
భారత్‌పై మరో 25% టారిఫ్ మోత మోగించిన అమెరికా అధ్యక్షుడు
మొత్తంగా 50 శాతానికి పెరిగిన అమెరికా సుంకాల భారం
కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసిన అగ్ర రాజ్యాధినేత
రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లపై పట్టరాని కోపంతో పన్నులు పెంచిన తెంపరి ట్రంప్
140 కోట్ల ప్రజానీకం చమురు అవసరాలే ప్రధానమన్న ప్రధాని మోదీ సర్కార్
మిత్రదేశమంటూనే సుంకాల సుత్తితో కొట్టడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన భారత్
న్యూయార్క్/న్యూఢిల్లీ: మెరుపువేగంతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనీ చేశారు. 24 గంటల్లో మళ్లీ భారత్‌పై దిగుమతి టారిఫ్ విధిస్తానని చెప్పినట్టే బుధవారం అదనంగా 25 శాతం సుంకాన్ని మోపారు. వద్దని ఎంతగా వారించినా వైరి దేశం రష్యా నుంచి విపరీతంగా ముడి చమురును కొని, బహిరంగ మార్కెట్లో అమ్ముకుని లాభాల పంట పండిస్తున్నారని ఆరోపిస్తూ భారత్‌పై 25 శాతం టారిఫ్ విధిస్తూ బుధవారం ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వుపై శ్వేతసౌధంలో ఆయన సంతకం చేశారు.
ఇప్పటికే ప్రకటించిన 25 శాతం టారిఫ్ నేటి నుంచి అంటే ఆగస్ట్ ఏడో తేదీ నుంచి అమల్లోకి రానుంది. బుధవారం ప్రకటించిన అదనపు 25 శాతం టారిఫ్‌ను 21 రోజుల తర్వాత అంటే ఆగస్ట్ 27వ తేదీ తర్వాత వర్తింపజేయనున్నారు. ‘‘రష్యా ముడిచమురును ప్రత్యక్షంగా, పరోక్షంగా భారత్ విచ్చలవిడిగా దిగుమతి చేసుకుంటోంది. అందుకే మా చట్టాల ప్రకారం అమెరికా కస్టమ్స్ సుంకాల పరిధిలోకి వచ్చే భారతీయ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌ను మరోసారి పెంచాలని నిర్ణయించాం’’అని కార్యనిర్వాహఖ ఉత్తర్వులో ట్రంప్ పేర్కొన్నారు.
అదనపు టారిఫ్‌లకు స్పందనగా భారత్ ప్రతీకార నిర్ణయాలు తీసుకుంటే వైట్‌హౌస్ అందుకు తగ్గ టారిఫ్‌ల సవరణకు సిద్ధపడుతుందని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది. మిత్రదేశమని కూడా చూడకుండా మితిమీరిన ఆవేశంతో భారత్ వీపు మీద పన్నుల వాత పెట్టి ట్రంప్ తన అగ్రరాజ్య అధిపత్యధోరణిని మరోసారి నిస్సుగ్గుగా ప్రదర్శించారు. స్నేహహస్తమందిస్తూనే సుంకాల సుత్తితో మోదడంపై భారత్ సైతం ధీటుగా, ఘాటుగా స్పందించింది. 140 కోట్ల జనాభా చమురు నిత్యావసరాలు, దేశ ఇంధన భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడబోమని మోదీ సర్కార్ స్పష్టంచేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది.
‘అదనం’అమలుకు మినహాయింపులు
భారత్‌పై అమెరికా బుధవారం ప్రకటించిన ఈ అదనపు 25 శాతం టారిఫ్‌ను వెంటనే వర్తింపజేయబోమని ట్రంప్ సర్కార్ స్పష్టంచేసింది. ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వచ్చిన 21 రోజుల తర్వాత ఈ అదనపు 25 శాతాన్ని భారతీయ ఉత్పత్తులపై వర్తింపజేస్తారు. ఇప్పటికే నౌకల్లోకి ఎక్కించిన సరకుపై ఈ అదనపు 25 శాతం సుంకాన్ని విధించబోరు. అలాగే బుధవారం అర్ధరాత్రిలోపు అమెరికా చేరుకునే ఉత్పత్తులపైనా ఈ అదనపు భారం మోపబోరు. సెప్టెంబర్ 17వ తేదీ అర్ధరాత్రిలోపు అమెరికాలో మార్కెట్లోకి వచ్చేసిన భారతీయ ఉత్పత్తులపై ఈ అదనపు వడ్డింపు ఉండదు.
తాము నష్టపోకుండా ముందుజాగ్రత్త
భారత్‌పై రెట్టింపు పన్నులతో రెచ్చిపోయిన ట్రంప్.. ఈ అదనపు సుంకాలు అమెరికా ఖజానాకు నష్టదాయకంగా మారకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రంగాలవారీగా టారిఫ్ వసూలుచేస్తున్న ఉక్కు, అల్యూమినియంతోపాటు అత్యంత కీలకమైన ఫార్మాస్యూటికల్స్‌పై ఈ అదనపు భారం ఉండబోదని తెలుస్తోంది. తద్వారా అమెరికాలో ధరల పెరగకుండా జాగ్రత్తపడుతున్నారు.
ట్రంప్ విధించిన అదనపు టారిఫ్ కారణంగా భారత్‌లో సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతి సంక్షోభంలో పడనుంది. టెక్స్‌టైల్స్, సముద్ర ఉత్పత్తులు, తోలు, సానబట్టిన వజ్రాలు, రత్నాభరణాల ఎగుమతులపై అదనపు టారిఫ్ భారం పడొచ్చు. దీంతో అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తూత్పత్తుల పరిమాణం సగానికి సగం తగ్గిపోవచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య(ఎఫ్‌ఐఈఓ) ఆందోళన వ్యక్తంచేసింది.
అత్యంత విచారకరమన్న భారత్
అదనంగా 25 శాతం టారిఫ్‌ల గుదిబండ పడేయడంపై భారత్ తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తంచేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ బుధవారం రాత్రి ఒక అధికారిక ప్రకటన విడుదలచేసింది. ‘‘రష్యా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న ముడి చమురునిల్వలను చూసి అమెరికా కళ్లలో నిప్పులు పోసుకుంటోంది. ఈ అంశంలో భారత్ తన వైఖరిని ఇప్పటికే సుస్పష్టంచేసింది. ముడిచమురు వంటి ఇంధన దిగుమతులు అనేవి పూర్తిగా మార్కెట్ ఒడిదుడుకులను అనుసరించి జరుగుతాయి.
దేశ ఇంధన భద్రతే ఏకైక లక్ష్యంగా భారత్ ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. భారత్‌పై అదనపు టారిఫ్ విధించడం ద్వారా ఎక్కువ సొమ్ములు కళ్లజూడాలని అమెరికా ఆశపడటం అత్యంత విచారకరం. ఇలాంటి చర్యలు ఏమాత్రం సబబుగా లేవు. ఇవన్నీ సహేతుకంకాని అన్యాయమైన నిర్ణయాలు. 140 కోట్ల మంది ప్రజల ఇంధన అవసరాలు మా తక్షణ కర్తవ్యం. ఇంతటి అత్యంత కీలకమైన బాధ్యతల నుంచి భారత్ ఏనాడూ పక్కకు తొలగిపోదు.
దేశ ప్రయోజనాలు, ఇంధన సంక్షోభ నివారణ చర్యల విషయంలో భారత్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. విదేశాలు తీసుకునే భారతవ్యతిరేక నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వం తగు కఠిన చర్యలు తప్పక తీసుకుంటుంది. జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటుంది. స్వప్రయోజనాల కోసం ప్రతిదేశం స్వీయ నిర్ణయాలు తీసుకుంటుందని అమెరికా స్ఫురణకు తెచ్చుకుంటే మంచిది’’అని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. గత మూడ్రోజుల్లో ట్రంప్ ప్రభుత్వానికి దీటుగా భారతప్రభుత్వం ఘాటైన జవాబివ్వడం ఇది రెండోసారి.
బ్రెజిల్.. భారత్ ఒక్కటే
అమెరికా దృష్టిలో బ్రెజిల్, భారత్ ఒక్కటేనని తాజా పన్నుల పెంపు పర్వంతో తేలిపోయింది. బ్రెజిల్‌పై అమెరికా ఇప్పటికే 50 శాతం టారిఫ్ విధిస్తుండగా భారత్‌పై తాజా పెంపుతో భారతీయ ఉత్పత్తుల దిగుమతి టారిఫ్ సైతం 50 శాతానికి చేరింది. మయన్మార్ ఉత్పత్తులపై 40 శాతం, థాయిలాండ్ కాంబోడియాలపై 36 శాతం, బంగ్లాదేశ్‌పై 35 శాతం, ఇండోసేసియాపై 32 శాతం, చైనా, శ్రీలంకలపై 30 శాతం, మలేసియాపై 25 శాతం, ఫిలిప్పీన్స్, వియత్నాంలపై 20 శాతం టారిఫ్‌ను అమెరికా విధించిన విషయం విదితమే.