అని చెప్పుకునే ధైర్యం కూడా ఉండాలి. అప్పుడే లెక్క కుదురుతుంది! మిగతా విషయాలను గుర్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా... నా తప్పులను మాత్రం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతాను. కొన్ని సమయాల్లో ‘అహం’ వాస్తవాలను చూడడానికి నిరాకరిస్తుంది. అహాన్ని పక్కన పెడితే వాస్తవం చేరువవుతుంది. అహాన్ని వదులుకోవడం అంటే ఒక మెట్టు కిందకి దిగడం కాదు... రెండు మెట్లు పైకి ఎక్కడం. ఉత్తినే సలహాల కోసం సలహాలు ఇచ్చే వారి దగ్గర సలహాలు తీసుకోవడం కంటే, తీసుకోకపోవడం వల్లే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పాత్రలు నచ్చకపోయినా ‘నటించాలి’ అనే నియమమేదీ పెట్టుకోలేదు. ‘ఇంటర్నేషనల్ రిలేషన్స్’లో డిగ్రీ ఉంది. సిటీబ్యాంకులో ఉద్యోగం చేసిన అనుభవం ఉంది. చెప్పొచ్చేదేమిటంటే సినిమాలు నచ్చనప్పుడు హాయిగా ఉద్యోగం చేసుకోగలను. ఈ చిన్న జీవితంలో మనం చేయడానికి ఎంతో ఉందని నమ్ముతాను. కష్టాలు, నష్టాల గురించి ఆలోచించడం వృథా. ఇంత పెద్ద జీవితంలో ఆలోచించడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. ఆలోచనా శక్తిని వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు. బాగా సంపాదించాలి, బాగా కీర్తి గడించాలి... ఇలాంటి కోరికలు ఏమీ లేవు. సాధారణ జీవితం గడపడానికే ఇష్టపడతాను. ఆర్థిక స్వాతంత్య్రానికి ప్రాధాన్యత ఇస్తాను. ఎప్పుడూ ఆనందంగా ఉండాలనుకుంటాను. - సోహా అలీ ఖాన్, హీరోయిన్