
‘భార్యాభర్తలన్నాక ఇదంతా మామూలే కదా...’ అన్నాడు గ్రేటర్ నోయిడాలో భార్యను హత్యచేసిన తర్వాత విపిన్ భాటీ అనే యువకుడు. బహుశా హైదరాబాద్‌లోని మేడిపల్లిలో గర్భిణిగా ఉన్న భార్యను గొంతు కోసి చంపి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి మూసీ నదిలో పడేసిన మహేందర్‌రెడ్డిని అడిగినా... భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో రెండేళ్లపాటు భార్యను మానసికంగా, శారీరకంగా హింసించి తిండి కూడా పెట్టకుండా మాడ్చి ఆమె మరణానికి కారణమైన నరేశ్‌బాబును అడిగినా... పెళ్లయిన మూడు నెలలకే భార్యను ఊపిరాడకుండా చేసి చంపేసిన వరంగల్ జిల్లాలోని గణేశ్‌ను అడిగినా... మహబూబ్‌నగర్ జిల్లాలో భార్యను హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేసిన శ్రీశైలంను అడిగినా ఇదే చెబుతాడు.
కేవలం రెండు మూడు రోజుల వ్యవధిలో వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనలు సమస్య తీవ్రతను చాటుతున్నాయి. అదనపు కట్నం కోసమో, అనుమానంతోనో, తమకన్నా అధికంగా సంపాదిస్తున్నదనో భార్యల్ని హింసించడం, హతమార్చటం సర్వసాధారణంగా మారింది. అందుకే ‘భార్యాభర్తలన్నాక ఇదంతా మామూలేగా...’ అనగలిగాడు విపిన్. ఈ ఉదంతాలన్నిటిలో మధ్యవర్తులు రాజీ చేశారని, అంతా బాగానే ఉందనుకున్నామని, ఇంతలోనే ఘోరం జరిగి పోయిందంటూ తల్లి తండ్రులు బావురుమనటం చూస్తాం.
ఒకపక్క ఐపీసీ సెక్షన్ 498–ఏ దుర్వినియోగానికి గురవుతున్నదంటూ పదేళ్ల క్రితం మొదలైన అలజడి పర్యవసానంగా 2014లో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. అటు తర్వాత అరెస్టులు తగ్గిపోయాయనీ, ఇది బాధిత మహిళలకు మరింత సమస్యాత్మకంగా మారిందనీ మహిళా సంఘాలూ, హక్కుల సంఘాలూ అభ్యంతరాలు చెప్పినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు 498–ఏ భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్)లో సెక్షన్ 85గా వచ్చిచేరింది.
జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదికల్లో ప్రస్తావించే వరకట్నం వేధింపు కేసుల సంఖ్య, వాటిల్లో నిందితులు నిర్దోషులుగా విడుదలవుతున్న వైనం చూపి రాజీకి వీలున్న నేరం (కాంపౌండబుల్ అఫెన్స్)గా మార్చాలని గతంలో ప్రయత్నాలు జరిగినా మహిళా ఉద్యమాలతో కేంద్రం వెనక్కి తగ్గింది. సమాజంలోనైనా, కుటుంబా ల్లోనైనా మహిళలపై ఇలాంటప్పుడు నలుమూలల నుంచీ వచ్చే ఒత్తిళ్లు ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలుసు.
భర్త పూర్తిగా మారిపోయాడనీ, ఇకపై జాగ్రత్తగా మసలుకుంటాడనీ ఒత్తిళ్లు తెస్తే సులభంగా కరిగిపోయే భార్యలు కోకొల్లలు. భర్తపై కేసు పెట్టిందని చిన్నచూపు చూసే సమాజం, ఎలాగోలా కాపురాన్ని నిలబెట్టుకోవాలని అయినవారు బతిమాలటం, చంటిపిల్లలతో కోర్టుల చుట్టూ తిరగకతప్పని స్థితి, ఒంటరి మహిళగా బతకటం కష్టమన్న భయాందోళనలూ స్త్రీలు రాజీపడక తప్పనిస్థితిని కల్పిస్తున్నాయి.
విచారణ పూర్తవుతున్న దశలో మాట మార్చటంవల్ల కేసులు వీగిపోతున్నాయి. దారుణ మేమంటే... కన్నకూతురిని హతమార్చాడన్న కోపం కూడా లేకుండా కొన్నిసార్లు తల్లితండ్రులు రాజీ పడుతున్నారు. డబ్బుల వల్లనో, బెదిరింపుల వల్లనో వెనక్కి తగ్గుతున్నారు.
దేశంలో సామాజిక కట్టుబాట్లూ, సంప్రదాయాలూ మహిళల్ని కట్టిపడేసినంతగా మగవాళ్లను పట్టించుకోవటం లేదు. పర్యవసానంగానే ఈ హింసాత్మక ఘటనలు పదే పదే జరుగుతున్నాయి. జరుగుతున్న హింసతో పోలిస్తే పోలీస్ స్టేషన్లకూ, కోర్టులకూ వెళ్లే ఉదంతాల సంఖ్య అత్యల్పం. కులం పేరిట, మతం పేరిట ‘పెద్దలు’ రంగంలోకి దిగి భర్తను మందలించినట్టుగా, అతడు మారాడన్నట్టుగా చూపించి ఇకపై సమస్యలు రావని హామీ ఇస్తున్నారు.
ఇప్పుడు కన్నుమూసిన యువతుల్లో అనేకులు ఆ నరకకూపాల్లోకి మళ్లీ ప్రవేశించి ప్రాణాలు కోల్పోయినవారే. ఇలాంటివి జరిగినప్పుడు గతంలో రాజీకి ప్రయత్నించిన ‘పెద్దల్ని’ కూడా బాధ్యులుగా చేరిస్తే తప్ప ఈ మారణ హోమం ఆగదు. దౌర్జన్యం చేయటం, హింసించటం చట్టం దృష్టిలో నేరం. ఆ నేరాన్ని పోలీసుల వరకూ పోనీయకుండా చేసి, నోళ్లు మూయించి రాజీకి ప్రయత్నిస్తున్న వారు కూడా నేరంలో భాగస్వాములే అని గుర్తించాలి.
అసలు 2022 తర్వాత ఎన్‌సీఆర్‌బీ నివేదికలు కేంద్రం వెలువరించటం లేదు. కనీసం పోలీసుల వరకూ వస్తున్న కేసుల గణాంకాలైనా తెలియక పోతే సమాజాన్ని పీడిస్తున్న సమస్యపై కఠిన చట్టాలతోపాటు ఇతరత్రా ఏం చేయాలో ఆలోచించటం ఎలా సాధ్యం? విపిన్ లాంటివాళ్లు భార్యల్ని హింసించడం మామూలే అన్న ధోరణికి పోవటాన్ని చూసైనా తీరు మార్చుకోవాలి. మౌనంగా ఉండిపోయి మనమంతా పరోక్షంగా ఆ నేరాల్లో భాగస్వాములమవుతున్నామని గుర్తుంచుకోవాలి.