తీరి కూర్చుని సమస్యలు తెచ్చుకోవటంలో, ఉన్నవాటిని పెంచుకోవటంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్‌కు ఎవరూ సాటిరారు. స్వీయ సమర్థతపై అతిగా అంచనా వేసుకుని ఆయన తీసుకుంటున్న వరస నిర్ణయాలు ఫ్రాన్స్‌ను నిలువునా ముంచేశాయి. పీఠమెక్కి నిండా నెల రోజులు కాకుండానే ప్రధాని సెబాస్టిన్ లెకొర్నూ సోమవారం నిష్క్రమించటం వాటి పర్యవసానమే.
లెకొర్నూ కేబినెట్ ఏర్పాటు ప్రయత్నంలో మెక్రాన్ తలదూర్చి, తన అనుకూలురకు పదవులు ఇప్పించేందుకు ప్రయత్నించారు. కూటమిలోని ఇతర పక్షాలకు దీంతో ఆగ్రహం కలిగి బడ్జెట్‌కు మద్దతునీయబోమనీ, అవిశ్వాస తీర్మానం తెస్తామనీ చెప్పటంతో లెకొర్నూ రాజీనామా తప్పలేదు. మరో రెండు నెలల్లో బడ్జెట్ ఆమోదించకపోతే దేశం దివాలా స్థితిలో పడుతుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుండగా, తదుపరి ఏం చేయాలన్నది మెక్రాన్‌కు సైతం బోధపడటం లేదు.
కరోనా మహమ్మారి కాటేయకముందు యూరప్‌లో జర్మనీ తర్వాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఫ్రాన్సే. ఆ తర్వాత పల్టీలు కొట్టడం ప్రారంభమైంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం దాన్ని మరింత దెబ్బతీసింది. జర్మనీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తూ ఏదోమేరకు సఫలీకృతమవుతుంటే, ఫ్రాన్స్ మాత్రం గుడ్లు తేలేస్తోంది. అక్కడ పాలన అసాధ్యమైన స్థితికి చేరుకుంది.
సామాజిక అశాంతి పెరగటం, నిజ వేతనాలు పడిపోయి ఉద్యోగ వర్గాల ఆగ్రహావేశాలూ, ఉపాధి కొరవడి యువత నిరాశ, ఆకాశాన్నంటుతున్న ధరలూ, అంతంతమాత్రంగా ఉన్న మార్కెట్లూ ఫ్రాన్స్‌ను కుంగదీస్తుండగా పులి మీద పుట్రలా ఈ రాజకీయ సంక్షోభం ముంచుకొచ్చింది. ఫ్రాన్స్ చరిత్రలో ఇలాంటి పరిస్థితి రాలేదని కాదు. 1946–58 మధ్య ఆ దేశం 22 ప్రభుత్వాలను చూసింది.
ఎవరికీ మెజారిటీ రాని దశలో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వాలు పేకమేడల్లా కూలిపోవటమే అందుకు కారణం. పర్యవసానంగా అప్పటి అధ్యక్షుడు చార్లెస్ డీగాల్ భవిష్యత్తులో ఇంకెప్పుడూ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడకుండా నిరోధించేందుకు రాజ్యాంగాన్ని సవరించారు. అటుతర్వాత కూటమికి నాయకత్వం వహించే ప్రధాన పార్టీ మాటే
చెల్లుబాటు కావటం రివాజైంది. ఇప్పుడు ఆయన్ను అనుకరించబోయి మెక్రాన్ బోర్లాపడుతున్నారు.
ఫ్రాన్స్ కష్టాలకు కేవలం మెక్రాన్ ఒక్కరే కారణం కాదు. కానీ వాటిని మరిన్ని రెట్లు పెంచటంలో ఆయన పాత్ర కాదనలేనిది. 577 మంది సభ్యులుండే దిగువ సభ అసెంబ్లీ నేషనల్‌లో పాలక పక్షంగా అవతరించాలంటే కనీసం 289 మంది మద్దతు అవసరం. నిరుడు జూలైలో జరిగిన ఎన్నికల్లో వామపక్షాల సారథ్యంలోని న్యూ పాపులర్ ఫ్రంట్ 182 స్థానాలతో అగ్రభాగంలో ఉంది. మెక్రాన్ నాయకత్వంలోని మధ్యేవాద కూటమి ఎన్‌సెంబుల్‌కు 168 లభించాయి.
వలసలను వ్యతిరేకించే తీవ్ర మితవాద పక్షం నేషనల్ ర్యాలీ(ఆర్‌ఎన్) 143తో సరిపెట్టుకుంది. తొలి దశలో అందరికన్నా అత్యధిక శాతం ఓట్లు రాబట్టిన ఆర్‌ఎన్‌ను అధికారంలోకి రానీయకుండా రెండో దశలో వామపక్ష, మధ్యేవాద పార్టీలు అనుసరించిన సర్దుబాటు వ్యూహం ఫలించింది. కానీ ప్రభుత్వ ఏర్పాటులో మెక్రాన్ దీన్ని విస్మరించారు. తన విధానాలను వ్యతిరేకించే వామపక్షాలకు అధికారం అప్పగించరాదన్న కృతనిశ్చయంతో మధ్యేవాద పక్షాలతో ప్రయోగాలు మొదలుపెట్టారు. పర్యవసానంగా ఏడాదిలో ముగ్గురు ప్రధానులు వచ్చారు.
పార్లమెంటు రద్దు చేయొద్దని అందరూ ఇచ్చిన సలహాను నిరుడు మెక్రాన్ బేఖాతరు చేశారు. ఎన్నికల తర్వాత మధ్యేవాద పక్షాలు పుంజుకుంటాయనీ, అప్పుడు తాననుకున్న రీతిలో పెన్షన్ల కోత, సంపన్నులకు రాయితీలు, ప్రభుత్వ వ్యయం అదుపు వగైరాలు అమలు చేయొచ్చనీ ఆయన భావించారు. కానీ అదంతా అడియాస అయింది.
ఇప్పుడు నిజంగానే పార్లమెంటు రద్దు చేయక తప్పని స్థితి ఏర్పడింది. కానీ అలా చేస్తే ఆర్‌ఎన్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచే స్థాయికి పుంజుకోవచ్చనీ, దాని ప్రభావం 2027లో జరిగే అధ్యక్ష ఎన్నికలపై పడుతుందనీ మెక్రాన్ ఆందోళన. తక్షణ కర్తవ్యమైన బడ్జెట్ ఆమోదానికి తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై ఆయనకు స్పష్టత కొరవడింది. ఏతావతా ఫ్రాన్స్ కింకర్తవ్య విచికిత్సలో పడింది.


