జీఎస్‌టీ గణాంకాల్లో వెల్లడైన చేదు నిజం
9 నెలల్లో రూ.1,785 కోట్ల రాబడి ఫట్
గతేడాదితో పోలిస్తే 5.34 శాతం పడిపోయిన జీఎస్‌టీ ఆదాయం
2024–25 ఆర్థిక ఏడాది 9 నెలల్లో రూ.33,371 కోట్ల ఆదాయం
ఈ ఏడాది ఏప్రిల్–డిసెంబర్ ఆదాయం రూ.31,586 కోట్లకే పరిమితం
డిసెంబర్‌లో రూ.2,652 కోట్లకే పరిమితమైన జీఎస్‌టీ
నవంబర్ నెలలో జీఎస్‌టీ ఆదాయం రూ.2,697 కోట్లు
బాబు సంపద సృష్టి నేలచూపులే
సాక్షి, అమరావతి: సంపద సృష్టించి.. రెట్టింపు సంక్షేమ పథకాలు అమలు చేస్తానంటూ ప్రగల్భాలు పలికి అధికారం చేపట్టిన చంద్రబాబు.. కొత్తగా సంపద సృష్టించగా పోగా ఉన్నదాన్ని కూడా ఆవిరి చేసేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన జీఎస్‌టీ గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలానికి జీఎస్‌టీ ఆదాయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ.1,785 కోట్లు పడిపోయింది.
2024–25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో రూ.33,371 కోట్లుగా ఉన్న జీఎస్‌టీ ఆదాయం ఈ ఏడాది 5.34 శాతం తగ్గి రూ.31,586 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా జీఎస్‌టీ ఆదాయం 6.8 శాతం పెరగడం గమనార్హం. ఈ 9 నెలల కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక 13.1 శాతం, తమిళనాడు 8.1 శాతం, కేరళ 8.4 శాతం, తెలంగాణ 5.1 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
నెలనెలా తగ్గుతున్న ఆదాయం
రాష్ట్ర జీఎస్‌టీ ఆదాయం ప్రతినెలా తగ్గుతూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్ నెలలో రూ.4,686 కోట్లుగా ఉన్న జీఎస్‌టీ ఆదాయం క్రమంగా తగ్గుతూ డిసెంబర్ నాటికి రూ.3,137 కోట్లకు పడిపోయింది. గతేడాది డిసెంబర్ నెలలో జీఎస్‌టీ ఆదాయం భారీగా తగ్గిపోవడం.. ఈ ఏడాది డిసెంబర్ నెలలో 6 శాతం వృద్ధి నమోదు కావడానికి కారణంగా అధికారులు వెల్లడిస్తున్నారు.
చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. డిసెంబర్ 2023 డిసెంబర్‌లో రూ.3,545 కోట్లుగా ఉన్న స్థూల జీఎస్‌టీ ఆదాయం డిసెంబర్ 2025 నాటికి రూ.3,137 కోట్లకు పడిపోయింది. రెడ్‌బుక్ రాజ్యాంగంపై దృష్టి సారించిన ప్రభుత్వం అభివృద్ధికి తిలోదకాలు ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాలను అటకెక్కించింది. ఫలితంగా ప్రజల ఆదాయం క్షీణించి కొనుగోలు శక్తి పడిపోయింది. జీఎస్‌టీ రాబడి తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు.


