
‘మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు, మానవుడే మాననీయు’డంటాడు కవి ఆరుద్ర ఒక సినీ గీతంలో! సందేహమేముంది? ఆయనే అన్నట్టు, మంచిని తలపెడితే మనిషికి అడ్డే లేదు, దివిజ గంగ భువి దించిన భగీరథుడు మానవుడే, సృష్టికి ప్రతిసృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే; చంద్రలోకమైన, దేవేంద్రలోకమైన బొందితో జయించి భువికి తిరిగి రాగలిగినవాడూ మానవుడే! కానీ, అంతటి మహనీయుడు కూడా ఒక్కోసారి దయనీయుడైపోతాడు.
ఎంతో ముందుకు చూడగలిగి కూడా తరచూ హ్రస్వ దృష్టికి లోనవుతాడు. పదిమందికీ మంచిని తలపెట్టేవాడు కూడా స్వప్రయోజనాన్ని మరిగి చివరికి సొంతానికే చేటు తెచ్చుకుంటాడు. సర్వతోముఖ వికాసం మనిషికి వరమే కానీ, తనకు తనే చెరుపు చేసుకునే బహుముఖ వైఫల్యం పెనుశాపం.
అసాధారణ వర్షాల కారణంగా హిమాలయ ప్రాంత రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. హఠాత్తుగా అతివృష్టి, మెరుపు వరదలు, మట్టిపెళ్ళలు విరిగిపడటం వగైరా ఉత్పాతాల కారణంగా ఈ సంవత్సరం ఇప్పటికి దాదాపు మూడు వేల మంది మరణించారు, లక్షల కోట్ల విలువైన ఆస్తినష్టం సంభవించింది.
అడ్డూ అదుపూ లేని పట్టణాభివృద్ధి, అడవుల నిర్మూలన, రోడ్ల నిర్మాణం, విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన అభివృద్ధి చర్యలను ఇందుకు కారణంగా పర్యావరణ వాదులు ఎత్తిచూపుతున్నారు. ఇటువంటివి లేని రోజుల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగిన సంగతిని కొందరు ఉదాహరిస్తున్నారు. కారణమేమైనా ప్రాణనష్టం, ఆస్తినష్టం కళ్లముందు కటిక నిజాలు.
పటిష్ఠమైన ముందస్తు హెచ్చరిక యంత్రాంగాన్ని ఇప్పటికీ ఏర్పరచుకోలేక పోవడం – దీనంతటి వెనుకా మహనీయుడైన మానవుడి పరంగా చెప్పుకోవలసిన ఒకానొక వైఫల్యం. దీనికితోడు, దేశంలో ప్రకృతి విపత్తులకు గురికాగల ప్రాంతాల గురించిన గణాంకాలు గుండె గుభేలుమనిపిస్తాయి. ఏకంగా 27 రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలూ ఇందులోకి వస్తాయి. వ్యవసాయ యోగ్యమైన 68 శాతం భూమి ఏ క్షణంలోనైనా అనావృష్టికి గురికావచ్చు, 15 శాతం ప్రాంతంలో ఉన్నట్టుండి రాళ్ళవర్షం కురవచ్చు, 12 శాతం ప్రాంతంలో మెరుపు వరదలు సంభవించవచ్చు. ఈ విపత్తులు ఏటా పెరగడమే తప్పే తగ్గే అవకాశం లేదట!
శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధిలో మానవుడి బుద్ధి ఎంతో చురుగ్గా పని పనిచేయడం ఎంతైనా శ్లాఘనీయమే; అభివృద్ధిని ప్రజలకు మరింత సుఖమయ జీవన యోగ్యంగా మలచే దిశగా శరవేగంతో కదలడమూ అభినందనీయమే; కానీ, దానిని అంటిపెట్టుకుని వచ్చే సమస్యల నివారణలో మాత్రం అతని అడుగు చురుగ్గా పడటం లేదు. దాంతో అభివృద్ధి అస్తవ్యస్తానికీ, అభద్రతకూ చిరునామా అవుతోంది. దేశంలోని మహా నగరాలలో రోడ్ల పరిస్థితే ఇందుకు మరో ఉదాహరణ.
ఆయా నగరాలలో జనాభా పెరుగుదలా, కొత్త జనావాసాల విస్తరణా, రాకపోకల అవసరాలూ, వాహనాల పెంపూ విమాన వేగాన్ని అందుకున్నాయి; కానీ, ఆ దామాషాలో రోడ్ల నిర్వహణా, ఇతర వసతుల కల్పనలో ప్రభుత్వాల ప్రణాళికలు ఎడ్లబండి వేగంతో నడుస్తున్నాయి. అనేక నగరాలలో రాకపోకల రద్దీ ఎంతటి సమస్యాత్మక స్థాయికి చేరిందంటే, జనం గంటల తరబడి కాలాన్ని ట్రాఫిక్ జామ్ లోనే గడపవలసి వస్తోంది, ఎంతో విలువైన ఉత్పాదక సమయం రోడ్లపాలైపోతోంది.
రకరకాల జీవనోపాధి పనుల మీద తిరిగే జనాలను అది మానసికంగా విపరీతమైన ఒత్తిడికి గురిచేసి ఆర్థిక సమస్యలతోపాటు ఆరోగ్య సమస్యలనూ తెచ్చిపెడుతోంది. ఈ ఏడాది తొలి అయిదారు మాసాల్లోనే దేశవ్యాప్తంగా నగరాల రోడ్లపై సంభవించిన దుర్ఘటన మరణాలు వేలసంఖ్యను దాటిపోయాయి. అయినాసరే, పౌరరవాణా సదుపాయాల అభివృద్ధీ వగైరాలు కాగితాల దశను దాటి కార్యరూపం ధరించడానికి ఏళ్లూపూళ్లూ పట్టిపోతోంది.
మొత్తంమీద కవి చెప్పినట్టు గ్రహరాశుల నధిగమించి ఘనతారల పథము తొక్కగలిగిన మహనీయుడే తన లోకాన్ని సర్వతోభద్రంగా మార్చుకోవడంలో విఫలమవుతున్నాడు. మనిషి జైత్రయాత్రలో ఎక్కడో అడుగు తడబడి అపజయపు దారి పడుతోంది. తనను దయనీయుడిగా రూపుకట్టే ఆ తడబాటును సరిదిద్దుకుని మహనీయుడన్న ఖ్యాతి నిలుపుకోవడం మనిషి తక్షణావసరం