
జనతంత్రం
నవరాత్రి ఉత్సవాలు మొదలుకొని దీపావళి పండుగ ముగిసే వరకూ ఈ నెల రోజుల సీజన్‌ను ఎన్డీఏ సర్కార్ హైజాక్ చేసింది. జీఎస్టీ పేరుతో వసూలు చేస్తున్న పన్నులను హేతుబద్ధీకరణ చేయడం వల్ల పేద, మధ్య తరగతుల ప్రజలకు బాగా ఆదా అవుతుందనీ, అందువల్ల ఈ సీజన్‌ను పొదుపు ఉత్సవంగా పాటించాలనీ దేశ ప్రజలకు ఎన్డీఏ సర్కార్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రభుత్వాలు అధికారిక కార్యక్రమాలను కూడా ప్రకటించాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ దీంతో పాటు మరో అంశాన్ని కూడా జోడించింది. అయితే దాన్ని అధికారిక కార్యక్రమాల్లో కలపకుండా పార్టీ వేదికల ద్వారా ప్రచారం చేసుకోవాలని సంకల్పించారు. వసూలు చేసిన కరెంటు బిల్లుల్లో యూనిట్‌కు 13 పైసల చొప్పున తిరిగి వినియోగదారులకు జమ చేస్తారట! దీన్నే ట్రూ–డౌన్ అంటున్నారు. ఇది చరిత్ర ఎరుగని మహత్కార్యం అన్నట్టు ముఖ్యమంత్రి ట్వీట్ కూడా చేశారు.
నిజంగా ఇవి సంబరాలు చేసుకోదగిన సందర్భాలేనా? ఒంటినిండా వాతలు పెట్టి అక్కడక్కడా ఆయింట్‌మెంట్ రాస్తే ఉపశమనం లభించినట్టేనా! ఆ బాధితుడు అందుకు కృతజ్ఞతగా ఎగిరి గంతేసి పండుగ చేసుకోవాలా? జీఎస్టీని హేతుబద్ధం చేస్తున్నారంటే ఎనిమిదేళ్ల నుంచి అనుసరిస్తున్న విధానం నిర్హేతు కమైనదని అంగీకరించినట్టే కదా! ఈ ఎనిమిదేళ్లుగా సాధారణ ప్రజల రక్తాన్ని తాము జలగల్లా పీల్చుకున్నామని పరోక్షంగా చెప్పినట్టే కదా! ఈ హేతుబద్ధీకరణ వలన ప్రజలకు రెండున్నర లక్షల కోట్ల మేరకు లబ్ధి జరుగుతుందని ప్రధానమంత్రి ప్రకటించారు. దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి.
ఇందులో మళ్లీ కొన్ని మెలికలున్నాయి. అందువల్ల ప్రభుత్వం చెబుతున్నంత స్థాయిలో ఉపశమనం కలుగదనే వాదన ఉన్నది. పాప్‌కార్న్ మీద జీఎస్టీ 5 శాతం మాత్రమే అన్నారు. కానీ బ్రాండెడ్ అయితే 12 శాతం, షుగర్ కోటెడయితే 18 శాతం జీఎస్టీ ఉంటుంది. జీవిత బీమా ప్రీమియం మీద జీఎస్టీ లేదన్నారు. కానీ అది వ్యక్తిగత బీమాలకు మాత్రమే వర్తిస్తుంది. గ్రూప్ బీమాకు జీఎస్టీ కట్టాల్సిందే. ఇలాంటివి చాలా ఉన్నాయి.
స్థూలంగా పన్ను రేట్లు తగ్గడం వలన అదే నిష్పత్తిలో విని మయం కూడా పెరిగి ప్రభుత్వ ఖజానాకు వాటిల్లే నష్టం నామమాత్రంగానే ఉండబోతున్నదని ఎస్‌బీఐ ఇదివరకే అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగానే ఈ నవరాత్రి వేడుకల్లో వివిధ అంశాలవారీగా 25 శాతం నుంచి 100 శాతం వరకు గతంతో పోలిస్తే అమ్మకాలు పెరిగాయని అధికార వర్గాలను ఉటంకిస్తూ పత్రికల్లో వార్తలొచ్చాయి. ఈ ఎనిమిదేళ్లలో అమలు చేసిన గబ్బర్ సింగ్ ట్యాక్స్ విధానం వల్ల ప్రజలకు జరిగిన నష్టమెంత అనేదానిపై మాత్రం ఎటువంటి సింహావలోకనం అధికారికంగా జరగలేదు.
జీఎస్టీ అమలుకు ముందు సంవత్సరం అంటే, 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడు జీఎస్టీ పరిధిలో ఉన్న పరోక్ష పన్నుల ద్వారా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వా లకు సమకూరిన ఆదాయం సుమారు 12 లక్షల కోట్లని అంచనా. ఇదే ఆదాయం 2024–25 నాటికి 22 లక్షల కోట్లకు ఎగబాకింది. ఇందులో ఏటికేడు సహజంగా వుండే వృద్ధి కొంత ఉండవచ్చు. కాని సింహభాగం వృద్ధి మాత్రం జీఎస్టీ ద్వారా సాధ్యమైనదే.
అయితే ఇంత భారీ పెరుగుదలకు కారణమెవరు? దేశంలో ఈ పదేళ్లలో శరవేగంగా పుట్టుకొచ్చిన బిలియనీర్లూ, మిలియ నీర్లా? కానేకాదు. సాధారణ పేద మధ్య తరగతి ప్రజలు కడుపు కట్టుకొని ఖజానాకు ముడుపు కట్టిన ఫలితమే ఈ అసాధారణ పెరుగుదల. ఆదాయాల్లో, ఆస్తిపాస్తుల్లో అట్టడుగున ఉండే 50 శాతం మంది పేద ప్రజలు జీఎస్టీలో 64 శాతం చెల్లిస్తున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది.
వీరికంటే ఎగువన ఉండే 40 శాతం మంది జీఎస్టీ చెల్లింపుల వాటా 33 శాతం. ఇక అగ్రశేణి పది శాతం సంపన్నుల సంగతి. ఈ పదేళ్లలో వీరి సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందని అనేక అధ్యయనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ పది శాతం కుబేరులు సమష్టిగా మోస్తున్న జీఎస్టీ భారం కేవలం మూడు శాతం. యాభై శాతం మంది పేదలు 64 శాతం చెల్లిస్తుంటే 10 శాతం పెద్దలు 3 శాతం చెల్లిస్తున్నారనేది ఈ జీఎస్టీ రాజ్‌లో ఒక కఠిన వాస్తవం.
అధికాదాయం కలిగిన వారు చెల్లించడానికి జీఎస్టీ కాకుండా వేరే పన్నులున్నాయని వాదించవచ్చు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయ పన్ను, అధికాదాయంపై సర్‌ఛార్జ్, కేపిటల్ గెయిన్స్ అంతా కలిపి సమకూరింది 11,56,000 కోట్లు. అదే సమయంలో 50 శాతం పేదలు జీఎస్టీ రూపంలో చెల్లించింది 22 లక్షల కోట్లలో 64 శాతం. అంటే సుమారు 14 లక్షల కోట్లు. మన సమాజంలో త్యాగమెవరిదో, భోగమెవరిదో చెప్పడానికి ఈ అంకెలు అద్దం పడతాయి.
ఈ జీఎస్టీ కాలంలోనే దేశ ప్రజల ఆదాయాల్లో పెరుగుతున్న అసమానతలపై ఆక్స్‌ఫామ్ లాంటి సంస్థలు ఏటేటా సవివర మైన నివేదికలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ విష యాలకు మరో కొత్త పార్శ్వం తోడైంది. కార్తీక్ మురళీధరన్ అనే ఆర్థికవేత్త శనివారం నాటి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో ఒక వ్యాసం రాస్తూ ఆదాయాల పరంగా ఇండియాను మూడు ఇండియా లుగా పేర్కొన్నారు. గతంలో లోహియా, ఫెర్నాండెజ్ వంటి సోషలిస్టులు గ్రామీణ భారత్, అర్బన్ ఇండియాలుగా రెండుగా విభజించి మాట్లాడేవారు. ఇప్పుడది మూడుకు చేరింది. ఇండస్ వ్యాలీ రిపోర్ట్‌ను ఉటంకిస్తూ కార్తీక్ మురళీధరన్ ఈ ప్రస్తావన చేశారు.
ఇందులో ఒకటవ ఇండియా పది శాతం జనాభా గల సంప న్నులది. వీరి తలసరి ఆదాయం 15 వేల డాలర్లు. తర్వాత శ్రేణిలోని రెండో ఇండియా 20 శాతం మంది ప్రజలది. వీరి తలసరి ఆదాయం 3 వేల డాలర్లు. ఇక 70 శాతం మంది భారతీయుల ఆదాయం వెయ్యి డాలర్లు. వాళ్లే మూడో భారత్. ప్రపంచ బ్యాంకు వర్గీకరణ ప్రకారం 13,936 డాలర్ల కంటే ఎక్కువ తలసరి ఆదాయం వున్న దేశం అధికాదాయం గల దేశం కింద లెక్క. 14 కోట్లకు పైగా జనాభా ఉన్న మన ఫస్ట్ ఇండియా ఈ శ్రేణిలోకి వస్తుంది.
4,496 డాలర్ల నుంచి 13,935 డాలర్ల మధ్యన తలసరి ఆదాయం ఉండే దేశాలను అప్పర్ మిడిల్ ఆదాయం గల దేశంగా ప్రపంచ బ్యాంకు పరిగణించింది. మూడు ఇండియాల్లో ఒకటి కూడా ఈ శ్రేణిలోకి రాలేదు. లోయర్ మిడిల్ క్లాస్‌లోకి మన 20 శాతం జనాభా (సుమారు 30 కోట్లు) ఉన్న ఇండియా చేరింది. 1,136 డాలర్ల నుంచి 4,495 డాలర్ల తలసరి ఆదాయమున్న దేశాలు ఈ లోయర్ మిడిల్ క్లాసులోకి వస్తాయి. 1,135 డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయమున్న దేశాలు ప్రపంచ బ్యాంకు దృష్టిలో అల్పాదాయ దేశాలు, అంటే పేద దేశాలు.
ఇందులోకి మన 70 శాతం (సుమారు వంద కోట్లు) జనాభా వస్తుంది. అంటే మన దేశంలోని వంద కోట్లమంది జీవన ప్రమాణాలు ఆఫ్రికా ఖండంలోని అతి పేద దేశాల ప్రజలతో ఇంచుమించు సమానమన్నమాట. ఇదిగో ఈ నిరుపేదలే గడచిన ఒక్క సంవత్సరంలో వసూలైన జీఎస్టీలో (22 లక్షల కోట్లు) అత్యధిక భాగాన్ని చెల్లించారు. ఈ ప్రజలకు ఇప్పుడు కొంత ఉపశమనం కలిగించడాన్ని స్వాగతించవలసిందే. కానీ ఈ ప్రభుత్వమే చెబుతున్నట్టు ఎనిమిదేళ్ల ‘నిర్హేతుక’ విధానానికి పేదలు చెల్లించిన మూల్యం సంగతి? కనీసం క్షమాపణలైనా చెప్పరా? పైగా పండుగ చేసుకోమనడం ఒక క్రూర పరిహాసం.
ఇటువంటి పరిహాసాలు చేయడం ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి నాయకుడు చంద్రబాబుకు పరిపాటి. కరుడుగట్టిన పేద ప్రజల వ్యతిరేకిగా ఆయనది చెక్కుచెదరని ట్రాక్ రికార్డు. గడిచిన ఎన్నికలకు ముందు ఆయన చేసిన అనేక బూటకపు వాగ్దానాల్లో కరెంటు ఛార్జీలు తగ్గిస్తామనేది ఒకటి. కానీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే 15,450 కోట్ల మేరకు ట్రూ–అప్ పేరుతో జనాన్ని బాదారు. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ఆమోదించిన దానికంటే విద్యుత్ కొను గోలు – పంపిణీ మీద ఎక్కువ వ్యయమైతే ఈఆర్‌సీ అనుమతితో పెరిగిన వ్యయానికి అనుగుణంగా ట్రూ–అప్ ఛార్జీలు వసూలు చేస్తారు.
వివిధ కారణాల వల్ల ఆమోదించిన వ్యయం కంటే తక్కువ ఖర్చయినప్పుడు ఆ మిగులును వినియోగ దారులకు రీఫండ్ చేయవలసి ఉంటుంది. తొలి రోజుల్లో బాదేసిన 15,545 కోట్ల బాదుడుకు తోడు మరో విడత 2,700 కోట్ల బాదుడుకు ప్రతిపాదనలు పంపించారు. ట్రూ–డౌన్ చేయవలసిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని అందులో 1,800 కోట్ల బాదుడుకే ఈఆర్‌సీ అనుమతించింది. అ సొమ్మును అప్పటికే వసూలు చేసినందున 900 కోట్లు వినియోగదారులకు రీఫండ్ చేయాలని ఆదేశించింది.
ఇప్పటికే వినియోగదారులపై ట్రూ–అప్ పేరుతో బాదేసి వసూలు చేస్తున్న మొత్తం 15,545 కోట్లు, ట్రూ–అప్‌కు అదనపు ప్రతిపాదన 2,700 కోట్లు. వెరసి 18 వేల కోట్ల పైచిలుకు. ఇందులో 900 కోట్లను రీఫండ్ చేయాలని ఈఆర్‌సీ ఆదేశించింది. మొత్తం బాదుడులో ఇది ఐదు శాతం. వినియోగదారుని జేబు లోంచి రూపాయి లాగేసుకొని ఓ ఐదు పైసలు చేతిలో పెట్టి ఎంజాయ్ చేయాలని చెబుతున్నారు. మొదట్లో ఇదో గొప్ప వరంలాగా యెల్లో మీడియా, ‘దేశం’ పెద్దలు తెగ హడావుడి చేశారు.
కానీ ఈఆర్‌సీ ఆదేశాల సంగతి బయటపడేసరికి జీఎస్టీ ఉత్స వాలలో కలపకుండా విడిగా పార్టీ వేదికల ద్వారా ఇదో అద్భుత చర్యగా ప్రచారం చేసుకోవాలని నిర్ణయించారు. చంద్రబాబు స్వయంగా ఇది కనీవినీ ఎరుగని కార్యక్రమంగా వర్ణించు కున్నారు. ఎన్నికల హామీకి అనుగుణంగా చార్జీలను తగ్గిస్తు న్నామనీ, ఇది తమ సమర్థ నిర్వహణ ఫలితమనీ కూడా ఆయన చెప్పుకొన్నారు. వంద రూపాయలు పెంచి ఐదు రూపాయలు తగ్గించడమా ఎన్నికల హామీని నెరవేర్చడమంటే? దీన్ని సమర్థవంతమైన నిర్వహణగా పరిగణించాలా?
ప్రజలకు ఇటువంటి షాకులివ్వడం పండుగ చేసుకో మనడం చంద్రబాబు సర్కార్‌కు అలవాటే. ఈ పదహారు మాసాల కాలంలోనే ఆయన సర్కార్ చేసిన గాయాలు పేద, మధ్య తరగతి ప్రజల నిలువెల్లా కనిపిస్తున్నాయి. చేసిన నమ్మక ద్రోహాలకు ఊరూరా శిలాఫలకాలు వేయవచ్చు. ఏటా సమారు 32 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన ‘ఆడబిడ్డ’ పథ కాన్ని పూర్తిగా ఎత్తివేసి, ప్రతి నిరుద్యోగికి నెలకు 3 వేల రూపా యలు ఇస్తామన్న హామీని ఎగవేసి, మిగిలిన హామీలను అర కొరగా, అదీ ఏడాది ఆలస్యంగా ప్రారంభించి సూపర్ సిక్స్‌ను అమలుచేశామని చెప్పుకోగలిగిన ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుంది అనుకోవాలి.
ఈ పదహారు మాసాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ కొలువులు తీసి ‘నరేగా’ పథకాన్ని నీరుగార్చి గ్రామీణ ఉపాధిని దెబ్బతీసినందువల్ల జరిగిన నష్టమెంత? పేద ప్రజలు కోల్పోయిన ఆదాయ మెంత? లెక్కతీయాలి కదా! ప్రజారోగ్యాన్ని పడకేయించిన కారణంగా, ఆరోగ్యశ్రీని కోమాలోకి పంపినందువల్ల, ఆరోగ్య ఆసరా గొంతు నులిమిన ఫలితంగా, అంబులెన్స్ సర్వీసులకు పెట్టిన పంచర్ల పాపం వలన పేద మధ్య తరగతి ప్రజలకు జరిగిన, జరుగుతున్న నష్టమెంత? వైద్య వ్యాపారులకు ఒన గూరిన లాభమెంత? విద్యారంగంలో గేమ్ ఛేంజర్ వంటి ‘నాడు–నేడు’ అనే బృహత్తర కార్యక్రమాన్ని నిలిపివేసి, పేద విద్యార్థులు అందుకున్న ఉన్నతమైన వసతులను ఊదిపారేసినందువల్ల ఐదున్నర లక్షలమంది పేద మధ్యతరగతి వర్గాల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లను వదిలేశారు.
ఫలితంగా విద్యా వ్యాపారులకు కలిగిన లాభమెంత? పేద ప్రజలకు కలిగిన నష్టమెంత? జగన్ ప్రభుత్వం కొనసాగి వుంటే అప్పటికే పూర్తయిన పది లక్షల ఇళ్ళకు అదనంగా మరో పది లక్షలు పూర్తయ్యేవి. ఆ కుటుంబాల కలలను కాల్చేసినందుకు వారి గుండెల్లో గూడుకట్టుకున్న విషా దపు విలువెంత? 30 లక్షల మంది నడివయసు స్త్రీల చేయూతను లాగేసినందువల్ల ఆ మహిళలు చేస్తున్న ఆక్రందనను ఎలా ఉపశ మింపజేస్తారు! ఇటువంటి పర్యవసానాలు ఈ పదహారు మాసాల పాలన ఫలితంగా ఎన్నో ఉన్నాయి. అన్ని లెక్కలూ వేసి లాభపడ్డవాళ్ళను పండుగ చేసుకోమంటే బాగుంటుంది. గాయ పడిన వారితో గేమ్స్ ఆడటం అమానుషం!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com