డీటీ కథ నడపగా..నేతలు దోచేయగా!
కందుకూరులో యథేచ్ఛగా రేషన్ బియ్యం అక్రమాలు అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే దందా బియ్యం అక్రమాలపై సోషల్ మీడియాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ ఆడియో సంచలనంగా మారిన ముడుపుల వ్యవహారం పెదపవని కేంద్రంగా బియ్యం మాఫియా ఒంగోలుకు చెందిన వ్యాపారి రైస్‌మిల్లులో పాలిషింగ్ పోర్టు మీదుగా విదేశాలకు పేదల బియ్యం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
డీటీనే కీలక సూత్రధారి ?
జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా పెట్రేగిపోతోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డేలేకుండా పోయింది. తిలాపాపం తలా పిడికెడు అన్న సామెతగా ఈ రేషన్ బియ్యం అక్రమ దందాలో అధికార పార్టీకి చెందిన కీలక నేతలతో పాటు, అధికార యంత్రాంగం పాలుపంచుకుంటున్నారు. దీనికి గాను ప్రతినెలా లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ దందా గురించి ఇటీవల బహిర్గతమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అవి జిల్లాలో సంచలనంగా మారాయి.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
కందుకూరు నియోజకవర్గంలో పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం పెద్ద ఎత్తున బ్లాక్‌మార్కెట్‌కు తరలుతోంది. అధికార పార్టీకి చెందిన నాయకుల ఆధ్వర్యంలోనే రేషన్ దందా నడుస్తోందన్నది బహిరంగ రహస్యమే. ప్రతినెలా టన్నుల కొద్దీ రేషన్ బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నార్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతున్నా అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. అంతేకాదు రేషన్ బియ్యం అక్రమ దందాను వివరిస్తూ స్వయంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ ఓ బియ్యం వ్యాపారితో ఫోన్‌లో జరిపిన సంభాషణ ఇటీవల వెలుగుచూసింది. ఆ ఆడియో టేపులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌గా మారాయి. ఈ అక్రమ వ్యాపారంలో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఏ పోలీస్ అధికారి ఎంత తీసుకుంటున్నాడు వంటి వివరాలన్నీ పూసగుచ్చినట్లు డీటీ వివరించడం సంచలనంగా మారింది.
అధికార పార్టీ కీలక నేత ఆధ్యర్యంలోనే అంతా..
రేషన్‌బియ్యం వ్యాపారం మొత్తం అధికారపార్టీ ప్రజాప్రతినిధి, ఆయన అనుచరుడి కనుసన్నల్లోనే ఈ అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డీటీ వ్యాపారితో జరిపిన సంభాషణలో ఈ దందాకు కీలక సూత్రధారుల పేర్లు సైతం బహిర్గతమయ్యాయి. నియోజకవర్గంలో వచ్చే మొత్తం బియ్యాన్ని ప్రతినెలా ఒంగోలుకు చెందిన ఓ వ్యాపారికి చేర్చేలా కందుకూరుకు చెందిన అధికార పార్టీ నేత ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకు ప్రతిఫలంగా నెలకు రూ.25 లక్షల వరకు ఆ వ్యాపారి అధికార పార్టీ నేతలకు చెల్లిస్తారు. ప్రతినెలా సుమారు 10 వేల బస్తాల బియ్యాన్ని ఆ వ్యాపారికి ఇచ్చేలా ఈ డీల్ కుదిరినట్లు సమాచారం. నియోజకవర్గం పరిధిలోని రేషన్ డీలర్లంతా వారికి కేటాయించిన బియ్యాన్ని ప్రజలకు పంచకుండా నేరుగా అధికార పార్టీ నేతలకు ఇవ్వాలని హుకుం జారీ చేసినట్టు తెలిసింది. దీనికి ప్రతిఫలంగా రేషన్ డీలర్‌కి కేజీకి రూ.10 నుంచి రూ.12ల వరకు చెల్లిస్తున్నారని తెలుస్తోంది. దీంతో లబ్ధిదారులు ఎవరైనా బియ్యం కావాలని అడిగినా డీలర్లు ఇచ్చే పరిస్థితి లేదు. బియ్యం లేవు డబ్బులు తీసుకుని వెళ్లండి అంటూ బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఒకరిద్దరు ఇచ్చినా తూకంలో భారీగా తేడా వస్తుందంటూ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
పెదపవని కేంద్రంగా...
బియ్యం దందాకు లింగసముద్రం మండలం పెదపవని గ్రామంలోని రైస్ మిల్లు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని సమాచారం. అధికార పార్టీ నేతల నుంచి వచ్చిన బియ్యాన్ని ఒంగోలుకు చెందిన వ్యాపారి పెదపవని గ్రామంలో లీజుకు తీసుకున్న రైస్‌మిల్లులో నిల్వ చేస్తున్నారని తెలిసింది. ప్రతినెలా వచ్చే బియ్యాన్ని టన్నుల కొద్దీ ఈ మిల్లులోనే నిల్వ, పాలిష్ చేస్తుంటారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి కావలి మీదుగా కృష్ణపట్నం పోర్టుకు, అక్కడి నుంచి విదేశాలకు బియ్యం తరలుతున్నాయి. ఇది అంతా బహిరంగ రహస్యమే. కానీ ఏ విజిలెన్స్ అధికారిగానీ, సివిల్ సప్‌లై అధికారి, రెవెన్యూ, పోలీస్ అధికారులు గానీ ఆ మిల్లు జోలికి వెళ్లరు. దీనికి ప్రతిఫలంగా భారీగా అధికారులకు ముడుపులు వెళ్తున్నట్లు స్వయంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ ఆడియో టేపుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలోని కొంత మంది పోలీసులకు సైతం భారీగా ముడుపులు చెల్లిస్తున్నట్టు ఆ ఆడియో ఉండడం గమనార్హం. దీంతో పెదపవని రైస్‌మిల్లు కేంద్రంగా అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది.
రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం అధికార పార్టీ కీలక నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటూ డీటీ ఆడియోలో ఉందని తెలిసింది. పైగా బియ్యం బండిని పట్టుకుంటే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల నుంచి జిల్లా అధికారులకు ఫోన్లు వస్తాయని, అలాంటప్పుడు ఏ అధికారి అయినా ఏం చేస్తారు అంటూ మాట్లాడడం ఈ దందా ఏస్థాయిలో జరుగుతోందో అవగతమవుతుంది. అలాగే ఏ అధికారికి ఎంత ముట్టజెబుతున్నారో అన్నది సైతం ఆడియో ఉండడం సంచలనాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం సదరు డీటీ సెలవులో వెళ్లిపోయారని సమాచారం. ఈ ఆడియో బహిర్గతం కావడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలుస్తోంది. ఆడియో వెలుగుచూసి వారం రోజులు కావస్తున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.
రేషన్ బియ్యం దందాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీనే కీలక సూత్రధారన్న విమర్శలు ఉన్నాయి. దీని కోసం కొందరు బియ్యం వ్యాపారులను వేధిస్తుండడంతో డీటీ ఫోన్‌ను కొందరు వ్యాపారులు రికార్డు చేసి బహిర్గతం చేశారు. నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు తప్ప మరోకరు బియ్యం వ్యాపారం చేయడానికి వీలు లేదంటూ వేధించారు. ఈయన మాట ధిక్కరించిన వ్యాపారుల బండ్లు పట్టుకుని కేసులు నమోదు చేయడం, పోలీసు స్టేషన్‌లకి పిలిపించి కొట్టించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.


