
న్యూఢిల్లీ: స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్‌ను నిషేధించడం మత స్వేచ్ఛను కాలరాయడమేనంటూ అంతర్జాతీయ మత స్వేచ్ఛ(ఐఆర్‌ఎఫ్) సంఘంలో అమెరికా ప్రతినిధి రషద్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ అసహనం వ్యక్తం చేసింది. తమ అంతర్గత వ్యవహారాలపై రెచ్చగొట్టేలా మాట్లాడడం మానుకోవాలంది. దీనిపై కొన్ని దేశాలు చేసిన విమర్శలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ శనివారం తిప్పికొట్టారు. నిజానిజాలు తెలుసుకోకుండా నోరు పారేసుకోవద్దని సూచించారు. వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు అవసరమైన వ్యవస్థలు, యంత్రాంగం తమకు ఉన్నాయన్నారు. ఈ వివాదాన్ని ఓ కుట్రగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అభివర్ణించారు.
సుప్రీంలో పిల్
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అన్ని విద్యా సంస్థల్లోనూ ఉమ్మడి డ్రెస్ కోడ్ అమలయ్యేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మరోవైపు బెంగళూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో నోటీస్ బోర్డుపై హిజాబ్ గురించి అభ్యంతరకరంగా రాశారంటూ తల్లిదండ్రులు నిరసనకు దిగారు. దీనికి బాధ్యురాలిగా ఓ టీచర్‌ను యాజమాన్యం సస్పెండ్ చేసింది.