
గాజాలో రెండేళ్లుగా తాను సాగిస్తున్న దుశ్చర్యలను చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయిన ప్రపంచానికి ఇజ్రాయెల్ ఊహించని షాక్ ఇచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందంపై ఖతార్ రాజధాని దోహాలో సమావేశమైన హమాస్ రాజకీయ బృందాన్ని లక్ష్యంగా చేసుకుని మంగళవారం వైమానిక దాడులకు తెగబడి ఆరుగురిని హతమార్చింది. రాయబార కార్యాలయాలు, సూపర్ మార్కెట్లు, పాఠశాలలు ఉన్న కట్టుదిట్టమైన భద్రత గల ప్రాంతంలో దాడి జరపటాన్ని గమనిస్తే ఇజ్రాయెల్ దేన్నీ ఖాతరు చేయదల్చు కోలేదని స్పష్టమవుతోంది.
కాల్పుల విరమణ సాకారమై, హమాస్ చెరలోని బందీలు విడుదల కావాలని ఇజ్రాయెల్ కూడా కోరుకుంటోంది. కనీసం పైకి అలా చెబుతోంది. ఒప్పందానికి హమాస్‌కు ఇదే చిట్టచివరి అవకాశమని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలోనే ఆ సంస్థ సమావేశమైంది. రెండేళ్లుగా ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య రాజీ కుదిర్చేందుకు ఖతార్ ప్రయత్నిస్తోంది. అందుకు అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుంది. హమాస్‌ను ఒప్పించాల్సిన అవసరం ఏర్పడినప్పుడల్లా ఆ రెండూ ఖతార్‌నే ఆశ్రయించేవి.
పైగా అమెరికాకు అది అత్యంత సన్నిహిత దేశం. పశ్చిమాసియాలోని అతి పెద్ద అమెరికా సైనిక స్థావరం ఆ దేశంలోనే ఉంది. ఇటీవల ట్రంప్ ఖతార్ వచ్చినప్పుడు ఆయనకు అత్యంత విలాసవంతమైన బోయింగ్–747 జెట్ విమానాన్ని కానుకగా సమర్పించుకుంది. అమెరికాతో లక్ష కోట్ల డాలర్ల రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇన్ని ‘మంచి లక్షణాలు’ గల దేశంపై ఇజ్రాయెల్ ఎట్లా దాడి చేయగలిగిందన్నదే గల్ఫ్ దేశాల రాజధానుల్లో ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం.
గాజాలో శాంతి నెలకొనకుండా చూడటమే ఇజ్రాయెల్ ఉద్దేశంగా కనబడుతోందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ చేసిన వ్యాఖ్య నిజమే కావొచ్చుగానీ... అందుకు ఖతార్ సహా గల్ఫ్ దేశాల బాధ్యత కూడా ఉంది. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాద చర్యకు పాల్పడి 1,195 మందిని అమానుషంగా కాల్చిచంపి 250 మంది పౌరులను అపహరించింది. ప్రపంచ దేశాలన్నీ ఆ ఘాతుకాన్ని ఖండించాయి.
ప్రతీకారం పేరుతో ఈ రెండేళ్లలో ఇజ్రాయెల్ 64,656 మంది పాలస్తీనా పౌరులను పొట్టనబెట్టుకుంది. రేపో మాపో పూర్తిగా గాజాను అధీనంలోకి తెచ్చుకోబోతోంది. ఈ కాలమంతా గల్ఫ్ దేశాలు చోద్యం చూశాయి. సిరియా, లెబనాన్, ఇరాన్, ఇరాక్, యెమెన్‌లలో అది వైమానిక దాడులు సాగించినా మౌనంగా ఉండిపోయాయి.
దాని పర్యవసానంగానే ‘మిత్రదేశం’గా ఉన్న ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడికి దిగింది. మరో దేశం సార్వభౌమ త్వాన్ని దెబ్బతీసేందుకు ఏ దేశమూ పూనుకోరాదని ఐక్యరాజ్యసమితి చార్టర్ నిర్దేశిస్తోంది. అలాచేస్తే అది దురాక్రమణే అవుతుందంటున్నది. కానీ తాను అన్నిటికీ అతీతమని ఇజ్రాయెల్ భావన.
గల్ఫ్ దేశాలన్నీ కలిసి ఏదో ఒకటి చేయాలని ఖతార్ ఇచ్చిన పిలుపుతో గురువారం సమావేశం జరిగింది. త్వరలో అరబ్–ఇస్లామిక్ శిఖరాగ్ర సదస్సు కూడా ఉంటుందంటున్నారు. అయితే ఆ ‘ఏదో ఒకటి’ సైనిక చర్య అయితే కాదు. కనీసం ఆ ఆలోచన చేసినా అమెరికా నొచ్చుకుంటుందని వాటికి తెలుసు. అమెరికా–గల్ఫ్ దేశాల బంధం ఉభయ తారకం. అమెరికా సైనిక సాయంపై గల్ఫ్ ఆధారపడి ఉండగా... పశ్చిమాసియాలో తన పలుకుబడి చెక్కుచెదరకుండా ఉండటానికి గల్ఫ్ దేశాల అవసరం అమెరికాకుంది.
ఈ అమరికను మార్చటమే ఇజ్రాయెల్ ఆంతర్యం కావొచ్చు. ఎటూ గాజా హస్తగతం కాబోతున్నది కనుక, ఇదే అదునుగా ఈ ప్రాంతంలో తానే ప్రధాన కేంద్రంగా ఉండాలని ఇజ్రాయెల్ భావిస్తున్నట్టు కనబడుతోంది. కానీ అదంత సులభం కాదు. సౌదీ, యూఏఈ, ఖతార్, ఒమన్, కువైట్, బహ్రెయిన్‌ల సమష్టి మదుపు నిధి 4 లక్షల కోట్ల డాలర్ల పైమాటే. ఈ సంపద ఆసరాతో గల్ఫ్ దేశాలు ప్రపంచ ఇంధన మార్కెట్లను శాసించగలవు.
గణనీయంగా పలుకుబడి పెంచుకోగలవు. అందుకే ‘ఏదో ఒకటి’ చేయాలన్న ఖతార్ పిలుపుపై ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. తమ చాప కిందకు నీళ్లొస్తుంటే చూస్తూ ఊరుకోవటం ఆత్మహత్యా సదృశమని గల్ఫ్ దేశాలు ఇప్పటికైనా గుర్తించాలి. ఈ సంక్షోభ సమయంలో అమెరికాకు వంతపాడటం కాక, సొంత గొంతుక వినిపిస్తేనే మనుగడ ఉంటుందని తెలుసుకోవాలి.