
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ గాజాలో కొనసాగిస్తున్న మారణకాండను ఆపదల్చుకోలేదని తాజా అమానుష ఉదంతం రుజువు చేస్తోంది. నిరాయుధ పౌరులనూ, మరీ ముఖ్యంగా స్త్రీలనూ, పిల్లలనూ హతమార్చటం ఇజ్రాయెల్ సైన్యానికి గత ఇరవైయ్యొక్క నెలలుగా రివాజుగా మారినా... ఆదివారం జరిగిన ఘోరం అత్యంత హేయమైనది.
ఐక్యరాజ్యసమితి సంస్థ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పీ) ఆధ్వర్యాన ఆహార పంపిణీ మొదలుపెట్టబోతుండగా పౌరు లను చుట్టుముట్టి శతఘ్నులతో, స్నైపర్లతో విరుచుకుపడి 90 మందికిపైగా పౌరుల్ని ఇజ్రాయెల్ సైన్యాలు పొట్టనబెట్టుకున్నాయి. 2023 అక్టోబర్ 7న తమ భూభాగంలోకి అడుగుపెట్టి 1,200 మంది పౌరులను కాల్చిచంపి, మరో 251 మందిని అపహరించిన మిలిటెంట్ సంస్థ హమాస్‌ను తుదముట్టించటానికి దాడులంటూ మొదట్లో చెప్పిన ఇజ్రాయెల్ ఆనాటినుంచి మారణకాండ కొనసాగిస్తూనే ఉంది.
అధికారిక లెక్క ప్రకారం ఇప్పటికి 60,000 మంది పౌరులు మరణించారంటున్నా... అంతర్జాతీయ మేగజిన్ లాన్సెట్ నిరుడు జూన్‌లో ప్రకటించిన నివేదిక అది దాదాపు రెండు లక్షలంటోంది. మధ్యధరా సముద్ర తీరానవున్న గాజా స్ట్రిప్ అనే చిన్న ప్రాంతాన్ని వదిలి రావటానికి ససేమిరా అంటున్న స్థానికులను హతమార్చయినా ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ప్రయ త్నిస్తోంది. ఆ ప్రాంతాన్ని సైతం తమ దేశంలో విలీనం చేసుకోవాలన్నది దాని ఆంతర్యం.
గతంలో పాలస్తీనాపై విరుచుకుపడినప్పుడల్లా ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని 51వ అధికర ణాన్ని ఇజ్రాయెల్ ప్రస్తావించేది. సాయుధ ముఠాలు దాడులకు దిగితే ఆత్మరక్షణ చేసుకునే హక్కు దేశాలకుంటుందని ఆ అధికరణ చెబుతోంది. కానీ పాలస్తీనాలో తనదికాని భూభాగాన్ని ఆక్రమించుకుని, దాన్ని విస్తరించాలనుకున్నప్పుడల్లా ఇజ్రాయెల్ ఈ అధికరణను సాకుగా చూపుతోంది.
హమాస్ సంస్థ దాడుల్ని ఎవరూ సమర్థించరు. ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని చెబుతూ వారికే నష్టం కలిగించే ఆ సంస్థ చర్యల్ని మొదటినుంచీ అందరూ వ్యతిరేకి స్తున్నారు. కానీ గత 21 నెలలుగా ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండ మాటేమిటి? కేవలం 365 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంగల చిన్న ప్రాంతంపై యుద్ధ విమానాలతో, బాంబులతో, క్షిపణులతో దాడులు సాగించటం ఏ అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం సబబవుతుంది?
ఇజ్రాయెల్ మిత్ర దేశమన్న సాకుతో పెద్ద పెద్ద దేశాలే అది సాగిస్తున్న మారణకాండను విస్మ రిస్తున్న తరుణంలో ఇటీవల 12 చిన్న దేశాలు కొలంబియాలోని బగోటాలో అత్యవసర శిఖరాగ్ర సదస్సు నిర్వహించి కార్యాచరణకు దిగబోతున్నట్టు ప్రకటించటం ఉన్నంతలో వూరటనిచ్చే అంశం. బొలీవియా, కొలంబియా, క్యూబా, ఇండొనేసియా, ఇరాక్, లిబియా, మలేసియా, నమీ బియా, నికరాగువా, ఒమన్, సెయింట్ విన్సెంట్, దక్షిణాఫ్రికాలు వీటిలో వున్నాయి.
ఈ సమావేశానికి హాజరైనా, అది విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై సంతకం చేయాలా వద్దా అన్న మీమాంసలో పడిన మరో 20 దేశాలు వచ్చే సెప్టెంబర్‌కల్లా ఏ సంగతీ తేల్చాలని సదస్సు గడువు విధించింది. ఇజ్రాయెల్‌పై దక్షిణాఫ్రికా ఇప్పటికే అంతర్జాతీయ నేర న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. తనదికాని ఒక ప్రాంతంపై దండెత్తి, అక్కడి పౌరులు ఎటువైపు కదలాలో హుకుం జారీ చేసే ఇజ్రాయెల్ ఆగడం నాగరిక ప్రపంచ ఉనికికే పెను సవాలు.
ఇజ్రాయెల్ ఇష్టారాజ్యంగా మానవ హననానికి పాల్పడుతుంటే చూస్తూ కూర్చున్న దేశాలకు కూడా రేపన్నరోజు ఇదే గతి పట్టదన్న గ్యారెంటీ ఏం లేదు. అందుకే అంతర్జాతీయ చట్టాలకూ, ఐక్యరాజ్యసమితి చార్టర్లకూ, మానవ హక్కులకూ ఇజ్రాయెల్ పెనుముప్పుగా మారిందని 12 దేశాల సదస్సు వ్యాఖ్యానించింది.
అయితే ఇజ్రాయెల్ ఏం చేసినా సమర్థించటం అలవాటైన అమెరికాను కాదని ఎన్ని దేశాలు ఈ సదస్సుతో గొంతు కలుపుతాయన్నది ప్రశ్నార్థకం. ఇప్పటికే ‘ఇంకా’ సంతకం చేయని దేశాలకు దూతల్ని పంపి ‘దారికి తేవాలని’ అమెరికా నిర్ణయించుకుంది. ఈ సదస్సుపై ట్రంప్ కారాలూ మిరియాలూ నూరుతున్నారు.
రెండో ప్రపంచ యుద్ధానంతరం ఉనికిలోకొచ్చిన అంతర్జాతీయ సంస్థలు మొదటినుంచీ ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తున్నాయి. అందరికీ ఒకే న్యాయం భావన వదిలి సంపన్న దేశాలతో ఒక విధంగా, బడుగు దేశాలతో మరో రకంగా ప్రవర్తిస్తున్నాయి. అందువల్లే ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి తదితర వేదికలపై ఇప్పుడెవరికీ పెద్దగా భ్రమలు లేవు. ఉన్నంతలో కొలంబియా సదస్సు ఒక ఆశాకిరణం.
ఆహార పంపిణీ కేంద్రాలు ఐక్యరాజ్యసమితి సంస్థల కనుసన్నల్లోనే వుంటున్నా అవి పాలస్తీనా ప్రజల పాలిట ఉచ్చుగా మారుతున్నాయి. ఆసుపత్రులు, శరణార్థ శిబిరాలు మాత్రమే కాదు.. చివరకు ఆహార పంపిణీ కేంద్రాలు సైతం ఇజ్రాయెల్ సైనికుల దాడులకు లక్ష్యమవుతున్నాయి. ఆకలితో నకనకలాడుతూ తిండికోసం జనం ఒకచోట గుమిగూడినప్పుడు కాల్చి చంపితే గాజాను ఖాళీ చేయించాలన్న తమ పథకం పారుతుందని ఇజ్రాయెల్ భావిస్తున్నట్టుంది.
ఒకనాడు నాజీ జర్మనీ లక్షలాదిమంది యూదుల్ని చిత్రహింసల శిబిరాలకు చేర్చి అమానుషంగా అంతమొందించింది. ఆ తరహాలోనే పాలస్తీనాలో రఫా వంటి చోట్ల శిబిరాల నిర్మాణం మొదలైంది. మరో జనహననాన్ని నాగరిక ప్రపంచం సహిస్తుందా? ప్రపంచ ప్రజానీకం మేల్కొని తమ తమ దేశాల్లోని ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తే తప్ప ఇజ్రాయెల్ దురాగతాలు ఆగవు.