వీడని తౌషిక్‌ డెత్‌ మిస్టరీ..! | - | Sakshi
Sakshi News home page

వీడని తౌషిక్‌ డెత్‌ మిస్టరీ..!

Feb 19 2026 6:20 PM | Updated on Feb 19 2026 6:20 PM

వీడని తౌషిక్‌ డెత్‌ మిస్టరీ..!

వీడని తౌషిక్‌ డెత్‌ మిస్టరీ..!

సింగరాయకొండ: సింగరాయకొండ చైతన్య నవోదయ స్కూలులో విద్యార్థి తౌషిక్‌ డెత్‌ మిస్టరీ వీడడం లేదు. విద్యార్థి మృతి చెంది ఐదు రోజులైనా దర్యాప్తులో తీవ్ర జాప్యం నెలకొంది. ఈ సంఘటనకు సంబంధించి మృతుని తల్లిదండ్రులు సయ్యద్‌ ఆలీ, మౌలాభి స్కూల్‌ యాజమాన్యందే బాధ్యతని, కరస్పాండెంట్‌ కుమారుడే హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. అయితే స్కూల్‌ యాజమాన్యాన్ని విచారించకుండా కేసును పోలీసులు కాలయాపన చేస్తున్నారని విద్యార్థి బంధువులు మండిపడుతున్నారు.

ఆ ఆరు నిమిషాల్లో ఏం జరిగింది..?

తౌషిక్‌ మృతి సాంకేతిక ఆధారాల ప్రకారం..శనివారం సాయంత్రం 5.05 గంటల సమయంలో తాను తౌషిక్‌తో ఫోన్‌లో మాట్లాడానని తౌషిక్‌ తల్లి మౌలాభి చెబుతోంది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా 5.11 గంటల సమయంలో వార్డెన్‌ నా కుమారుడిని హాస్టల్‌ గది నుంచి రోడ్డు పక్కనే ఉన్న స్కూలు భవనం వద్దకు భుజంపై మోసుకొని తీసుకువచ్చాడని, ఆ ఆరు నిముషాల్లో ఏం జరిగితే తన కుమారుడు చనిపోయాడో చెప్పాలని ఆమె ఆ రోజు నుంచి పోలీసులను వేడుకుంటోంది. ఈ ఘటనపై ఆది, సోమవారాల్లో దర్యాప్తు చేసిన ఎస్సై బి.మహేంద్ర ఏం తేల్చారో ఇంత వరకు ప్రకటించలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మంగళవారం విద్యార్థి బంధువులు స్కూలు వద్దకు వెళ్లేసరికి కాలేజీ యాజమాన్యం మరమ్మతులు చేసుకుంటూ కనిపించారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వారు ఆవేశంతో దాడికి ప్రయత్నించారు. ఇది గమనించిన స్కూలు యాజమాన్యం కారులో పరారయ్యారు. తరువాత ర్యాలీగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని న్యాయం చేయాలని ధర్నా చేశారు.

పాఠశాలలో విద్యార్థి మృతి చెంది ఐదు రోజులు

కేసు దర్యాప్తులో తీవ్ర జాప్యం

దర్యాప్తు పేరుతో కమిటీలు, విచారణ

అధికారి మార్పు

కుమారుడి మృతిపై నిజాలు తేల్చాలంటున్న

తల్లిదండ్రులు

చిన్న బాత్‌రూమ్‌లో

టవల్‌తో ఆత్మహత్య సాధ్యమేనా?

స్కూలులోని చిన్నబాత్‌రూమ్‌లో టవల్‌తో మెడకు ఉరేసుకొని తౌషిక్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్కూలు యాజమాన్యం చెబుతోంది. అయితే దీనిపై విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు వాదన మరోలా ఉంది. ప్రతి రోజు విద్యార్థులు స్నానానికి క్యూ సిస్టంలో వెళతారని, స్నానానికి వెళ్లేటప్పుడు టవల్‌ కట్టుకుని పోతారు తప్ప ప్యాంట్‌, షర్టు వేసుకుని ఎలా వెళ్తారని ప్రశ్నిస్తున్నారు. టవల్‌తో హ్యాంగర్‌కు ఉరేసుకుని చనిపోయాడని చెబుతున్నారని, కానీ హ్యాంగర్‌ తౌషిక్‌ తలకు అందే ఎత్తులో ఉంటే మెడకు టవల్‌తో ఉరేసుకుని చనిపోవటానికి ఎలా సాధ్యమని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు తౌషిక్‌ ఉరేసుకొని చనిపోయాడంటున్న వీడియో ఇంత వరకు బయటకు రాలేదని, ఆ వీడియో ఎందుకు బయటపెట్టడం లేదని మృతుని బంధువులు ప్రశ్నిస్తున్నారు. తౌషిక్‌ మృతి ఆత్మహత్య కాదని, ఇది ముమ్మాటికి హత్యేనని, ఇందుకు కారుకులు ఎవరో నిగ్గు తేల్చాలంటున్నారు. తమ కుమారుడి స్నేహితులు కూడా కాలేజీ యాజమాన్యమే కారణమని చెబుతున్నారని, కానీ ఆ దిశగా విచారణ సాగడం లేదని, కేసును యాజమాన్యానికి అనుకూలంగా మార్చేందుకు ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోందని బంధువులు పేర్కొంటున్నారు. విచారణ జాప్యంపై మృతుని తల్లిదండ్రులు, బంధువులు ప్రశ్నిస్తుండటంతో మంగళవారం కందుకూరు సీఐని విచారణాధికారిగా నియమించారు. ఇప్పుడు మళ్లీ నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ రాజాబాబు త్రీమెన్‌ కమిటీ వేసి 4 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కమిటీలో డీఈఓ రేణుక, ఐసీడీఎస్‌ పీడీ మాధురి, తహసీల్దార్‌ రాజేష్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ క్రమంలో త్రీమెన్‌ కమిటీ విచారణలోనైనా తౌషిక్‌ డెత్‌ మిస్టరీని ఛేదించాలని తల్లిదండ్రులు, బంధువులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement