అద్దంకి: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని కోటికి పైగా నగదు పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. అద్దంకికి చెందిన ఎస్.నాగేశ్వరరావు బ్యాంక్ జనరల్ మేనేజర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ప్రస్తుతం అద్దంకి పట్టణంలో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. నవంబర్‌లో నాగేశ్వరరావుకు అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. ‘మీ ఆధార్ కార్డు ప్రముఖ నేరగాడి వద్ద దొరికింది.
మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. డబ్బు ఇవ్వకుంటే భార్యాభర్తలిద్దరినీ ముంబై తీసుకొచ్చి జైల్లో పెడతాం’ అంటూ బెదిరించాడు. భయపడిన నాగేశ్వరరావు డిసెంబర్ 3న రూ.53 లక్షలు సైబర్ నేరగాడి ఖాతాకు జమ చేశారు. ఇలా మొత్తం రూ.1.23 కోట్లు బదిలీ చేశారు. ఇంకా నగదు ఇవ్వాలంటూ ఆ వ్యక్తి పదే పదే ఫోన్ చేస్తుండటంతో అనుమానం వచ్చిన నాగేశ్వరరావు స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ క్రైం పోలీసులు నగదు జమ చేసిన 13 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు.


