
ఎనిమిదేళ్ల క్రితం అమల్లోకొచ్చిన సరుకులు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఎట్టకేలకు వచ్చే దీపావళి నాటికి కొత్త రూపాన్ని సంతరించుకోబోతోంది. మొన్న శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుపై నుంచి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ చల్లని కబురందించారు.
2016లో లోక్‌సభ 122వ రాజ్యాంగ సవరణను ఆమోదించి జీఎస్‌టీకి మార్గం సుగమం చేయటానికి ముందు పదిహేనేళ్లపాటు ఈ ఏకీకృత పన్నుల వ్యవస్థపై చర్చోపచర్చలు జరిగాయి. రాష్ట్రాలను ఒప్పించేందుకు అంతకు ముందున్న ఎన్డీయే సర్కారు, తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం ఎడతెగని ప్రయత్నాలు చేశాయి. కానీ ఏకాభిప్రాయం కుదరలేదు.
చివరకు 2017లో అమల్లోకి వచ్చినప్పుడు సైతం విపక్ష రాష్ట్రాలు రుసరుసలుపోయాయి. ఇంత పెద్ద సంస్కరణలో తన పాత్ర ఘనం అని చెప్పుకోవటానికైనా పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగే ఉత్సవానికి వెళ్లాలని కాంగ్రెస్ అనుకుంది. కానీ చివరకు ముఖం చాటేసింది. జీఎస్‌టీ విషయంలో వివిధ వర్గాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోలేదని, చిన్న వ్యాపారులూ వర్త కులూ దీనివల్ల అగచాట్లు పడతారని కారణాలుగా చూపింది. వామపక్షాలు సరేసరి.
నిజాలు నిష్టూరంగానే ఉంటాయి. జీఎస్‌టీ రాకతో కేంద్రం విధిస్తున్న ఏడెనిమిది రకాల పన్నులు రద్దుకావటంతో పాటు రాష్ట్రాలు విధించే రకరకాల పన్నులకు స్వస్తి చెబుతామని, పన్ను వసూళ్లను హేతుబద్ధీకరిస్తామని అప్పట్లో ప్రకటించారు. ఇందువల్ల ఆదాయం కోల్పోతామన్న రాష్ట్రాల ఆందోళనను ఉపశమింపజేసేందుకు అయిదేళ్లపాటు ఆ లోటును పూడుస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.
కానీ ఆచరణలో సమస్యలెలా వస్తాయో తెలియాలంటే ఇటీవల కర్ణాటకలో చిన్న వ్యాపారులు పడిన అగచాట్లను ప్రస్తావించుకోవాలి. వివిధ రకరకాల యాప్‌ల ద్వారా వినియోగ దారుల నుంచి చెల్లింపులు స్వీకరిస్తున్న తోపుడు బండి వ్యాపారులనూ, వీధుల్లో చిన్నా చితకా దుకాణాలు నడుపుకునేవారినీ లక్ష్యంగా చేసుకుని జీఎస్‌టీ నిబంధనలు ఉల్లంఘించారంటూ అక్కడి వాణిజ్య పన్నుల విభాగం 13,000 నోటీసులు జారీచేసింది.
వీటికి ఏం జవాబివ్వాలో, ఎవరిని ఆశ్రయించాలో కూడా తెలియక, అందుకయ్యే ఖర్చు భరించలేక చాలామంది నగదు చెల్లించాలని వినియోగదారుల్ని కోరటం మొదలుపెట్టారు. వాజపేయి హయాంలో నాటి ఆర్థిక మంత్రి జశ్వంత్‌సింగ్‌కు సలహాదారుగా వ్యవహరించిన విజయ్ కేల్కర్ ఈ జీఎస్‌టీ ఆలోచనకు ఆద్యుడు. ఆయన ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ పలు దేశాల పన్ను వ్యవస్థలను అధ్యయనం చేసి దీన్ని రూపొందించింది. మధ్యతరగతి, అట్టడుగువర్గాలవారు పన్నుపోటు నుంచి ఉపశమనం పొందుతారని చెప్పింది. కానీ జరిగిందంతా వేరు.
పరోక్ష పన్నులు చెల్లించేవారి నుంచి మరింత పిండుకోవడానికే జీఎస్‌టీ తీసుకొస్తున్నారని, ప్రత్యక్ష పన్నుల జోలికి వెళ్లాలన్న ఆలోచనే కేంద్రం చేయటం లేదని విమర్శలొచ్చాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 11.7 లక్షల కోట్ల జీఎస్‌టీ వసూళ్లుండగా ఇప్పుడది దాదాపు రెట్టింప యింది. సగటున ప్రతి నెలా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
కానీ సాధారణ వర్గాల అవస్థలు అంతకంతా పెరిగాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలు, ఇంకా ఆ దిగువనుండేవారూ జీఎస్‌టీ కింద దాఖలు చేయాల్సిన రకరకాల పత్రాలు, వివాదాలు, ప్రభుత్వం నుంచి వెనక్కు రావలసిన సొమ్ము కోసం పడి గాపులు... వీటన్నిటితో విసిగిపోయారు. ఈ సంక్లిష్ట వ్యవస్థను సంతృప్తిపరిచే మార్గం దొరక్క అల్లాడిపోయారు.
ఈ ప్రత్యక్ష పన్నుల వ్యవస్థ ద్వారా వసూళ్లు భారీగా పెరుగుతుంటే, ప్రత్యక్ష పన్నులు చెల్లించే కార్పొరేట్‌ల నుంచి రావాల్సిన ఆదాయం పడిపోవటం ఒక వైచిత్రి. 2023 –24లో వివిధ రకాల ప్రోత్సాహాల కింద దాదాపు లక్ష కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఇచ్చామని ఇటీవల పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.
జీఎస్‌టీ సరికొత్త రూపంలో రాబోవటం అన్ని వర్గాలకూ శుభవార్త. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతాలుగా ఉన్న నాలుగు స్లాబ్‌ల స్థానంలో ఇకపై రెండే... 5, 18 శాతాలు ఉంటాయని కేంద్రం చెబుతోంది. లగ్జరీ కార్ల వంటి విలాస వస్తువుల పైనా... పొగాకు, పాన్‌మసాలా, ఆన్‌లైన్ గేమింగ్ వంటి హానికారకాల పైనా మాత్రం 40 శాతం వరకూ ఉంటుంది.
జీఎస్‌టీ వసూళ్లు స్థిరత్వంలో పడటం వల్ల సాధారణ ప్రజానీకాన్ని పన్నుపోటు నుంచి తప్పించాలని భావించినట్టు కనబడుతున్నా, ఇంతకాలమూ ఈ పరిధిలో లేని మద్యం, ఇంధనం వంటివాటిని చేర్చబోతున్నారని అంటున్నారు.
సహజంగానే దీనిపై రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా ప్రపంచమంతటా ఒకరకమైన మాంద్యం అలుముకున్న వర్తమానంలో జీఎస్‌టీ సంస్కరణలు మన ఆర్థికవ్యవస్థకు ఊతాన్నివ్వగలవనీ, ఈ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలూ చాలావరకూ తగ్గుతాయనీ ఆశించాలి.