
జనతంత్రం
భారత్, అమెరికా దేశాల మధ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్న దశ అనూహ్యంగా మొదలైంది. ఏనుగు కుంభస్థలంపై ఎలుక పిల్ల ఓ మొట్టికాయ వేసిందట! రెండు దేశాలను ఉద్దేశించి ఓ ఆర్థిక నిపుణుడు చేసిన వ్యాఖ్యానం ఇది. అయితే ఇందులో ఏనుగెవరు? ఎలుకెవరు? గత పాతికేళ్లుగా డాలర్ డ్రీమ్స్‌ను పలవరిస్తూ వస్తున్న మన మిడిల్ క్లాస్ కుటుంబ రావులు ఈ ప్రశ్నకు ఠకీమని సమాధానం చెప్పగలరు. అపారమైన ఆర్థిక – సైనిక బలం, అగ్రరాజ్య హోదా ఉన్న అమెరికా ఎలుకెట్లా అవుతుంది? లక్షల సంఖ్యలో మన వంశోద్ధారకుల్ని కూడా ఉద్ధరిస్తున్న అమెరికా దేశం ఏనుగు కాకుండా ఎలుకవుతుందా అనే సందేహం వారికి ఉంటుంది. మరి నూటా నలభై కోట్ల జనాభా, అందులో 90 కోట్ల మంది యువత ఉన్న భారత దేశాన్ని కూడా ఎలుకతో పోల్చడం సాధ్యంకాదు కదా!
వాణిజ్య ట్యారిఫ్‌లను ఆయుధాలుగా మార్చుకొని కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కవ్వింపు చర్యలకు పాల్పడటం, తదనంతర ప్రపంచ పరిణామాల నేపథ్యంలో రిచర్డ్ ఓల్ఫ్ అనే అమెరికన్ ఆర్థికవేత్త చేసిన విశ్లేషణ సంచలనంగా మారింది. భారతదేశంపై ట్రంప్ చేసిన 50 శాతం సుంకాల ‘యుద్ధ ప్రకటన’పై ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఈ వ్యాఖ్యానాన్ని విస్తారమైన అర్థంలో చేశార నుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా కలిగే దీని పర్యవసానాలను దృష్టిలో పెట్టుకొని ఏనుగుపై ఎలుక మొట్టికాయ వేసినట్టేనని అన్నారు. ప్రపంచ జనాభాలో నాలుగున్నర శాతం లేని దేశం 95 శాతం ప్రజలను ఆజ్ఞాపించాలని చూసే పెత్తందారీతనం బెడిసి కొడుతుందని ఆయన జోస్యం చెప్పారు.
అమెరికా ట్యారిఫ్ కొరడా ప్రయోగం భారత్‌పై ప్రభావం చూపబోదని దాని అర్థం కాదు. తక్షణ ఫలితంగా భారత్ ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. మొత్తం అంత ర్జాతీయ వాణిజ్యంలో 90 బిలియన్ డాలర్ల పైచిలుకు లోటును భారత్ ఎదుర్కొంటున్నది. ఈ లోటులో సింహభాగం చైనా వాణిజ్యంలోనే! ‘మేకిన్ ఇండియా’ సత్ఫలితాలిస్తే తప్ప ఈ లోటును అధిగమించడం సాధ్యం కాదు. ఒక్క అమెరికా వాణిజ్యంలోనే భారత్ మిగులు భాగస్వామిగా ఉంటున్నది.
అమెరికాకు 87 బిలియన్ డాలర్ల సరుకుల్ని ఎగుమతి చేస్తున్న మన దేశం అక్కడి నుంచి 45 బిలియన్ డాలర్ల కిమ్మత్తు చేసే సరుకుల్ని దిగుమతి చేసుకుంటున్నది. 50 శాతం ట్యారిఫ్ ప్రభావం 70 శాతం వ్యాపారంపై పడుతుందని, ఫలితంగా వెనువెంటనే 20 బిలియన్ డాలర్ల మేరకు నష్టపోతామని ఎగుమతిదార్ల సంస్థలు చెబుతున్నాయి. వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. తిరుపూర్, నోయిడా, సూరత్ వంటి పట్టణాల్లో అప్పుడే ఉద్యోగాల కోత, ఫ్యాక్టరీల మూత మొదలైంది.
అమెరికా కొరడా ఝుళిపిస్తుంటే భారత్ చేతులు ముడుచు కొని కూర్చుంటుందా? కూర్చోలేదు కూడా! ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటివరకూ భారత నాయకత్వం పరిణతితో, ప్రాప్తకాలజ్ఞతతో వ్యవహరించిందనే చెప్పాలి. భారత్ – పాక్‌ల మధ్య ఏర్పడిన తీవ్ర ఉద్రిక్తతల సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. యుద్ధం మొదలుకావడం, రెండు రోజుల్లోనే పాక్‌ను భారత్ దారుణంగా దెబ్బతీయడం, ఆ వెనువెంటనే కాల్పుల విరమణ ప్రకటన రావడం జరిగింది. భారత్ – పాక్‌లు ప్రకటించకముందే తన వల్లనే యుద్ధం ఆగిపోయిందని ట్రంప్ ప్రకటించుకున్నారు. దీన్ని భారత్ అధికారికంగా ఖండించ లేదు.
ట్రంప్‌కు మోదీ భయపడ్డారని, ఆయన ఆదేశించగానే కాల్పుల విరమణ అమలు చేశారనే ప్రచారం జరిగింది. చాలా మంది నమ్మారు. తదనంతర పరిణామాలను గమనిస్తే అప్పటి అభిప్రాయం కేవలం అపోహ మాత్రమే కావచ్చనిపిస్తున్నది. గతంలో విధించిన 25 శాతం ట్యారిఫ్‌కు అదనంగా మరో 25 శాతం విధించడానికి కారణం తాము ఆంక్షలు విధించిన రష్యా నుంచి భారీఎత్తున చమురు కొనుగోలు చేయడమేనని ఇప్పుడు అమెరికా చెబుతున్నది. అసలు కారణం అది కాదన్న సంగతి అందరికీ తెలుసు.
అమెరికాలోని వ్యవసాయ, పాల ఉత్పత్తి రంగాలను చిరకాలంగా భారత మార్కెట్ ఊరిస్తున్నది. అవి భారత్‌లో ప్రవేశించగలిగితే ఇబ్బడిముబ్బడిగా అమెరికా విత్తన కంపెనీలు, పాల ఉత్పత్తుల కంపెనీలు లాభాలు పోగేసుకోగలుగుతాయి. జన్యుమార్పిడి పంటలైన సోయాబీన్, మొక్కజొన్నలను దిగు మతి చేసుకోవాలని అమెరికా భారత్‌ను డిమాండ్ చేస్తున్నది. వ్యవసాయ రంగాన్ని పరాధీనం చేయగలిగే జీఎమ్ పంటలను ఒక విధానంగా భారత ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి.
అట్లానే పాల ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని అమెరికా షరతు పెట్టింది. ఈ షరతు అంగీకరిస్తే దేశవాళీ పాడి పరిశ్రమ లక్ష కోట్లకు పైగా నష్టపోతుందని ఒక అంచనా. పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న దేశం పాల ఉత్పత్తులను చౌక సుంకాలకు దిగుమతి చేసుకోవడం ఏమిటి? ఇప్పటికీ 40 శాతం మంది ప్రజలు వ్యవసాయ ఆధారిత రంగాలపై ఆధారపడిన దేశం విషతుల్యమైన జీఎమ్ పంటలను దిగుమతి చేసుకో వలసిన అవసరమేమిటి? ట్రంప్ సర్కార్ కోరిన ఈ హిరణ్యాక్ష వరాలకు భారత్ తలాడించలేదు.
ఆయన నోబెల్ బహుమతి పిచ్చికి భారత ప్రభుత్వం సహకరించలేదన్న దుగ్ధ కూడా అమెరికా అధ్యక్షుడిని వేధిస్తున్న దట! ట్రంప్ మధ్యవర్తిత్వం వల్లనే కాల్పుల విరమణకు ఒప్పు కున్నామని భారత్ ఒక మాట అధికారికంగా చెబితే తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కుతుందని ట్రంప్ ఆశ. భారత్ – పాక్ వ్యవహారాల్లో మూడో దేశం జోక్యాన్ని చాలాకాలంగా భారత్ అంగీరించడం లేదు.
ఒక దేశాధినేత నోబెల్ పిచ్చిని తీర్చడం కోసం తన దేశ సార్వభౌమాధికారంతో రాజీపడడానికి భారత్ అంగీకరించలేదు. ఇటువంటి రాజీ పట్ల పాక్‌కు ఎటు వంటి అభ్యంతరమూ లేదు. ట్రంప్ కోరుకుంటున్న ప్రకటనను పాక్ మిలిటరీ చీఫ్ అసీఫ్ మునీర్ చేశారు. దాంతో మునీర్‌ను పొగడ్తల్లో ముంచడమే గాక ఆయన్ను వైట్‌హౌస్‌లో భోజనానికి ప్రత్యేకంగా ట్రంప్ ఆహ్వానించారు.
ఏకధ్రువ ప్రపంచం నుండి బహుధ్రువ ప్రపంచం వైపు మానవాళి అడుగులు వేస్తున్న కీలకమైన మలుపులో భారతదేశం తన ప్రయోజనాల కోసం అనుసరించవలసిన విదేశీ విధానంపై కేంద్ర సర్కార్‌కు ఇప్పటికే ఒక స్పష్టత ఉన్నది. అంతర్జాతీయ సంబంధాల్లో సిద్ధాంతాల పాత్ర ప్రచ్ఛన్న యుద్ధంతోపాటే కరిగిపోయింది. భౌగోళిక రాజకీయ అవరోధాలున్న సందర్భా ల్లోనూ ఉభయతారకంగా నెగ్గుకురావడానికి అవసరమైన వ్యూహాలకు మన విదేశాంగ విధానం పెద్దపీట వేస్తున్నది.
విదేశాంగ మంత్రిగా ఉన్న జైశంకర్ దీర్ఘకాలం పాటు దౌత్యవేత్తగా పనిచేశారు. ఆ అనుభవ సారాన్ని రంగరించి, ప్రభుత్వ ఆలోచనల్ని కూడా కలబోసి ‘ది ఇండియా వే’ (భారత్ మార్గం : అనిశ్చిత ప్రపంచంలో అనుసరణీయ వ్యూహాలు) అనే పుస్తకాన్ని రాశారు. మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో అనుసరించదగిన వ్యూహాలపై అందులో చర్చించారు. భారత విదేశాంగ విధానం ఇప్పుడీ తాజా పంథాలోనే కొనసాగు తున్నట్టు కనిపిస్తున్నది.
ఇంకెంతోకాలం అగ్రరాజ్యంగా అమెరికా మనలేదని, డాలర్ పెత్తనానికి కూడా రోజులు దగ్గరపడినట్టేనని పలువురు ఆర్థిక నిపుణులు జోస్యం చెబుతున్నారు. ట్రంప్ చర్యలు ఈ పరిణామాన్ని వేగవంతం చేయగలవని అంచనా వేస్తున్నారు. అమెరికా నాయకత్వంలోని ‘జీ–7’ దేశాల పాశ్చాత్య కూటమిని ఆర్థిక రంగంలో ‘బ్రిక్స్’ దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) ఇప్పటికే అధిగమించడాన్ని ఇందుకు రుజువుగా వారు చూపెడుతున్నారు.
వచ్చే ఏడాది ‘బ్రిక్స్’ కూటమికి భారత్ నాయకత్వం వహించబోతున్నది. భౌగోళిక రాజకీయాలతోపాటు పలు అంశాలపై వైరుద్ధ్యాలున్న రెండు అతిపెద్ద దేశాలను (భారత్ – చైనా) వ్యూహాత్మక స్నేహం వైపు నడిపించిన ఘనత ట్రంప్‌దేనని అమెరికన్ నిపుణులే విమర్శి స్తున్నారు. ఇండో – పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తర ణను అడ్డుకోవడానికి అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా లతో కలిసి ఏర్పడిన ‘క్వాడ్’ కూటమి తాజా పరిణామాలతో నిర్వీర్యమైనట్టే!

గల్వాన్ ఘర్షణ అనంతరం రెండు దేశాల మధ్యన ఏర్పడిన ఉద్రిక్తతలను ఉపశమింపజేయడానికి అవసరమైన కొన్ని చర్య లను రెండు దేశాలూ ఇప్పటికే తీసుకోవడం ఆరంభించాయి. మన విదేశాంగ మంత్రి జైశంకర్ జిన్‌పింగ్‌ను కలిశారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఢిల్లీకి వచ్చి మంతనాలు జరి పారు. భారత యాత్రికుల కోసం మానస సరోవరం మార్గాన్ని చైనా తెరిచింది. చైనాకు విమానయానాలను భారత్ పునరు ద్ధరించింది.
చైనాలోని తియాంజిన్‌లో ప్రారంభమైన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. శనివారం నాడాయనకు చైనాలో ఆత్మీయ స్వాగతం లభించింది. భారతదేశపు శాస్త్రీయ సంగీత నృత్యా లతో చైనా యువతీ యువకులు ఆయన్ను అలరించారు. అమె రికా పెత్తందారీతనానికి వ్యతిరేక వేదికను ఈ సదస్సు బలో పేతం చేసే అవకాశం ఉన్నది.
ఆదివారం నాడు చైనా అధ్యక్షుడు షీ–జిన్‌పింగ్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ద్వైపాక్షిక సమస్యలు, సంబంధాలపై వారి మధ్య చర్చలు జరగవచ్చు. ఎస్‌సీఓ శిఖ రాగ్ర సభకు అమెరికా బద్ధ శత్రువైన రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా హాజరవు తున్నారు. ఈ నేతలతో కూడా మోదీ చర్చలు జరిపే అవకాశం ఉన్నది. రష్యాతో మనది చెక్కుచెదరని దశాబ్దాల స్నేహబంధం. ఇరాన్‌తో మనకున్న అనుబంధానికి శతాబ్దాల చరిత్ర ఉన్నది.
ట్రంప్ ట్యారిఫ్‌ల నేపథ్యంలో భారత్ కొత్త మార్కెట్‌లకు విస్తరించడం కోసం అందివచ్చిన వేదికలన్నిటినీ ఉపయోగించుకుంటుంది. ఈ ప్రయాణంలో భారత్ వైఖరి వేగిర పడిన చందంగా కాకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. ఎస్‌సీఓ సమావేశం ముగిసిన తర్వాత బుధవారం నాడు బీజింగ్‌లో మరో భారీ ర్యాలీని చైనా నిర్వహిస్తున్నది. రెండో ప్రపంచ యుద్ధంలో సామ్రాజ్యవాద శక్తులను (ముఖ్యంగా జపాన్ సామ్రాజ్యవాదం) ఓడించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చైనా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నది.
ఎస్‌సీఓ సభకు హాజరయ్యే దేశాలన్నీ ఈ ర్యాలీకి హాజరవుతున్నా భారత్ మాత్రం జపాన్ పట్ల స్నేహభావంతో హాజరు కావడం లేదు. పైగా తియాంజిన్ సదస్సుకు ముందు రెండు రోజులపాటు ప్రధాని మోదీ జపాన్‌లో పర్యటించారు. రెండు దేశాల మధ్య టెక్నాలజీ రంగంలో పలు ఒప్పందాలు కుదిరాయి. జపాన్ కూడా భారత ప్రధానికి ఘనమైన స్వాగతాన్నే ఏర్పాటు చేసింది. జపనీయులు గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ ఆయనకు ఆహ్వానం పలికి ఆకట్టుకున్నారు.
ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి, ఒక అభివృద్ధి చెందిన దేశం హోదా వైపు అడుగులు వేయడానికి ఆచరణా త్మకమైన, వివేకవంతమైన విదేశాంగ విధానం ఒక్కటే సరి పోతుందా? దేశీయంగా అందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామా? అనే విషయాలను సమీక్షించుకోవలసిన సమయమిది. జీఎస్టీ శ్లాబుల కుదింపు, స్వదేశీ వాడకం ఉద్యమానికి ప్రధాని పిలుపు నివ్వడం ట్రంప్ ట్యారిఫ్‌ల నేపథ్యంలో తీసుకున్న చర్యలే కావచ్చు.
వాటివల్లనే స్వదేశీ మార్కెట్ బలపడుతుందా? మన దేశ ప్రజల కొనుగోలు శక్తి బలంగా ఉంటే అమెరికా, ఐరోపా దేశాల ఉమ్మడి బలంతో సమానంగా ఉంటుంది. అటువంటి వ్యవస్థను సృష్టించుకోగలగడమే చైనా విజయ రహస్యంగా ఆర్థికవేత్తలు చెబుతున్నారు. చైనా ఆర్థికాభివృద్ధి పంథా ఒక హైబ్రిడ్ మోడల్. అది పూర్తిస్థాయి పెట్టుబడిదారీ విధానం కాదు. సోషలిస్టు విధానమూ కాదు. ప్రభుత్వ నియంత్రణకు లోబడిన పెట్టుబడి పూర్తి లాభాపేక్షతో కాకుండా సామాజిక వృద్ధికి కట్టుబడి ఉంటుంది.
ఈ ఆర్థిక విధానం ఫలితంగా కోట్లాది మంది పేదరికం సంకెళ్ళను తెంచుకొని ఒక బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోగలిగారు. మనం మాత్రం సమాజంలో తీవ్ర అసమానతలకూ,పేదరికానికీ ఒక ముఖ్య కారణ మైన ప్రైవేటీకరణ బాట వెంటనే ఇంకా పరుగులు తీస్తున్నాము. ఈ బాట ఇంకెంతమాత్రమూ పేదరికాన్ని నిర్మూలించలేదనీ, అసమానతల్ని పోగొట్టలేదనీ ఇప్పటికే రుజువైంది. దేశీయంగా బలమైన మార్కెట్‌ను నిర్మించుకోగలిగినప్పుడే రాచవీధిలో పట్టపుటేనుగు నడిచినంత ఠీవిగా అంతర్జాతీయ సంబంధాల్లో నడవగలం. ఎలుకల మొట్టికాయలు అప్పుడు ఏమీ చేయలేవు!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com