
అనుకున్నదొకటైతే అయింది మరోటి. బిహార్‌లో ఆఖరి నిమిషంలో ఆదరాబాదరాగా ఎన్నికల సంఘం (ఈసీ) తలపెట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆ సంస్థ ప్రతిష్ఠను మరింత దెబ్బ తీసింది. ఓటర్లలో దొంగలున్నారన్న నిర్ణయానికొచ్చి, వారందరినీ ఏరిపారేయాలను కోవటం దీనంతటికీ కారణం. పోనీ అందుకు ప్రాతిపదికేమిటో ఎవరికీ తెలియదు.
ఏడెనిమిది నెలల క్రితం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తానే రూపొందించిన జాబితాలో అవకతవకలున్నాయని అంగీకరించటమంటే తన పనితీరు సరిగా లేదని ఒప్పు కోవటమేనని ఆ సంస్థకు తోచలేదు. 2.74 కోట్ల మంది ఓటర్లలో 99.5 శాతం మంది తమ అర్హతలకు సంబంధించిన పత్రాలు సమర్పించారని ఈసీ సర్వోన్నత న్యాయస్థానానికి చెప్పగా ముసాయిదా జాబితా అవకతవకలు ఒక్కోటే బయటపడి దిగ్భ్రాంతి కలిగి స్తున్నాయి.
అర్హులైన ఓటర్లు ఈసీ అడిగిన 11 పత్రాల్లో ఏదో ఒకటైనా దాఖలు చేయటానికి తిప్పలు పడుతుంటే అనర్హులైనవారు, అనుమానాస్పద వ్యక్తులు దర్జాగా జాబితాలో చోటు దక్కించుకున్నారు. కేవలం 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మీడియా సంస్థ ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ నిశితంగా పరిశీలిస్తే అనేక అవకతవకలు బయటపడ్డాయి.
ఒకే పేరు,తండ్రి/భర్త పేర్లు ఉండి కనీసం రెండు నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాకెక్కిన 1,87,643 కేసుల్ని ఆ సంస్థ బయటపెట్టింది. కొందరైతే ఒక నియోజకవర్గంలోనే నదురూ బెదురూ లేకుండా ఆ పని చేశారు. మరికొందరు చిరునామాలు మార్చే శ్రమ కూడా తీసుకోలేదు.
‘స్వచ్ఛమైన జాబితా’ రూపకల్పనే ధ్యేయమంటున్న ఈసీ ఈ దొంగ ఓటర్ల విజృంభణకు ఏం సంజాయిషీ ఇస్తుంది? కనీసం అలాంటి విపరీతాలకు కారణమైనవారిపై చర్య తీసుకుంటామని చెప్పటం లేదు. పైగా బిహార్ ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) ‘రిపోర్టర్స్ కలెక్టివ్’ వెల్లడించిన అంశాలను ఖండించారు. ఈ క్రమంలో వారు ఎక్కడెక్కడ పొరబడ్డారో చెప్పేందుకు కూడా ప్రయత్నించలేదు.
తనకున్న పరిమిత వనరులతో కేవలం 39 చోట్ల ముసాయిదాలో ఒక సంస్థ ఇన్ని లోపాల్ని పసిగట్టగలిగితే, ఓటర్లు అందజేసిన అర్హతా పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి నిగ్గుదేల్చే పనిలో తలమునకలైవున్న వేలాదిమంది ఎన్నికల సిబ్బంది ఏం పనిచేస్తున్నట్టు? వారిపై అధికార పక్షాల ఒత్తిళ్లు న్నాయా? ముసాయిదాలో తొలగించిన 65 లక్షల మందీ ఈసీ దృష్టిలో నకిలీ ఓటర్లు.
అందుకోసమే వారి వినతుల్ని పరిశీలించటానికి మొదట్లో ఆ సంస్థ సిద్ధపడలేదు. అందు కోసం సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గడువు ముగిసిన సోమ వారం నాటికి కేవలం 33,000 మంది మాత్రమే పత్రాలు సమర్పించారని ఈసీ చెబుతోంది.
పొట్ట చేతబట్టుకుని నలు మూలలకూ పోయే సాధారణ కూలీలు, కార్మికులు తమ చిరునామాల్లో ఉండటం, ఈసీ అడిగిన పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించటం అంత తేలికా? చిరునామాల్లో లేకపోతే మరణించినట్టు లేదా శాశ్వతంగా ఆ చిరునామా నుంచి నిష్క్రమించినట్టు ఎన్నికల సిబ్బంది రాసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
అయితే ‘ఓట్ చోరీ’ నినాదంతో ఉద్యమిస్తున్న విపక్షాలు సైతం ఆ సమస్య విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలి. సర్వోన్నత న్యాయస్థానం చెప్పినట్టు రాజకీయ పక్షాలు చురుగ్గా కదలాలి. తమ కార్యకర్తల సాయంతో అర్హులైనవారు ఓటర్ల జాబితాలకెక్కేలా సాయపడాలి.
ఈ మొత్తం వ్యవహారంలో ఎవరిది పైచేయి అవుతుందన్న ప్రశ్న అర్థరహితం. ఎన్నికల నిర్వహణ క్రతువులో తలమునకలై ఉండాల్సిన ఈసీ జవాబుదారీతనాన్ని ప్రదర్శించాలి. నిలదీస్తున్నదెవరన్న విచికిత్సకు పోకుండా నిజాన్ని నిగ్గుతేల్చి తేల్చాలి.
ఎందుకంటే రాగల కాలంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ‘సర్’ అమలు ప్రారంభ మవుతుందని ఆ సంస్థే చెబుతోంది. ప్రతిచోటా ఇదే మాదిరి తప్పుల తడకలతో ఆ ప్రక్రియను సాగిస్తే ఈసీ దేశ ప్రజల దృష్టిలో మాత్రమే కాదు... ప్రపంచ దేశాల ముందు కూడా పలచనవుతుంది.
ఓటర్ల జాబితాలో చేరటానికి విధించిన గడువును పొడిగించుకుంటూ పోతే మొత్తం ప్రక్రియ గందరగోళంగా తయారై, తుది జాబితా ఖరారు సమస్యా త్మకమవుతుందంటున్న ఈసీ వాదనల్లో నిజం లేకపోలేదు. కానీ అందుకు బాధ్యత వహించాల్సింది తాను కాదా? అసలు ఎవరూ కోరకుండానే చివరి నిమిషంలో ఈ పెనుభారాన్ని నెత్తిన వేసుకున్నదెవరు? ఈసీ ఆత్మపరిశీలన చేసుకోవాలి.