
రెండేళ్ల నుంచి అవిచ్ఛిన్నంగా క్షిపణులు, బాంబుల వర్షంతో కంటిమీద కునుకు లేకుండా గడిపిన గాజా ఇకపై గుండెల నిండా ఊపిరి పీల్చుకోనుంది. హమాస్– ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోయిందనీ, ఇరు పక్షాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయనీ, శాంతి ప్రణాళికలో ఇది తొలి దశ అనీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన గమనిస్తే పూర్తిస్థాయి శాంతి స్థాపనకు మరికొంత సమయం పట్టొచ్చని స్పష్టంగానే తెలుస్తోంది. ఇంత హడావిడిగా సంధి కుదిరినట్టు ప్రకటించటం వెనక శుక్రవారం ప్రకటించబోయే నోబెల్ శాంతి బహుమతికి అర్హత సాధించటం కోసమేనని అందరికీ తెలుసు.
ట్రంప్ అందుకు అర్హుడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సిఫార్సు చేస్తున్నారు. తమ భూభాగంలోకి చొరబడి 2023 అక్టోబర్ 7న 1,100 మంది పౌరులను హతమార్చి, 251 మందిని అపహరించుకుపోయిన హమాస్ దుందుడుకు చర్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ 24 నెలల పాటు గాజాపై నిప్పుల వాన కురిపించింది. ఏ క్షిపణి ఎక్కడ పడుతుందో, ఏ బాంబు ఎవరి ప్రాణం తీస్తుందో తెలియక గాజా వాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు.
జనావాస ప్రాంతాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా క్షిపణులు ప్రయోగించటం, ఆకాశాన్నంటే అపార్ట్‌మెంట్లు క్షణంలో కూలి శిథిలాల గుట్టగా మారటం ప్రపంచ ప్రజలంతా చూశారు. కనీసం ఇద్దరో ముగ్గురో మరణించని కుటుంబం లేదు. కొన్ని కుటుంబాలైతే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మధ్యలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాలు... ఇజ్రాయెల్ ఉల్లంఘనల వల్ల పెద్దగా ఉపశమనం ఇచ్చింది లేదు.
దీన్ని యుద్ధం అనడం ఇజ్రాయెల్ సాగించిన నరమేధాన్ని కప్పిపుచ్చే యత్నమే అవుతుంది. బలాబలాల్లో ఎంత వ్యత్యాసం ఉన్నా రెండు దేశాల మధ్య పరస్పరం కొన సాగే ఘర్షణల్ని యుద్ధం అంటారు. ఇక్కడ జరిగిందంతా వేరు. ఇజ్రాయెల్ లోపాయకారీ మద్దతుతో ఎన్నికల ద్వారా అధికారం చేజిక్కించుకుని గాజా ప్రజలపై పెత్తనం సాగిస్తూ, పాలస్తీనా అథారిటీని బేఖాతరు చేస్తూ వచ్చిన హమాస్ ఉన్నట్టుండి ఉగ్రవాద దాడికి పూనుకొంది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో అధికారిక లెక్కల ప్రకారమే 67,183 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
మరో 1,69,841 మంది గాయాల పాలయ్యారు. వైద్య సిబ్బంది, పాత్రికేయులన్న విచక్షణ లేకపోగా, చాలా సందర్భాల్లో వారిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యాలు హతమార్చటం ఆధునిక చరిత్రలో కనీవినీ ఎరుగనిది. దాడులు ఆగుతాయంటున్నారు గనుక శిథిలాల తొలగింపు మొదలవుతుంది. అప్పుడు గానీ మృతుల అసలు సంఖ్య ఎంతో తెలియకపోవచ్చు. ఇప్పటికీ ఆచూకీ తెలియనివారు వేలల్లో ఉన్నారు.
ఇజ్రాయెల్ ఘాతుకాల వెనక జాత్యహంకారం స్పష్టంగా కనబడుతుండగా, ఆ దుండగాన్ని ధర్మబద్ధంగా వ్యతిరేకించినవారిని యూదులపై వివక్ష ప్రదర్శిస్తున్నవారిగా జమకట్టి వేధించటం, విశ్వవిద్యాలయాల్లోకి పోలీసులు చొరబడి అరెస్టులు చేయటం ట్రంప్ నైజానికి అద్దం పడుతుంది. గాజాలో హమాస్ ఒక్కటే లేదు. పాలస్తీనా విమోచన కోసం పోరాడే సంస్థలు డజను వరకూ ఉన్నాయి.
ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వెనక్కి పోలేదు. గాజాలోనే ఒక హద్దు నిర్ణయించుకుని ఆగింది. ఇప్పుడు కుదిరిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఎంతవరకూ గౌరవిస్తుందో తెలియదనీ, ఒప్పందంలోని చాలా క్లాజులు అస్పష్టతతో ఉన్నా కేవలం ట్రంప్ హామీని నమ్మి సమ్మతించామనీ ఆ సంస్థల ప్రతి నిధులు చెబుతున్న తీరు గమనార్హం.
ట్రంప్‌కు నోబెల్ వస్తే తప్ప ఈ ఒప్పందం సజావుగా ముందుకు పోదు. రెండో దశ చర్చల్లోనే అసలు అంశాలు ప్రస్తావనకొస్తాయి. అప్పుడు మరణమో, శరణమో పాలస్తీనా సంస్థలు తేల్చుకోక తప్పదు. ట్రంప్‌కు పురస్కారం లభిస్తే గాజా వాసులకు ఉన్నంతలో గౌరవప్రదమైన పరిష్కారం దొరకొచ్చు. రాకపోతే పరిణామాలు వేరుగా ఉండే అవకాశం ఉంది. అయితే నరమేధాన్ని కొనసాగించటం ఇక సాధ్యపడకపోవచ్చు.
ఎందుకంటే హమాస్ చెరలోని బందీలంతా విడుదలయ్యారు. అటు ఇజ్రాయెల్ జైళ్లలోని పాలస్తీనా పౌరులు దాదాపు 2,000 మంది విడుదలవుతున్నారు. గాజా విషయంలో ఐక్యరాజ్య సమితిలో అమెరికా, ఇజ్రాయెల్ ఒంటరిగా మిగిలిపోయిన కొన్ని రోజులకే ఆ రెండు దేశాలూ తమకేం పట్టనట్టు ఈ శాంతి ఒప్పందం సాధించటం ఒక వైచిత్రి.